Begin typing your search above and press return to search.

కేసీఆర్‌ కు ఊపిరి ఆడ‌కుండా చేసిన క‌ర్ణాట‌క‌

By:  Tupaki Desk   |   23 May 2018 4:39 AM GMT
కేసీఆర్‌ కు ఊపిరి ఆడ‌కుండా చేసిన క‌ర్ణాట‌క‌
X
తెలంగాణ‌రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ లో ఒక ఆస‌క్తిక‌ర కోణం క‌నిపిస్తుంది. ఆయ‌న‌కు తీవ్రమైన ఆగ్ర‌హం వ‌చ్చినా.. ప‌ట్ట‌లేని సంతోషం వ‌చ్చినా.. నేరుగా ప్రెస్ మీట్ పెట్టేస్తారు. ప్ర‌త్య‌ర్థుల‌పై విరుచుకుప‌డే స‌మ‌యంలోనూ.. సంతోషంలోనూ ఆయ‌న తీరు ఒకేలా ఉంటుంది. ఆయ‌న ప్రెస్ మీట్ పెట్టిన‌ప్పుడు త‌న మందీ మార్బ‌లాన్ని భారీగా ఉండేలా చూసుకోవ‌టం ఆయ‌న‌కు అల‌వాటే.

మ‌రి.. అలాంటి కేసీఆర్ గ‌డిచిన నెలలో ఒక్క‌సారి ప్రెస్ మీట్ పెట్టింది లేదు. ఆ మాట‌కు వ‌స్తే మీడియాతో నేరుగా మాట్లాడిన వైనం క‌నిపించ‌దు. ఇప్పుడు కేసీఆర్ మాట్లాడాల్సిన అవ‌స‌రం ఏముందంటారా? దేశ ప్ర‌జ‌ల్లో విప‌రీత‌మైన ఆస‌క్తిని రేపిన క‌ర్ణాట‌క రాజ‌కీయంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌ల్ని అంత తేలిగ్గా మ‌ర్చిపోలేం.

తృతీయ ఫ్రంట్ అని అంద‌రూ అభివ‌ర్ణిస్తున్న వేళ‌.. అదేమీ కాదు ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ అంటూ చెప్పిన కేసీఆర్‌.. బెంగ‌ళూరుకు ప్ర‌త్యేక విమానంలో వెళ్లి మ‌రీ దేవెగౌడ‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. అంతేనా.. క‌ర్ణాట‌క‌లోని తెలుగువారంతా జేడీఎస్ కు ఓటు వేయాల‌ని కోరారు.తెలుగోళ్ల‌ను రెండు ముక్క‌లు చేసిన కేసీఆర్‌.. తెలుగోళ్ల‌ను ఓటు వేయాల‌ని ఎలా పిలుపు ఇస్తార‌న్న సందేహం అక్క‌ర్లేదు. ఎందుకంటే.. ఆయ‌న పిలుపునిచ్చింది క‌ర్ణాట‌క‌లోని పాత హైద‌రాబాద్ ప్రాంతం. ఇక్క‌డంతా తెలంగాణ నుంచి వ‌ల‌స వెళ్లి స్థిర‌ప‌డిన తెలుగోవాళ్లే ఉంటారు.

వీరంతా జేడీఎస్ కు ఓటు వేయాల‌ని కోరారు. మ‌రి.. కేసీఆర్ నోటి నుంచి ఆ మాట వ‌చ్చి.. ఇప్పుడా పార్టీ అధికార‌ప‌క్షంగా అవ‌త‌రిస్తున్న‌ప్పుడు.. త‌న పిలుపుకున్న ప‌వ‌ర్ ను మీడియా ఎదుట చాటుకోవ‌టం మామూలే. కానీ.. ఆ ప‌నేమీ కేసీఆర్ చేయ‌క‌పోవ‌టం క‌నిపిస్తుంది. ఎందుకిలా అంటే.. ఆస‌క్తిక‌ర కోణ‌మేన‌ని చెప్పాలి. కేసీఆర్ పిలుపు ఇచ్చిన‌ప్ప‌టికి హైద‌రాబాద్ క‌ర్ణాట‌క ప్రాంతంలో జేడీఎస్ కు పెద్ద సీట్లు రాలేదు. అంటే.. అక్క‌డి తెలుగువారు జేడీఎస్ కు ఓట్లు వేయ‌లేద‌ని చెప్పాలి. ఆ ప్రాంతంలో ఎక్కువ సీట్లు బీజేపీ గెలుచుకోవ‌టం గ‌మ‌నార్హం.

