Begin typing your search above and press return to search.

ఆపరేషన్ హరీశ్.. కేసీఆర్ వ్యూహం ఇదే..!

By:  Tupaki Desk   |   26 Dec 2020 1:30 AM GMT
ఆపరేషన్ హరీశ్.. కేసీఆర్ వ్యూహం ఇదే..!
X
ఊహించని ఉపద్రవం ముంచుకొస్తోంది.. నిలువునా ముంచేస్తుందా? అన్న సందేహం కూడా కలుగుతోంది! ఆ అనుమానాలు నిజమే అన్నట్టుగా నీళ్లు కాళ్ల కిందికి వచ్చేశాయి కూడా. ఇప్పుడేం చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? జోరుగా వీస్తున్న కాషాయ పవనాలను ఎలా అడ్డుకోవాలి? ఇప్పుడు గులాబీ దళం ముందున్న సవాళ్లివే. సమాధానం వెతకాల్సిన ప్రశ్నలివే. ప్రస్తుతం గులాబీ దళపతి ఇదే పనిలో ఉన్నారు. శరవేగంగా శోధిస్తున్నారు. మరి సాధిస్తారా??

తెలంగాణ రాష్ట్రంలో దుబ్బాక ఉప ఎన్నికల్లో మొదటి దెబ్బ. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో రెండో దెబ్బ. వెనువెంటనే తగిలిన ఈ రెండు దెబ్బలు.. భవిష్యత్ లో కుంభస్థలానికి గట్టి దెబ్బ తగిలే అవకాశం ఉందని కేసీఆర్ ను హెచ్చరించాయి. ప్రస్తుత రాజకీయాల్లో అత్యంత చతురత, వ్యూహాలు పన్నేనైపుణ్యత కలిగిన అగ్రనేతల్లో కేసీఆర్ ముందు వరసలో ఉంటారు. ఎదురొస్తున్న ఈ గాలివాటం తేలిగ్గా తీసిపారేయాల్సింది కాదనే నిర్ణయానికి వచ్చిన ఆయన.. ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి తగిన విధంగా సమాయాత్తమవుతున్నారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత ఢిల్లీ పర్యటనకు వెళ్లిన కేసీఆర్.. తనదైన రాజకీయ వ్యూహాలను అమలు చేయడం హస్తినాపురం నుంచే మొదలు పెట్టారు. రాష్ట్రానికి వచ్చిన తర్వాత.. పార్టీ ముఖ్యనేతలతో తీవ్రంగా చర్చలు జరుపుతున్నారు. బీజేపీ దూకుడుకు కళ్లెం వేయడానికి అటు పార్టీలోనూ, ఇటు ప్రభుత్వంలోనూ మార్పులు చేర్పులు చేయాలని నిర్ణయించుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. పార్టీకి, ప్రభుత్వానికి మధ్య మరింత సమన్వయం అవసరం ఉందని ఆయన భావిస్తున్న కేసీఆర్.. అందుకు తగిన విధంగా ప్రణాళికలు అల్లుతున్నారని తెలుస్తోంది.

తాజాగా.. టీఆర్ఎస్ డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్‌ చేసిన వ్యాఖ్యలు.. ఈ వ్యూహాలనే సూచిస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మార్చిలోపు కేటీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టే అవకాశముందన్నారు రెడ్యా. అయితే.. ఈ చర్చ గడిచిన రెండున్నరేళ్లుగా కొనసాగుతున్నదే. కానీ.. ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్యే నోటివెంట రావడాన్ని తేలిగ్గా తీసిపారేయలేం అంటున్నారు. బీజేపీ నుంచి ఎదురుదాడి మొదలైన పరిస్థితుల్లో రెడ్యానాయక్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. కేసీఆర్ వేస్తున్న ఎత్తుగడల్లో ఇది ప్రధానమైందనే చర్చ సాగుతోంది.

