Begin typing your search above and press return to search.

తీపి క‌బుర్ల‌తో హుషారెక్కించిన కేసీఆర్

By:  Tupaki Desk   |   15 Aug 2017 7:38 AM GMT
తీపి క‌బుర్ల‌తో హుషారెక్కించిన కేసీఆర్
X
మాట‌ల మాంత్రికుడిగా అభివ‌ర్ణించే తెలంగాణ‌రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ అలా మాట్లాడుతుంటే ఆ కిక్కే వేరు. ఆయ‌న్ను ఎంత‌గా వ్య‌తిరేకించే వారు సైతం..ఆయ‌న మాట‌ల మాయాజాలానికి ముగ్థులైపోవాల్సిందే. అయితే.. సంప్ర‌దాయం ప్ర‌కారం కొన్ని ప్ర‌త్యేక సంద‌ర్భాల్లో ముందుగా సిద్ధం చేసిన ప్ర‌సంగ పాఠాన్ని చ‌దివి వినిపించ‌టం మామూలే. ఇందులో భాగంగా స్వాతంత్ర్య దినోత్స‌వ వేడుక‌ల సంద‌ర్భంగా ఆయ‌న త‌న ప్ర‌సంగాన్ని చ‌దివి పూర్తి చేశారు. సాధార‌ణంగా ఇలాంటి ప్ర‌సంగాలు కిక్కు ఇచ్చేలా ఉండ‌వు.

అయితే.. అందుకు భిన్నంగా వ‌రుస వ‌రాల‌తో తెలంగాణ ప్ర‌జ‌ల‌కు హుషారు పుట్టేలా చేశారు. త్వ‌ర‌లో 84,877 ఉద్యోగాల నియామ‌క ప్ర‌క్రియ‌ను చేప‌ట్ట‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డితే ల‌క్ష ఉద్యోగాలు వ‌స్తాయ‌ని తాను ఉద్యోగ స‌మ‌యంలో చెప్పాన‌ని.. ఇప్పుడు ఆ మాట‌ల్ని నెర‌వేరుస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం ప్ర‌భుత్వం 1,12,536 ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేస్తోంద‌ని.. ఇప్ప‌టికే 27,660 ఉద్యోగాల‌కు నియామ‌క ప్ర‌క్రియ చేప‌ట్టిన‌ట్లు చెప్పారు.

వ‌చ్చే ఏడాది ఏర్ప‌డే ఖాళీల‌కు ఇప్పుడే నియామ‌కం చేప‌ట్టాల‌ని ఆదేశాలు జారీ చేసిన‌ట్లు ప్ర‌క‌టించారు. ఆర్థిక వృద్ధిరేటు దేశంలోనే నెంబ‌ర్ వ‌న్ స్థానంలోతెలంగాణ రాష్ట్రంలో ఉన్న‌ట్లు చెప్పిన ఆయ‌న‌.. తెలంగాణ‌రాష్ట్ర స‌ర్కారు అమ‌లు చేస్తున్న ప‌థ‌కాలు దేశ వ్యాప్తంగా మ‌న్న‌న‌లు అందుకుంటున్నాయ‌న్నారు. రైతుల‌కు వ‌చ్చే ఏడాది నుంచి పంట‌కు ముందే ప్ర‌భుత్వ‌మే పెట్టుబ‌డి పెడుతుంద‌ని.. దీంతో వారిపై రుణ‌భారం.. వ‌డ్డీ ఇబ్బందులు ఉండ‌వ‌న్నారు.

స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా గోల్కొండ కోట మీద జాతీయ‌జెండా ఎగుర‌వేసిన కేసీఆర్‌.. తెలంగాణ రాష్ట్ర ప్ర‌జ‌ల్ని ఉద్దేశించి ప్ర‌సంగించారు. పేద‌రికాన్ని నిర్మూలించేందుకు ప్ర‌భుత్వం చిత్త‌శుద్ధితో ప‌ని చేస్తోంద‌న్న ఆయ‌న‌.. విద్యుత్ ఉత్ప‌త్తి సామ‌ర్థ్యం పెంచేందుకు కొత్త‌గా ఉత్ప‌త్తి కేంద్రాల్ని ఏర్పాటు చేస్తామ‌న్నారు. డ్ర‌గ్స్ పై రాజీ లేని పోరాటం చేస్తున్నామ‌ని.. తెలంగాణ‌లో త్వ‌ర‌లోనే డ్ర‌గ్స్ మాఫియాను అంతం చేస్తామ‌న్నారు.క‌ల్తీల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు చెప్పిన కేసీఆర్‌.. ప్ర‌భుత్వ సాయంతో తెలంగాణ‌రాష్ట్ర వ్యాప్తంగాపెద్ద ఎత్తున గొర్రెలు.. చేప‌ల పంపంకం జ‌రుగుతున్న‌ట్లుగా చెప్పారు. రాష్ట్రంలో ప్ర‌తి ఇంటికి తాగు నీరు అందించే ల‌క్ష్యంతోమిష‌న్ భ‌గీర‌థ చేప‌ట్టామ‌ని.. మ‌హిళ‌ల ర‌క్ష‌ణ కోసం ఏర్పాటు చేసిన షీ టీమ్స్ స‌మ‌ర్థ‌వంతంగా ప‌ని చేస్తున్నాయ‌న్నారు. ప్ర‌భుత్వం అమ‌లుచేస్తున్న వివిధ ప‌థ‌కాల్ని ఆయ‌నీ సంద‌ర్భంగా ప్ర‌స్తావించారు.