Begin typing your search above and press return to search.

కేసీఆర్ కు ఏమైంది? పేరు పెట్టని పథకంతో ‘57’ ఉచిత సేవలు

By:  Tupaki Desk   |   6 Jun 2021 4:37 AM GMT
కేసీఆర్ కు ఏమైంది? పేరు పెట్టని పథకంతో ‘57’ ఉచిత సేవలు
X
నిజంగానే నిజం.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఏదో అయ్యింది. నెల రోజుల క్రితం నాటి ఆయన తీరుకు.. ఇటీవల కాలంలో ఆయన వ్యవహరిస్తున్న తీరులో ఏదో తేడా ఉందన్న మాట బలంగా వినిపిస్తోంది. అందుకు తగ్గట్లే ఆయన నిర్ణయాలు ఉంటున్నాయి. ఫాంహౌస్ లో ఉన్నా.. ప్రగతిభవన్ లో ఉన్నా.. తనదైన ప్రపంచంలో ఉండే ఆయన.. అందుకు భిన్నంగా హెల్త్ అంశాన్ని సీరియస్ గా తీసుకొని రోజువారీ రివ్యూలు మాత్రమే కాదు.. పెద్ద ఎత్తున నిర్ణయాల్ని చాలా వేగంగా తీసుకుంటున్నారు.

సాధారణంగా ఏదైనా సేవల్ని అందించే ఆలోచన వస్తే.. తొలుత దాన్ని అద్భుతంగా డిజైన్ చేయటం.. దానికో పేరు పెట్టటం.. భారీ ప్రకటనలు ఇవ్వటం.. ఆర్భాటంగా దాన్ని షురూ చేయటం లాంటివి చేస్తారు. అందుకు భిన్నంగా అసలు పేరు పెట్టకుండానే ఒక పథకాన్ని తెర మీదకు తీసుకురావటమే కాదు.. అమలులోకి తెస్తున్నారు. మంచి పేరును తర్వాత పెడతాం.. ముందు అయితే.. పేద ప్రజలు.. సామాన్యులకు సేవల్ని అందనివ్వండన్న మాట రోటీన్ కు భిన్నమని చెప్పాలి.

గతంలో వైద్యుడి వద్దకు వెళితే.. నాడి పట్టుకొని సుస్తీ ఏమిటో చెప్పేవారు. కొన్నేళ్లుగా సీన్ మొత్తం మారింది. సమస్యతో డాక్టర్ వద్దకు వెళ్లినంతనే.. మొదట పెద్ద ఎత్తున పరీక్షలు రాయటం.. వాటిని చేయించుకొని వస్తే.. అందులోని అంశాలకు తన అనుభవాన్ని జోడించి వైద్యం చేస్తున్నారు. కరోనా కష్ట కాలంలో వ్యాధి నిర్దారణతో పాటు.. తరచూ పలు పరీక్షలు చేయాల్సిన పరిస్థితి. ఈ టెస్టుల కోసం వేలాది రూపాయిల్ని ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీంతో పెద్ద ఎత్తున అప్పులు చేయటంతో పాటు.. ఆస్తులు అమ్ముకుంటున్న వారు కూడా ఉన్నారు.

ఇలాంటి ఇబ్బందులు కేసీఆర్ వరకు వెళ్లినట్లు ఉన్నాయి. దీంతో ఆయన వినూత్న నిర్ణయాన్ని తీసుకున్నారు. సోమవారం నుంచి తెలంగాణ రాష్ట్రంలోని 19 జిల్లా ఆసుపత్రుల్లో డయాగ్నొస్టిక్ కేంద్రాల్ని ప్రారంభిస్తున్నారు. కరోనాతో పాటు రక్త.. యూరిన్ పరీక్షతో పాటు బిపీ.. షుగర్.. గుండె జబ్బులు.. ఎముకలు..కాలేయం.. మూత్రపిండాలు.. ఊపిరితిత్తులు.. థైరాయిడ్ సంబంధిత 57 రకాల టెస్టుల్ని ఉచితంగా చేయనున్నరు. ఖరీదైన పరీక్షల్ని ఉచితంగా చేయటమే కాదు.. వెంటనే రిపోర్టులు ఇస్తామని.. కార్పొరేట్ సంస్థల మాదిరి.. మొబైల్ ఫోన్ కే రిపోర్టులు పంపించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

పరీక్షా కేంద్రాల్లో ఏర్పాటు చేస్తున్న యంత్రాలన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లోనూ.. ప్రైవేట్ డయాగ్నొస్టిక్ సెంటర్లలో ఏ విధంగా ఉంటాయో.. అలాంటివే జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు అవసరమైన వైద్యులు.. సాంకేతిక సిబ్బందిని ఇప్పటికే నియమించినట్లుగా ప్రభుత్వం చెబుతోంది. ఇటీవల కాలంలో రోగనిర్దారణకు చేయిస్తున్న పరీక్షలకు భారీ మొత్తం అవసరమవుతుంది. ఈ కష్టాన్ని గుర్తించిన కేసీఆర్ సర్కారు.. సరైన టైంలో సరైన నిర్ణయాన్ని తీసుకున్నారని చెప్పాలి.

సోమవారం నుంచి ఈ పథకం అమల్లోకి వస్తున్న జిల్లా కేంద్రాల్ని చూస్తే..

- మహబూబ్ నగర్
- నిజామాబాద్
- సంగారెడ్డి
- మెదక్
- జనగామ
- ములుగు
- మహబూబాబాద్
- గద్వాల్
- భద్రాద్రి
- జగిత్యాల
- సిద్దిపేట
- నల్గొండ
- ఖమ్మం
- సిరిసిల్ల
- వికారాబాద్
- నిర్మల్
- కరీంనగర్
- ఆదిలాబాద్
- ఆసిఫాబాద్