Begin typing your search above and press return to search.

కేసీఆర్ అండ్ కోను చిక్కుల్లో ప‌డేసిన చీర‌లు

By:  Tupaki Desk   |   19 Sep 2017 3:30 PM GMT
కేసీఆర్ అండ్ కోను చిక్కుల్లో ప‌డేసిన చీర‌లు
X
కాలం క‌లిసి వ‌చ్చినంత వ‌ర‌కూ అన్నీ అనుకున్న‌ట్లే జ‌రుగుతాయి. ఒక్క‌సారి తేడా మొద‌లైతే అంతే. తాజాగా చోటు చేసుకున్న ప‌రిస్థితుల్ని చూస్తే ఇది నిజ‌మ‌నిపించ‌క మాన‌దు. తిరుగులేని రీతిలో ఇమేజ్ ఉన్న తెలంగాణ రాష్ట్ర స‌ర్కారుకు చీర చిక్కులు చికాకు పుట్టిస్తున్నాయి. బ‌తుక‌మ్మ పండ‌గ‌ను పుర‌స్క‌రించుకొని కులాలు.. మ‌తాల‌కు అతీతంగా పేద మ‌హిళ‌ల‌కు బ‌తుకమ్మ చీర‌ల్ని పంపిణీ చేస్తామ‌ని కేసీఆర్ స‌ర్కారు ఘ‌నంగా ప్ర‌క‌టించింది.

ఇంత‌వ‌ర‌కూ బాగానే ఉన్నా.. చీర‌లు మ‌హిళ‌ల చేతికి వ‌చ్చేస‌రికి పెద‌వి విరుపుల‌తో పాటు.. ఇంత చౌక‌ర‌కం చీర‌లు ఇస్తార‌న్న ఆగ్ర‌హావేశాలు వ్య‌క్త‌మ‌య్యాయి.

చీర‌ల్ని గుట్ట‌లుగా పోసి మ‌రీ త‌గ‌ల‌పెట్టి త‌మ నిర‌స‌న‌ను వ్య‌క్తం చేశారు కొంద‌రు మ‌హిళ‌లు. ఊహించ‌ని రీతిలో చోటు చేసుకున్న ఈ ప‌రిణామాల‌పై రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌ల శాఖ ముఖ్య‌కార్య‌ద‌ర్శి జ‌యేష్ రంజ‌న్‌.. చేనేత - జౌళి క‌మిష‌న‌ర్ శైల‌జా రామ‌య్య‌ర్ లు రియాక్ట్ అయ్యారు. ప్ర‌భుత్వం ఇస్తున్న చీర‌లు నాణ్య‌మైన‌వేన‌ని చెబుతూ.. 1.04 ల‌బ్థిదారుల‌కు అవ‌స‌ర‌మైన చీర‌లు సిరిసిల్ల‌లో లేని నేప‌థ్యంలో సూర‌త్ నుంచి తెప్పించామ‌న్నారు.

ల‌బ్థిదారుల‌కు పంపిణీ చేయాల్సిన చీర‌ల్ని చేనేత మీద త‌యారు చేయించాలంటే మూడేళ్లు పడుతుంద‌న్నారు. ఓవైపు ఈ మాట‌ను చెబుతూనే మ‌రోవైపు వ‌చ్చే ఏడాది బ‌తుక‌మ్మ చీర‌ల్ని తెలంగాణ‌లోనే త‌యారు చేయిస్తామ‌ని చెప్ప‌టం గ‌మ‌నార్హం. 3.7 కోట్ల మీట‌ర్ల వ‌స్త్రంతో 58 ల‌క్ష‌ల చీర‌ల్ని సిరిసిల్ల మ‌గ్గాల నుంచి సేక‌రించామ‌ని.. 2.3 కోట్ల మీట‌ర్ల వ‌స్త్రంతో త‌యారు చేసిన చీర‌ల‌ను సూర‌త్ నుంచి కొనుగోలు చేసిన‌ట్లు వెల్ల‌డించారు.

సిరిసిల్ల చీర ధ‌ర రూ.224అయితే.. సూర‌త్ నుంచి కొనుగోలు చేసిన చీర ధ‌ర రూ.200 వ‌ర‌కు ఉంద‌ని చెబుతున్నారు. చీర‌ల్లో నాణ్య‌త‌ను ప‌రిశీలించే కొన్నామ‌ని.. లోపాలు గ‌మ‌నిస్తే చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని చెబుతున్నా.. చీర‌లు ఏమాత్రం బాగోలేద‌ని మ‌హిళ‌లు తేల్చి చెబుతున్నారు. నాలుగు ద‌శ‌ల్లో నాణ్య‌త‌ను ప‌రిశీలించి చీర‌లు కొనుగోలు చేసిన‌ట్లు చెబుతున్నా.. ఆ స్థాయిలో చీర‌లు లేవ‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది.

ఇంత పెద్ద మొత్తంలో సూర‌త్ నుంచి కొనుగోలు చేసే క‌న్నా.. ముందే ప్ర‌భుత్వం త‌మ‌కు ప‌ని అప్ప‌గించి ఉంటే పెద్ద ఎత్తున ఉపాధి ల‌భించి ఉండేద‌న్న మాట చేనేత కార్మికులు చెబుతున్నారు. చీర‌ల విష‌యంలో ఇప్ప‌టికే చిక్కుల్లో ప‌డ్డ కేసీఆర్ స‌ర్కారు మ‌రో త‌ప్పు చేసింద‌న్న భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. చీర‌ల్ని కాల్చిన మ‌హిళ‌ల‌పై నాన్ బెయిల్ బుల్ కేసుల్ని న‌మోదు చేయ‌టంపై మ‌హిళ‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఇలాంటి పొర‌పాట్లు చేయ‌కుండా ఉంటే మంచిద‌న్న స‌ల‌హాలు ఇస్తున్నారు.