Begin typing your search above and press return to search.

పుల్ల‌లు.. పుల్ల‌ల‌మోపు క‌థ మ‌రిచారా కేసీఆర్‌?

By:  Tupaki Desk   |   27 March 2019 5:45 AM GMT
పుల్ల‌లు.. పుల్ల‌ల‌మోపు క‌థ మ‌రిచారా కేసీఆర్‌?
X
అంద‌రికి తెలిసిన క‌థే. పుల్ల ఒక్క‌దాన్ని తుంప‌టం సులువు. కానీ.. పుల్ల‌ల సంఖ్య పెరిగే కొద్దీ దాన్ని తుంచ‌టం క‌ష్టం. ఇక‌.. అది కాస్తా మోపుగా మారితే తుంచ‌టం త‌ర్వాత‌.. దాన్ని ప‌ట్టుకోవ‌ట‌మే క్లిష్టంగా మారుతుంది. ఈ క‌థ నీతి చాలా సింఫుల్.. క‌లిసిక‌ట్టుగా ప‌ని చేస్తే అసాధ్య‌మ‌న్న‌ది ఉండ‌ద‌ని. గెలుపు ధీమాలో ఉన్న వారికి ఇలాంటి నీతి క‌థ‌లు పెద్ద‌గా ప‌ట్ట‌వు. త‌మ‌కు తాను అత్యంత శ‌క్తివంతుల‌మ‌ని.. తాము డిసైడ్ చేసిందే జ‌రుగుతుంద‌న్న భావ‌న మ‌న‌సును బాగా ప‌ట్టేసిన‌ప్పుడు ఒప్పులు చేసే వారు సైతం త‌ప్పులు చేస్తుంటారు.

తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ అలాంటి త‌ప్పుల్నే చేస్తున్నారా? అంటే అవున‌న్న మాట వినిపిస్తోంది. ప్లాన్ బిని మ‌న‌సులో పెట్టుకొని ప్లాన్ ఏను తెర‌మీద‌కు తెచ్చే అల‌వాటున్న కేసీఆర్‌.. త‌న కొడుక్కి అర్జెంట్ గా ప‌ట్టాభిషేకం చేయాల‌న్న ఆలోచ‌న ఈ మ‌ధ్య‌న అంత‌కంత‌కూ ఎక్కువ అవుతుంద‌న్న ప్ర‌చారం జోరుగా సాగుతోంది. దీనికి త‌గ్గ‌ట్లే.. ప్ర‌ధాని కేసీఆర్ అన్న నినాదాన్ని తెర మీద‌కు తీసుకురావ‌టం దీనికి నిద‌ర్శ‌నంగా చెబుతున్నారు.

సారు.. ప‌ద‌హారు అంటూ తెలంగాణ‌లోని ఎంపీ సీట్ల‌లో గులాబీ జెండాను ఎగుర‌వేసి.. కేంద్రంలో చ‌క్రాన్ని తిప్పాల‌న్న కేసీఆర్ అభిలాష బాగానే ఉన్నా.. వాస్త‌వంలో అదెంత వ‌ర్క్ వుట్ అవుతుంద‌న్న‌ది సందేహమే. అయితే.. ఇలాంటి వాద‌న‌ను గులాబీ నేత‌లు సింఫుల్ గా కొట్టేస్తుంటారు.

రెండంటే రెండు ఎంపీ స్థానాలున్న త‌మ పార్టీ అధినేత తిప్పిన చ‌క్రంతో తెలంగాణ రాష్ట్ర‌మే ఏర్ప‌డింద‌ని.. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా ఉన్న తాజా ప‌రిస్థితుల్లో ఆయ‌న పీఎం కావ‌టం పెద్ద విష‌యం కాద‌న్న ధీమాను వ్య‌క్తం చేసేవాళ్లు లేక‌పోలేరు. ఇలాంటి హెచ్చు మాట‌లు మాట్లాడే వారంతా వాస్త‌వ ప‌రిస్థితిని మ‌దింపు చేయ‌టంలో విఫ‌ల‌మ‌వుతున్న‌ట్లుగా చెప్పాలి.

