Begin typing your search above and press return to search.

కేసీఆర్ మోస్ట్ డేంజరస్ అంటున్న ఉద్యమ సింహం

By:  Tupaki Desk   |   14 Nov 2019 6:09 AM GMT
కేసీఆర్ మోస్ట్ డేంజరస్ అంటున్న ఉద్యమ సింహం
X
ఉమ్మడి రాష్ట్రంలో ఆయన మీద చర్యలు తీసుకునేందుకు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రులు తటపటాయించేవారు. ఆచితూచి అన్నట్లు వ్యవహరించేవారు. ఆందోళనలకు ఆయన పిలుపునిస్తే ఉలిక్కిపడేవారు. ఊపిరి ఆడనట్లు వ్యవహరించేవారు. ఇంతకీ ఆయన ఎవరంటారా? ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణ మాదిగ.

ఉమ్మడి రాష్ట్రంలో ఆయన నోటి నుంచి వచ్చే మాటకు నాటి ముఖ్యమంత్రులు ఎంతటి ప్రాధాన్యత ఇచ్చేవారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అలాంటి ఆయన నోటి నుంచి తాజాగా ఒక సంచలన వ్యాఖ్య వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో పాలన చేసిన ముఖ్యమంత్రులందరి కంటే అత్యంత ప్రమాదకారి కేసీఆర్ అని విమర్శించారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో ట్యాంక్ బండ్ మీద జరిగిన మిలియన్ మార్చ్ లో అనేక విగ్రహాలు ధ్వంసమైనా.. ఒక్కరికి కూడా లాఠీదెబ్బలు తగలలేదన్నారు. ఆర్టీసీ జేఏసీ నిర్వహించిన చలో ట్యాంక్ బండ్ లో కార్మికుల రక్తం కళ్ల చూసిన ఘనత కేసీఆర్ దేనని విమర్శించారు.

ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఉద్యమ సమయంలో తాను దీక్ష చేస్తే.. దాన్ని విరమించేందుకు మంద కృష్ణ మాదిగ రావాలని.. ఆయన చేతితో నిమ్మరసం ఇచ్చిన తర్వాతే దీక్ష విరమించిన కేసీఆర్.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కొద్ది రోజులకే.. మంద కృష్ణ మాదిగను జైల్లో పెట్టటం.. ఎక్కువ కాలం ఉండాల్సి రావటం లాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి.

ఉమ్మడి రాష్ట్రంలో తాను ఎన్ని ఆందోళనలకు పిలుపునిచ్చినా.. అదుపులోకి తీసుకునేందుకు సైతం నాటి ప్రభుత్వాలు వెనుకాడితే.. అందుకు భిన్నంగా తనను ఏకంగా జైల్లో పెట్టించి.. చుక్కలు చూపించిన కేసీఆర్ మోస్ట్ డేంజరస్ గా అనిపించటం తప్పేం కాదేమో? ఏమైనా.. ఒకప్పుడు కేసీఆర్ ను నెత్తిన పెట్టుకున్న మంద కృష్ణ మాదిగ ఈ రోజు ఆయన్నుఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయని చెప్పక తప్పదు