కేటీఆర్‌కు సీఎం పదవి అప్పగించి, తాను జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని కేసీఆర్ ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. గత లోక్ సభ ఎన్నికల్లో ‘సారు.. కారు.. పదహారు’ అనే నినాదంతో ముందుకెళ్లారు. అయితే.. కేవలం 9 స్థానాల్లోనే గులాబీ జెండా ఎగిరింది. అక్కడ కేంద్రంలో మోదీ సర్కార్ సింగిల్ పార్టీ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. దీంతో.. గులాబీ దళపతి సైలెంట్ అయ్యారని, లేదంటే.. కేటీఆర్ సీఎం అయ్యి చాలా రోజులు అయ్యేదనే చర్చ కూడా ఉంది. ఇప్పుడు పరిస్థితులు తరుముతుండడంతో ఆ పని చేయబోతున్నారనేది రాజకీయవర్గాల్లో సాగుతున్న చర్చ.

మరో కీలకమైన అంశం ఏమంటే.. తన మేనల్లుడు, రాష్ట్ర ఆర్థిక మంత్రిగా ఉన్న తన్నీరు హరీష్ రావుకు పార్టీ పగ్గాలు అప్పగించాలనే యోచనలో ఉన్నారట కేసీఆర్. ఇప్పటికే.. కేటీఆర్ కోసం ఉద్దేశపూర్వకంగానే హరీశ్ రావును డీఫేమ్ చేస్తూ వచ్చారనే వాదన ఉంది. ఈ పక్షపాత వైఖరి వల్ల ఒకానొక సందర్భంలో హరీశ్.. కాంగ్రెస్, లేదా బీజేపీలోకి వెళ్లనున్నారు అనే చర్చ కూడా సాగింది. ఇప్పుడు టీఆర్ఎస్ కు బీజేపీతోనే ప్రమాదం పొంచి ఉంది. ఈ నేపథ్యంలో హరీశ్ ను మళ్లీ పైకి తేవాలని యోచిస్తున్నారట కేసీఆర్. కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేసి, హరీశ్ రావును వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రకటించాలని కేసీఆర్ చూస్తున్నారనే బలమైన వాదన కూడా తెలంగాణలో నడుస్తోంది. దీనివల్ల హరీశ్ రావును తొక్కేస్తున్నామనే అపవాదు తొలగించుకోవడంతోపాటు.. కేటీఆర్ ను సీఎం చేయడం.. తాను కేంద్ర రాజకీయాల్లో బిజీ అయిపోవడం అన్నీ ఒకేదెబ్బతో జరిగిపోతాయనే ఆలోచనలో ఉన్నారట కేసీఆర్. కాగా.. హరీశ్ రావుతోపాటు.. బీసీ సామాజికవర్గానికి చెందిన ఈటల రాజేందర్‌ను కూడా మరో వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది.

దేశవ్యాప్తంగా ఇప్పుడు జమిలి ఎన్నికలపైనే చర్చ. దేశంలో ఒకే ఎన్నిక ఎప్పుడైనా రావొచ్చనే ప్రచారం జరుగుతోంది. గతంలో జమిలికి టీఆర్ఎస్ పార్టీ కూడా మద్దతు పలికింది. కానీ.. అనూహ్యంగా 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లింది. తాజాగా, కేంద్ర ఎన్నికల సంఘం కూడా జమిలి ఎన్నికలకు సిద్ధమేనని ప్రకటించింది. దీనికి అవసరమైన రాజ్యాంగ సవరణ చేస్తే తాము రెడీ అని స్పష్టం చేసింది. ఇదంతా రాబోయే ఆగస్టు 15 నాటికి జరిగే అవకాశం ఉందనే చర్చ కూడా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అన్నిటికీ సిద్ధంగా ఉండాలంటే.. తాను జాతీయ రాజకీయాల్లో ఉండాల్సిందేనని కేసీఆర్ భావిస్తున్నారట. తద్వారా.. ఎన్డీయే, యూపీయేతర పార్టీలతో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు కూడా ప్రయత్నించి, బీజేపీ వేగానికి కళ్లెం వేయాలని యోచిస్తున్నారట కేసీఆర్. మరి, ఏం జరుగనుంది? కేసీఆర్ వ్యూహాలు ఏ మేరకు విజయవంతమవుతాయి? ఇప్పుడు జరుగుతున్న చర్చల్లో వాస్తవం ఎంత? అన్నది చూడాలి.