ఎందుకంటే.. తెలంగాణ ఉద్య‌మాన్ని కేసీఆర్ న‌డిపించిన తీరును నిశితంగా చూస్తే.. పుల్ల‌ల మాదిరి ఎవ‌రికి వారుగా ఉన్న వివిధ వ‌ర్గాల్ని ఒక తాటి మీద‌కు తీసుకురావ‌ట‌మే కాదు.. వారంద‌రిని ఒక పుల్ల‌ల మోపుగా క‌ట్ట‌క‌ట్టి.. రాజ‌కీయాన్ని న‌డ‌పించ‌టంతోనే తెలంగాణ స్వ‌ప్నం సాకార‌మైంది. త‌న‌కు అల‌వాటైన వ్యూహాన్ని కేసీఆర్ ఇప్పుడు మ‌ర్చిపోయార‌ని చెప్పాలి.

రాజ‌కీయ‌.. సైద్ధాంతిక వైరుధ్యాలున్న వారిని సైతం ఒకే వేదిక మీద‌కు తెచ్చిన టాలెంట్ కేసీఆర్ సొంతం. ఆ వ్యూహంలో భాగంగా కోదండం మాష్టారిని తెర మీద‌కు తెచ్చిన కేసీఆర్‌.. తాను వెన‌కున్న చాలా విష‌యాలకు సంబంధించి ఎవ‌రూ వాస్త‌వం చెప్ప‌లేని ప‌రిస్థితి సృష్టించారు. చివ‌ర‌కు కేసీఆర్ ను ఉద్దేశించి విమ‌ర్శించే ధైర్యం లేని రీతిలో ప‌రిస్థితిని తీసుకొచ్చారు. అంత ప‌క‌డ్బందీగా వ్యూహాన్ని అమ‌లు చేసే కేసీఆర్ ఇప్పుడు త‌ప్పుల మీద త‌ప్పులు చేస్తున్నారు. సొంత పార్టీలోనే విభ‌జించి పాలించు అన్న సూత్రాన్ని అమ‌లు చేయ‌టం ఒక ఎత్తు అయితే.. శ‌త్రు శేషం చేయాల‌న్న ఆయ‌న త‌ప‌న కొత్త చిక్కుల్ని తెచ్చిపెడుతోంది. అత్యంత శ‌క్తివంతుడిగా మారాల‌నుకోవ‌టం త‌ప్పు కాదు..కానీ ప్ర‌త్య‌ర్థి అనేటోడు ఉండ‌కూడ‌ద‌న్న ఆలోచ‌న మంచిది కాదు. ఎంత గొప్ప హీరో అయినా.. ఎలివేట్ అయ్యేది విల‌న్ ఉన్న‌ప్పుడే. విల‌న్ అన్నోడే లేన‌ప్పుడు ఎంత గొప్ప హీరో హీరోయిజం ఎలివేట్ అయ్యేది ఎలా?

త‌న‌కు బాగా తెలిసిన పుల్ల‌ల మోపు క‌థ‌ను కేసీఆర్ మ‌ర్చిపోతున్న‌ట్లున్నారు. గ‌తంలో పుల్ల‌ల్ని ఏర్చికూర్చి మోపుగా చేసిన కేసీఆర్‌.. ఇప్పుడు అదే మోపును త‌న‌కు తానే పుల్ల‌లుగా మార్చేయ‌టంలో అర్థ‌మేమిటి? అదే జ‌రిగితే.. ఎదురుదెబ్బ‌లు తప్ప‌వ‌న్న విష‌యాన్ని కేసీఆర్ ఎంత త్వ‌ర‌గా గుర్తిస్తే అంత మంచిది.