Begin typing your search above and press return to search.

బ్రాహ్మణులపై వరాల వర్షం కురిపించిన కేసీఆర్

By:  Tupaki Desk   |   31 May 2023 5:00 PM GMT
బ్రాహ్మణులపై వరాల వర్షం కురిపించిన కేసీఆర్
X
తెలివి అంటే సీఎం కేసీఆర్ దే. లేటైనా లేటెస్టుగా ఎంట్రీ ఇవ్వటం ఆయనకు అలవాటు. దాదాపుగా తొమ్మిదేళ్లుగా గుర్తుకు రాని బ్రాహ్మణులు.. వారి సమస్యల్ని ఒక్కసారిగా గుర్తుకు తెచ్చుకోవటమే కాదు.. వారంతా తొమ్మిదేళ్లుగా తమ డిమాండ్లపై ప్రభుత్వం పట్టించుకోకపోవటంతో గుర్రుగా ఉన్నారు. అయినప్పటికీ తానిచ్చిన వరాలతో వారి మనసుల్ని దోచుకొని.. తొమ్మిదేళ్ల బాధను ఇట్టే మర్చిపోయేలా చేసే టాలెంట్ కేసీఆర్ సొంతంగా చెప్పాలి. హైదరాబాద్ మహానగరంలోని గోపన్నపల్లి విప్రహిత బ్రాహ్మణ సంక్షేమ సదన్ ను ప్రారంభించారు కేసీఆర్.

ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. వరుస వరాలతో బ్రాహ్మణ వర్గాలు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యేలా చేశారు. తనకు అలవాటైన రూ.100 కోట్ల మాటను బ్రాహ్మణ పరిషత్ కు కేటాయిస్తున్నట్లు చెప్పిన ఆయన.. దేశంలోనే బ్రాహ్మణ సదన్ ను తెలంగాణలో నిర్మితమైనట్లుచెప్పారు.

పురవాసుల హితం కోరేవారే పురోహితులన్న సీఎం కేసీఆర్.. బ్రాహ్మణల్లో కూడా చాలామంది పేదవారు ఉన్న విషయాన్ని వెల్లడించారు. బ్రాహ్మణుల సంక్షేమానికి తమ ప్రభుత్వం క్రషి చేస్తుందన్న ఆయన.. బ్రాహ్మణ సదన్ కు 6.10 ఎకరాల స్థలాన్ని కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు.

మొత్తం 12 నిర్మాణాల్ని చేపట్టిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఈ భవనంలో కల్యాణ మండపం.. సమాచార కేంద్రం.. పీఠాధిపతులు.. ధర్మాచార్యుల సదనం ఉన్నట్లు చెప్పారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే బ్రాహ్మణుల కోసం ఎన్నో స్కీమ్ లు అమలు చేస్తున్న విషయాన్ని చెప్పిన కేసీఆర్.. ఇక్కడో లైబ్రరీ ఏర్పాటు చేయాలని సలహాదారు రమణాచారిని కోరారు. సూర్యాపేట.. ఖమ్మం.. మధిర.. డిచ్ పల్లిలో కూడా త్వరలోనే బ్రాహ్మణ సాధన బిల్డింగులు నిర్మిస్తున్నట్లు చెప్పారు. త్వరలోనే వాటిని ప్రారంభిస్తున్నట్లుగా చెప్పారు.

ప్రతి నెల బ్రాహ్మణులకు ఇచ్చే రూ.2500 భృతిని రూ.5వేలకు పెంచుతున్నట్లు చెప్పారు. అంతేకాదు.. ఇంతకాలం అర్హతగా ఉన్న 75 ఏళ్లను 65ఏళ్లకు కుదిస్తున్నట్లు చెప్పారు. ధూప దీప స్కీమ్ కింద ఇచ్చే రూ.6వేలను రూ.10వేలకు పెంచుతున్నట్లు చెప్పిన ఆయన.. రాష్ట్రంలోని మరో 2696 దేవాలకు ధూప దీప నైవేద్యాల పథకాన్ని వర్తించనున్నట్లు ప్రకటించారు.

లోకహితం కోసం బ్రాహ్మణులు పని చేస్తుంటారన్న ఆయన.. ఐఐటీ.. ఐఐఎంలలో సీటు వచ్చిన బ్రాహ్మణ విద్యార్థులకు ఫీజు రియంబర్స్ మెంట్ ఇస్తామని ప్రకటించారు. ఇలా మనసు దోచే హామీల్ని ఇవ్వటం ద్వారా.. ఇంతకాలం జరిగిన ఆలస్యాన్ని వడ్డీతో సహా చెల్లించినట్లుగా చెప్పాలి. ఎన్నికలకు మరో నాలుగైదు నెలలు ఉన్న వేళలో బ్రాహ్మణ వర్గాల అభిమానాన్ని పొందేలా ఇచ్చిన హామీలు ఇప్పుడు అందరిని ఆకర్షిస్తున్నాయి.