Begin typing your search above and press return to search.

రంగంలోకి కేసీఆర్.. అభ్యర్థికి బీఫాం.. ఎన్నికల ఖర్చు కూడా..

By:  Tupaki Desk   |   1 Oct 2021 4:32 AM GMT
రంగంలోకి కేసీఆర్.. అభ్యర్థికి బీఫాం.. ఎన్నికల ఖర్చు కూడా..
X
డైరెక్ట్ కేసీఆర్ రంగంలోకి దిగారు. హుజూరాబాద్ పై ఫోకస్ చేశారు. నోటిఫికేషన్ రాగానే తన అనుయాయులను రంగంలోకి దించారు.

హుజూరాబాద్ ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కాగానే టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అలెర్ట్ అయ్యారు. వెంటనే రంగంలోకి దిగారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పోటీచేస్తున్న టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు కేసీఆర్ స్వయంగా పార్టీ బీఫారం అందజేశారు.

ఇక విశేషం ఏంటంటే ఎన్నికల ఖర్చుల కోసం పార్టీ ఫండ్ గా రూ.28 లక్షల రూపాయల చెక్కును అభ్యర్థి గెల్లుకు కేసీఆర్ ఇవ్వడం విశేషం. సీఎం కేసీఆర్ ను అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ తోపాటు మంత్రి హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, పెద్దిరెడ్డి తదితరులు కలిశారు.

ఈరోజు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయనుంది. దీంతో నిన్న రాత్రియే కేసీఆర్ సమాయత్తమయ్యారు. అభ్యర్థికి బీఫాంతోపాటు ఎన్నికల ఖర్చును అందజేశారు. ఈరోజు హుజూరాబాద్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. గెల్లు నామినేషన్ ను మంత్రులు హరీష్ రావు, గంగుల, కొప్పుల పర్యవేక్షించనున్నారు.

ఇక తెలంగాణలోని హుజూరాబాద్ తోపాటు, ఏపీలోని బద్వేలు ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. అక్టోబర్ 30న ఎన్నికలు నిర్వహించనున్నారు. అక్టోబర్ 1న ఈరోజు నోటిఫికేషన్ విడుదలైంది. అక్టోబర్ 8వరకు నామినేషన్ దాఖలుకు తుదిగడువుగా నిర్ణయించారు. ఉపసంహరణలకు 13వ తేదీ వరకు గడువిచ్చారు. ఇక ఎన్నికలు అక్టోబర్ 30, ఫలితాలు నవంబర్ 2న వెలువడనున్నాయి.

హుజూరాబాద్ లో టీఆర్ఎస్ తరుఫున గెల్లు శ్రీనివాస్ బరిలోకి దిగుతుండగా.. ప్రతిపక్ష బీజేపీ నుంచి మాజీ మంత్రి ఈటల రాజేందర్ పోటీచేస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఇంతవరకూ హుజూరాబాద్ అభ్యర్థినే ప్రకటించలేదు. కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహల పేర్లు పరిశీలిస్తున్నారు. అందరి కంటే ముందే నామినేషన్ వేసి రంగంలోకి దిగడానికి టీఆర్ఎస్ సమాయత్తమైంది.