మ‌రో కీల‌క‌మైన విష‌యం ఏమిటంటే.. తెలంగాణ సీఎం ఓపెన్ గా జేడీఎస్ కు ఓటు వేయాల‌ని కోరినా.. ఆ పార్టీకి గ‌త ఎన్నిక‌ల్లో వ‌చ్చిన ఓట్ల కంటే త‌క్కువ రావ‌టం మ‌రో విశేషం. అంటే.. కేసీఆర్ మాట‌ను క‌ర్ణాట‌క‌లోని తెలంగాణ ప్రాంత వాసులు లైట్ తీసుకున్నార‌ని చెప్పాలి.

ఈ కార‌ణంతోనే కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్ట‌లేద‌ని చెబుతారు. ఈ వ్య‌వ‌హారంలో మ‌రో కోణాన్ని ప్ర‌స్తావిస్తుంటారు. కేసీఆర్ నోట వెంట త‌ర‌చూ వ‌చ్చే ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ మాట వెనుక అస‌లు వ్యూహ‌మంతా మోడీషాల‌దిగా చెబుతారు. మోడీతో కేసీఆర్ కు ర‌హ‌స్య స్నేహం ఉందంటారు. ఎందుకిలా అంటే.. కాంగ్రెస్ ను బల‌హీన ప‌ర్చాలంటే బీజేపీ సాయం అవ‌స‌రం. ఎందుకంటే.. తెలంగాణ‌లో ఏం చేసినా బీజేపీ బ‌ల‌మైన పార్టీగా మార‌టం క‌ష్టం. త‌న‌కు ఎప్ప‌టికైనా ముప్పుగా మారే కాంగ్రెస్ బ‌ల‌హీనంగా ఉండ‌ట‌మే కేసీఆర్ కు కావాల్సిందే.

క‌ర్ణాట‌క‌లో కాంగ్రెస్ చేతిలో ప‌వ‌ర్ ఉంటే.. సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో త‌న‌కు పెద్ద త‌ల‌నొప్పి అన్న విష‌యం కేసీఆర్ కు తెలియంది కాదు. ఈ కార‌ణంతోనే క‌ర్ణాట‌క‌లో కాంగ్రెస్ ఎట్టి ప‌రిస్థితుల్లో అధికారంలోకి రాకూడ‌ద‌ని అనుకున్న వారిలో కేసీఆర్ ముందుంటార‌ని చెబుతారు. అనూహ్యంగా చోటు చేసుకున్న రాజ‌కీయ ప‌రిణామాల‌తో తాను మ‌ద్ద‌తు ఇచ్చిన జేడీఎస్ ఇప్పుడు త‌న‌కేమాత్రం న‌చ్చ‌ని కాంగ్రెస్ తో జ‌త క‌ట్ట‌టాన్ని కేసీఆర్ జీర్ణించుకోలేక‌పోతున్న‌ట్లు చెబుతున్నారు. ఈ కార‌ణంతోనే క‌న్న‌డ విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకోవ‌టానికి తెలంగాణ ముఖ్య‌మంత్రి సుముఖంగా లేర‌ని తెలుస్తోంది.

మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన కోణం ఏమిటంటే.. జేడీఎస్ విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకునే ప్ర‌య‌త్నం కేసీఆర్ చేస్తే.. ఆయ‌న ర‌హ‌స్య స్నేహితులైన మోడీ.. అమిత్ షాల‌కు కోపం వ‌చ్చే వీలుంద‌ని చెబుతున్నారు. ఈ కార‌ణంతోనే క‌ర్ణాట‌క రాజ‌కీయ వ్య‌వ‌హారాన్ని వీలైనంత త‌క్కువ ప్రాధాన్య‌త‌ను ఇస్తున్న‌ట్లు తెలుస్తోంది. చివ‌ర‌కు కుమార‌స్వామి ప్ర‌మాణ‌స్వీకారానికి అంద‌రితో పాటు కాకుండా.. త‌న వ‌ర‌కు తాను స‌ప‌రేట్ గా వెళ్లటం దీనికి నిద‌ర్శ‌నంగా చూపిస్తున్నారు.