Begin typing your search above and press return to search.

మ‌ళ్లీ స‌ర్వేనే న‌మ్ముకున్న కేసీఆర్‌

By:  Tupaki Desk   |   15 Feb 2018 5:18 AM GMT
మ‌ళ్లీ స‌ర్వేనే న‌మ్ముకున్న కేసీఆర్‌
X
పాల‌న విష‌యంలో అంచ‌నాల కంటే అంకెల‌కే ఎక్కువ ప్రాధాన్య‌మిచ్చే అధినేత‌గా తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ను చెప్పాలి. ఏ విష‌యం మీద అయినా పొగ‌డ్త‌ల‌కు పొంగిపోకుండా గ్రౌండ్ లెవ‌ల్ రియాలిటీ తెలుసుకోవ‌టంపైనే కేసీఆర్ దృష్టి పెడ‌తార‌ని చెప్పాలి. వివిధ అంశాల‌పై త‌ర‌చూ స‌ర్వే చేయించుకునే ఆయ‌న‌.. తాను అనుకునే దానికి.. ప్ర‌జా స్పంద‌న‌కు మ‌ధ్య‌నున్న వ్య‌త్యాసం ఎంత‌న్న అంశం పైనే దృష్టి సారిస్తార‌ని చెబుతారు. ఒక‌టి త‌ర్వాత ఒక‌టిగా అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాల విష‌యంలో తెలంగాణ ప్ర‌జ‌ల రియాక్ష‌న్ ఏమిటి? అన్న అంశంపై కేసీఆర్ తాజాగా దృష్టి సారించిన‌ట్లు తెలుస్తోంది.

ప్ర‌భుత్వం ప్ర‌తిష్ఠాత్మ‌కంగా భావిస్తున్న కాళేశ్వ‌రం ప్రాజెక్టు విష‌యంలో తెలంగాణ ప్ర‌జ‌ల ఫీడ్ బ్యాక్ ఎమిట‌న్నది తెలుసుకోవాల‌న్న ఆస‌క్తి కేసీఆర్ లో ఎక్కువ‌గా ఉంద‌ని చెబుతున్నారు. ఇటీవ‌ల కాలంలో వ్య‌వసాయానికి 24 గంట‌ల విద్యుత్‌.. గొర్రెల పంపిణీ.. లాంటి అంశాల్లో వేటికి ప్ర‌జ‌లు ఎక్కువ సంతృప్తి చెందార‌న్న విష‌యాన్ని తెలుసుకోవాల‌ని భావిస్తున్న‌ట్లు స‌మాచారం.

ప్ర‌భుత్వం ప్ర‌తిష్ఠాత్మ‌కంగా చేప‌ట్టిన ప్రాజెక్టుతో పాటు.. అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాల‌పై ప్ర‌జ‌ల మ‌నోగ‌తం ఏమిటి? ఆయా కార్య‌క్ర‌మాల మీద ప్ర‌జ‌లు ఇచ్చే స‌ల‌హాలు.. సూచ‌న‌లు ఏమిట‌న్న‌ది తెలుసుకోవాల‌ని కేసీఆర్ అనుకుంటున్నార‌ట‌. ఇందుకోసం భారీ స‌ర్వేను చేప‌ట్టాల‌ని భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

తెలంగాణ రాష్ట్రంలోని అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ఈ స‌ర్వే చేయ‌నున్నారు. ఓప‌క్క ప్రైవేటు సంస్థ‌ల‌తో స‌ర్వే చేయిస్తూనే.. మ‌రోవైపు నిఘా వ‌ర్గాల‌తోనూ మ‌రో స‌ర్వే చేయిస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. ఒకే ద‌ఫా రెండు వేర్వేరు స‌ర్వేల్ని నిర్వ‌హించ‌టం ద్వారా.. ఒక‌దానితో మ‌రొక‌టి పోల్చి చూడ‌టంతో పాటు.. స‌ర్వే ఫ‌లితాల్లో వైరుధ్యం ఏమైనా ఉందా? అన్న విష‌యం తేల్చుకోవాల‌ని భావిస్తున్న‌ట్లు చెబుతున్నారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఇటీవ‌ల ప్ర‌వేశ పెట్టిన గొర్రెల పంపిణీ.. చేప‌ల పంపిణీ లాంటి ప‌థ‌కాల్లో పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకుంద‌న్న అంశంపై కేసీఆర్ సీరియ‌స్ గా ఉన్న‌ట్లు స‌మాచారం. ప్ర‌భుత్వం ఎంతో క‌స‌ర‌త్తు చేసి ప‌థ‌కాల్ని మొద‌లు పెడుతుంటే.. అధికారుల నిర్ల‌క్ష్యం కార‌ణంగా ప్ర‌జ‌ల‌కు ప‌థ‌కాల ఫ‌లాలు అంద‌టం లేద‌న్న గుర్రుగా ఉన్న ఆయ‌న‌.. తామిచ్చే సంక్షేమ ఫ‌లాలు స‌రిగా చేరాలంటే ఏమేం చేయాల‌న్న అంశంపైనా ఆధార‌ప‌డిన‌ట్లుగా తెలుస్తోంది.

దేశంలో మ‌రెక్క‌డా లేని రీతిలో వ‌చ్చే ఖ‌రీఫ్ నుంచి రైతుల‌కు పెట్టుబ‌డి ఇచ్చే అంశంపై పెద్ద ఎత్తున స‌ర్వే నిర్వ‌హించటంతో.. పాటు ప్ర‌జ‌ల స్పంద‌న ఎలా ఉంద‌న్న విష‌యాన్ని తెలుసుకోవాల‌న్న ఆస‌క్తి కేసీఆర్ లో వ్య‌క్త‌మైన‌ట్లు చెబుతున్నారు. ఏమైనా.. త‌న తాజా స‌ర్వే నివేదిక‌పైన కేసీఆర్ చాలానే ఆశ‌లు పెట్టుకున్నార‌ని తెలుస్తోంది. మ‌రి.. స‌ర్వే ఫ‌లితం ఏమ‌ని వ‌స్తుందో చూడాలి.