Begin typing your search above and press return to search.

ఈరోజు అసెంబ్లీలో కేసీఆర్ మరో కీలక నిర్ణయం

By:  Tupaki Desk   |   9 Sep 2020 4:15 AM GMT
ఈరోజు అసెంబ్లీలో కేసీఆర్ మరో కీలక నిర్ణయం
X
రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన గావించెద.. అంటూ ఉగ్రరూపస్యుడు అయిన తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నంత పనిచేశాడు. వీఆర్వో వ్యవస్థను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు అసెంబ్లీలో మరో కీలక నిర్ణయం తీసుకునేందుకు అడుగులు వేస్తున్నారు.

రాష్ట్రంలో రెవెన్యూ కోర్టులను రద్దు చేయాలని కేసీఆర్ డిసైడ్ అయినట్టు సమాచారం. భూవివాదాల పరిష్కారానికి ప్రతి శనివారం తహసీల్దార్, ఆర్డీవో, అదనపు కలెక్టర్ కార్యాలయాల్లో ప్రత్యేకంగా రెవెన్యూ కోర్టులను నిర్వహించేవారు. ఎన్నో ఏళ్లుగా వస్తున్న ఈ సంప్రదాయానికి మంగళం పాడాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. బుధవారం శాసనసభ ముందుకు రానున్న భూ యాజమాన్య హక్కులచట్టం -2020(ఆర్ఓఆర్) బిల్లులో పొందుపరిచినట్లు సమాచారం.

ఇన్నాళ్లు ఈ రెవెన్యూ కోర్టుల ద్వారా ఎడతెగని జాప్యం జరిగేది. మితిమీరిన అవినీతి ఆరోపణలు రావడంతో వీటిని ఉపసంహరించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. అందుకే రెవెన్యూ కోర్టులను రద్దు చేయాలనే నిర్ణయానికి వచ్చింది.

రెవెన్యూ కోర్టుల స్థానంలో జిల్లాకో ట్రిబ్యునల్ ను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. రిటైర్డ్ జడ్జి స్థాయి అధికారి నేతృత్వంలో ఏర్పాటు చేసే ట్రిబ్యునల్.. ఇకపై మండలం నుంచి జిల్లా వరకు అన్ని భూవివాదాలను పరిష్కరించనుంది. దీంతో తహసీల్దార్ నుంచి ఆర్డీవో, జేసీ వరకు ఉన్న మూడంచెల వ్యవస్థకు కేసీఆర్ చరమగీతం పాడారు.

ఇక ట్రిబ్యునల్ లో తీర్పు నచ్చని వారు కలెక్టర్ కు అప్పీల్ చేసే సౌకర్యం కల్పించారు.ఇలా రెవెన్యూ వ్యవస్థలో అవినీతి లేకుండా పూర్తి పారదర్శకంగా కేసీఆర్ ముందుకు పోతున్నారు.