Begin typing your search above and press return to search.

ఆదివారం చంద్రబాబుకు కేసీఆర్ ఇన్విటేషన్

By:  Tupaki Desk   |   3 Dec 2015 6:47 AM GMT
ఆదివారం చంద్రబాబుకు కేసీఆర్ ఇన్విటేషన్
X
ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఆయిత చండీ యాగానికి కుటుంబ సమేతంగా ఆహ్వానించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏపీ సీఎం చంద్రబాబును కలవనున్నారు. మెదక్‌ జిల్లా ఎరవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో ఈ నెల 27 నుంచి కేసీఆర్‌ చండీ యాగాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి చంద్రబాబును ఆయన బుధవారమే ఆహ్వానిస్తారని అనుకున్నా కుదరలేదని సమాచారం. దీంతో ఆదివారం ఆయన్ను కలిసి ఆహ్వానిస్తారని సమాచారం.

ఈనెల 6వ తేదీన తన సమీప బంధువు వివాహానికి హైదరాబాద్‌ వస్తున్న చంద్రబాబును ఆయన నివాసంలో కలిసేందుకు కేసీఆర్‌ సమయం కోరినట్టు తెలిసింది. తెలంగాణ సీఎం కేసీఆర్‌ కార్యాలయానికి చెందిన ఓ ఉన్నతాధికారి ఏపీ సీఎం కార్యాలయ అధికారులతో మాట్లాడినట్టు చెబుతున్నారు. సీఎం చంద్రబాబు హైదరాబాద్‌ ఎప్పుడు వస్తున్నారు... ఎక్కడ ఆయనను కలవవచ్చు... మా ముఖ్యమంత్రి కేసీఆర్‌ సతీసమేతంగా కలిసి యాగానికి సంబంధించిన ఆహ్వానాన్ని అందజేయాలని నిర్ణయించుకున్నారంటూ ఆ అధికారి చెప్పినట్టు తెలుస్తోంది.

ఎన్టీఆర్‌ పెద్ద కుమార్తె మనవరాలి వివాహం ఈనెల 6వ తేదీన హైదరాబాద్‌ లో జరగనుంది. 5వ తేదీ రాత్రే చంద్రబాబు హైదరాబాద్‌ వస్తారని, 6న అందుబాటులో ఉంటారని ఏపీ సీఎం కార్యాలయ వర్గాలు చెప్పాయి. ఫోన్‌ చేసిన విషయాన్ని సీఎం చంద్రబాబుకు వివరిస్తామని ఆయనతో సంప్రదించి సమయాన్ని కూడా నిర్ణయిస్తామని చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. 7వ తేదీ తిరిగి విజయవాడ వెళ్ళే అవకాశమున్నందున 6వ తేదీన కేసీఆర్‌ తన సతీమణితో కలిసి చంద్రబాబును ఆయన నివాసంలో సమావేశమయ్యే అవకాశముంది.

మరోవైపు చండీ యాగం జరిగే సమయంలో ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు హైదరాబాద్‌ లో జరగనున్నాయి. చంద్రబాబు అందుబాటులో ఉంటుండడంతో యాగానికి కచ్చితంగా హాజరవుతారని తెదేపా వర్గాలు చెబుతున్నాయి. ఆధ్యాత్మిక కార్యక్రమం కావడంతో చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరితోపాటు తనయుడు లోకేష్‌ - కోడలు బ్రాహ్మణి కూడా హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.