Begin typing your search above and press return to search.

కేటీఆర్‌కు సీఎం కుర్చీ ఫార్మాలిటీ మాత్ర‌మేనా?

By:  Tupaki Desk   |   15 Aug 2020 3:30 AM GMT
కేటీఆర్‌కు సీఎం కుర్చీ ఫార్మాలిటీ మాత్ర‌మేనా?
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌యుడు, మంత్రి కేటీఆర్‌పై `పాత` చ‌ర్చే మ‌ళ్లీ `కొత్త‌`గా తెర‌మీద‌కు వ‌చ్చింది. త్వ‌ర‌లో ఆయ‌న‌కు ముఖ్య‌మంత్రిగా ప‌ట్టాభిషేకం చేయ‌నున్నార‌నే టాక్ ఇప్పుడు మ‌ళ్లీ వార్త‌ల్లోకి ఎక్కింది. దీనికి కార‌ణం, తెలంగాణ సీఎం లేని స‌మ‌యంలో కేటీఆర్ చేసిన ప‌నే. తెలంగాణ ప్ర‌భుత్వం తీసుకురాబోయే ఫుడ్‌ ప్రాసెసింగ్‌, లాజిస్టిక్స్‌ పాలసీలపై ప్రగతిభవన్‌లో మంత్రులు, అధికారులతో కేటీఆర్‌ సమావేశమయ్యారు. ఈ సమావేశ‌మే తాజా చ‌ర్చ‌కు కార‌ణం.

తెలంగాణ‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌, లాజిస్టిక్స్‌ పాలసీలపై మంత్రి కేటీఆర్‌ పవర్ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మార్గదర్శకత్వంలో తెలంగాణలో పెరుగుతున్న వ్యవసాయ ఉత్పత్తుల గురించి, దానివల్ల రాష్ట్రంలో ఆహారశుద్ధి రంగంలో వస్తున్న కొత్త అవకాశాల గురించి వివరించారు. అనంత‌రం ఇందులో వ్యవసాయం, పరిశ్రమలు, పంచాయతీరాజ్‌, ఎస్సీ అభివృద్ధి, గిరిజన సంక్షేమం, పశసంవర్ధకశాఖల మంత్రులు, అధికారులు పాల్గొని తమ శాఖలపరంగా పాలసీలో తీసుకుంటున్న చర్యలను వివరించారు.

స‌హ‌జంగా రాష్ట్ర ప్ర‌భుత్వానికి సంబంధించిన కొత్త నిర్ణ‌యాల‌పై ముఖ్య‌మంత్రి స‌మ‌క్షంలోనే నిర్ణ‌యాలు ఉంటాయి. మంత్రులంతా పాల్గొంటారు. అలాంటిది సీఎం లేకుండా మంత్రులంద‌రు కేటీఆర్‌కు ప్ర‌జెంటేష‌న్ ఇవ్వ‌డ‌మంటే...అర్థం కాబోయే ముఖ్య‌మంత్రి కేటీఆర్ అని ప‌రోక్షంగా చెప్ప‌డం కాకుండా మ‌రేమిట‌ని ప‌లువురు విశ్లేషిస్తున్నారు. ప్ర‌గ‌తిభ‌వ‌న్ వేదిక‌గా ఈ స‌మావేశం నిర్వ‌హించ‌డం ద్వారా హింట్ ఇచ్చేశార‌ని చెప్తున్నారు. ఇప్ప‌టికే కేటీఆర్ పార్టీలో నంబ‌ర్ 2 అని చెప్పేశార‌ని, ఇది స‌ర్కారులో నంబ‌ర్ 2 అని అంటున్నారు. కాగా, గ‌తంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఒంటిచేత్తో గెలిపించిన యువ నేతగా కేటీఆర్‌ కు సీఎం సీటు క‌ట్ట‌బెడ‌తార‌ని ఓ ద‌ఫా ప్ర‌చారం జ‌రిగింది. మ‌రో వైపు 2018లో జరిగిన ఎన్నికల్లో తిరిగి టీఆర్ఎస్ అధికారం లోకి వచ్చాక కూడా అదే ప్రచారం జరిగింది. కానీ కేటీఆర్ ముఖ్యమంత్రి కాలేదు. అయితే తాజాగా అదే ప్రచారం మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ సారి ఏం జ‌రుగుతుందో వేచి చూడాల్సిందే.