Begin typing your search above and press return to search.

నమస్తే ఆంధ్రా అంటూ పలకరించబోతున్న కేసీయార్....?

By:  Tupaki Desk   |   25 Feb 2023 9:13 AM GMT
నమస్తే ఆంధ్రా అంటూ పలకరించబోతున్న కేసీయార్....?
X
రాజకీయాలు మీడియా ముడిపడి ఉన్న కాలమిది. ఏ పార్టీ అయినా జనం వద్దకు వెళ్లాలంటే తమ గొంతు బలంగా వినిపించాలంటే మీడియా సపోర్ట్ అవసరం అయిన యుగం ఇది. తెలుగు నాట ఈ మీడియా రాజకీయం చాలానే ఉంది. ఏ రాజకీయ పార్టీకి అయినా సొంతంగా ఒక వాణి బాణిని ఏర్పాటు చేసుకుని ముందుకు సాగడమే అలవాటుగా మారింది.

ఒకపుడు తెలుగుదేశం పార్టీకి ఆయాచితంగా ఈనాడు మద్దతు దక్కింది. ఆ తరువాత ఆ పార్టీకి అనుకూల మీడియా రంగం విస్తరించింది. వైసీపీకి పుట్టక ముందే సాక్షి గట్టిగా అండగా ఉంది. తెలంగాణాలో చూసుకుంటే సీఎం కేసీయార్ తెలంగాణా ఉద్యమ కాలంలో అండగా మీడియా నిలిచింది. అందులో తరువాత కాలంలో నమస్తే తెలంగాణా అతి ముఖ్యమైన భూమికను పోషించింది.

రెండు టెర్ములు అధికారంలో ఉన్న కేసీయార్ కి నమస్తే తెలంగాణా పత్రిక పూర్తిగా అనుకూలంగా నిలిచి ఉందని చెబుతారు. అదే తీరున జాతీయ రాజకీయాల్లో బీయారెస్ ని విస్తరించాలని భావిస్తున్న కేసీయార్ ఆంధ్రా వైపు చూపు సాగించారు. దాంతో ఆయనకు బీయారెస్ అండగా నమస్తే ఆంధ్రా పేరిట పత్రిక ఏపీలో కొత్తగా పురుడు పోసుకోనుందని అంటున్నారు

ఈ పత్రిక ఏర్పాటుకు సంబంధించి తెర వెనక కసరత్త్తు పూర్తి అయిందని, దీనికి సంబంధించిన ఆర్ఎన్ఐ నెంబ‌ర్ వ‌చ్చేసింద‌ని, ప‌త్రిక‌కు సంబంధించిన ప్రింటింగ్ ఏర్పాట్లు కూడా జ‌రిగాయ‌ని చెబుతున్నారు. ఇక ఏపీలో ఒక చక్కని ముహూత్రం చూసుకుని ఈ ప‌త్రిక‌ను ప్రారంభించే అవ‌కాశ‌ముందని అంటున్నరు.

వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఎక్కువ ఎంపీ సీట్లు గెలుచుకుంటే కేంద్రంలో పాగా వేసేందుకు వీలు అవుతుందని భావిస్తున్న కేసీయార్ ఆ దిశగా పావులు కదుపుతున్నారు. దాంతో ఆయన ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో త‌మ గ‌ళాన్ని విప్పేందుకు ఓ ప‌త్రిక అవ‌స‌ర‌మ‌ని భావించి ఈ రకంగా తాజా నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా ప్రచారం అయితే సాగుతోంది.

ఏపీలో ప్రస్తుతం చాలా పత్రికలు ఉన్నాయి. అలాగే వేటికవే పార్టీ ముద్రను ప్రత్యక్షంగానో పరోక్షంగానో తగిలించుకున్నవి కూడా కావడం విశేషం. ఈ నేపధ్యంలో నమస్తే ఆంధ్రప్రదేశ్ అంటూ వచ్చే ఈ పత్రిక ఏపీ రాజకీయాన్ని జనాన్ని ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలని అంటున్నారు.

ఏపీలో రాజకీయాలు విడిపోయాయి. అలాగే మీడియా కూడా నిట్టనిలువుగా చీలిపోయింది అనే అంటారు అంతా. ఈ క్రమంలో నమస్తే ఆంధ్ర ప్రదేశ్ పత్రిక న్యూట్రల్ గా ఉండే అవకాశాలు తక్కువ అయినా ఏపీలోని రాజకీయ పక్షాలను చెడుగుడు ఆడడంతో మాత్రం ముందుంటుందని అంటున్నారు. ఆ విధంగా కొత్త రాజకీయాన్ని తెర మీదకు తెచ్చే చాన్స్ అయితే ఉంటుంది. దాంతో ట్రెడిషనల్ పాలిటిక్స్ కి విసిగిన జనాల నుంచి ఆదరణ లభించే అవకాశాలు అయితే ఉండొచ్చు అని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.