Begin typing your search above and press return to search.

గాంధీపై కేసీఆర్ సంచ‌లన వ్యాఖ్య‌లు.. ఏమ‌న్నారంటే..

By:  Tupaki Desk   |   2 Oct 2022 9:43 AM GMT
గాంధీపై కేసీఆర్ సంచ‌లన వ్యాఖ్య‌లు.. ఏమ‌న్నారంటే..
X
మహాత్మగాంధీ ప్రవచించిన శాంతి-అహింసా సిద్ధాంతం ప్ర‌స్తుత పాల‌కుల చేతుల్లో న‌లిగిపోతోంద‌ని.. తెలంగాణ సీఎం కేసీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అదేవిధంగా లాల్‌ బహదూర్‌ శాస్త్రి ఉద్బోధించిన జై జవాన్‌-జై కిసాన్‌ నినాదం.. కూడా నలిగిపోతోంద‌ని అన్నారు. సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో ఆవరణలో మహాత్ముడి విగ్రహాన్ని కేసీఆర్‌ ఆవిష్కరించారు. హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో... ఈ 16 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

అహింస సిద్ధాంతంతో గాంధీజీ.. బ్రిటీష్‌వారిపై పోరాడి విజయం సాధించారని కొనియాడారు. అంతకముం దుకు సికింద్రాబాద్‌ ఎంజీ రోడ్డులో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ముఖ్యమంత్రి పుష్పాంజలి ఘటించారు. ``ధ్యానమూర్తిలో ఎత్తైన విగ్రహాన్ని ప్రతిష్టించడం గొప్ప విషయం. విగ్రహ ఏర్పాటుతో మంత్రి శ్రీనివాస్‌కు చిరస్థాయి కీర్తి దక్కుతుంది. కరోనా విపత్తు వేళ గాంధీ ఆస్పత్రి సేవలు ప్రశంసనీయం. గాంధీ వైద్య సిబ్బంది ఆయన ఆదర్శాలను కొనసాగిస్తున్నారు. మిగతా ఆస్పత్రుల్లో తిరస్కరించినా ఇక్కడికి తెచ్చి రోగుల ప్రాణాలు కాపాడారు` అని పేర్కొన్నారు.

``గాంధీ పుట్టిన దేశంలో జన్మించడం మనందరం చేసుకున్న పుణ్యం. గాంధీజీ విశ్వజనీన సిద్ధాంతాలు ప్రతిపాదించారు. అహింస, శాంతి, ధర్మం, సేవ, త్యాగనిరతి సిద్ధాంతాలు విశ్వజనీనం`` అని కేసీఆర్ అన్నారు. సమస్యలకు యుద్ధాలు పరిష్కారం కాదని చాటిచెప్పిన మహనీయుడు గాంధీ అని కేసీఆర్ కొనియాడారు. మానవాళికి గొప్ప సందేశం, మార్గాన్ని చూపించిన గొప్ప వ్యక్తి.. మార్టిన్ లూథర్ వంటి వారు గాంధీ మార్గాన్ని అభినందించారని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

దలైలామా సైతం గాంధీ తనకు ఆదర్శం అని చెప్పారన్నారు. ప్రేమ, ఆప్యాయత ద్వారా అసహాయతను ఎదుర్కోవచ్చని చెప్పారు.. గాంధీజీని రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ మహాత్ముడిగా సంబోధించారన్నారు. అహింసతో స్వరాజ్యం సాదిద్ధామని గాంధీజీ ప్రతిపాదించారని తెలిపారు. అదే సమయంలో సుభాష్‌ చంద్రబోస్‌ ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ స్థాపించారని కేసీఆర్ పేర్కొన్నారు.