Begin typing your search above and press return to search.

జాతీయ స్థాయిలో కేసీఆర్ తొలి ఓటమి.. దెబ్బ మామూలుగా పడలేదుగా?

By:  Tupaki Desk   |   13 May 2023 10:00 PM GMT
జాతీయ స్థాయిలో కేసీఆర్ తొలి ఓటమి.. దెబ్బ మామూలుగా పడలేదుగా?
X
రాజకీయాల్లో శాశ్విత శత్రువు.. శాశ్విత మిత్రుడు అన్నటోళ్లు ఉండరు. ఎవరికి వారికి అవకాశవాదమే తప్పించి మరింకేమీ ముఖ్యం కాదు. అందునా గులాబీ బాస్ కేసీఆర్.. జేడీఎస్ ముఖ్యనేత కుమారస్వామి ఇద్దరూఇద్దరే. ఆ మాటకు వస్తే.. వీరిద్దరూ అవకాశాల్ని తమకు అనువుగా మార్చుకొని అధికారాన్ని సొంతం చేసుకున్న వారే. కాకుంటే కుమార స్వామితో పోలిస్తే కేసీఆర్ కాస్త భిన్నమైన ధోరణి. ఒడుపుగా అవకాశాన్ని పట్టుకొని ఇమేజ్ పెంచుకుంటూ పోయి.. పొలిటికల్ గా తిరుగులేని స్థానాన్ని సొంతం చేసుకున్న వారైతే.. కుమారస్వామి పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉండే వ్యక్తి. ఆయన చేతికి అధికారిక పగ్గాలు వచ్చినా.. ఫలితం లేని దుస్థితి. ఎప్పుడూ ఇరవయ్యో.. పాతిక సీట్లో తప్పించి బండి ముందుకు వెళ్లదు.

అలాంటి కుమారస్వామితో దోస్తీ చేశారు గులాబీ బాస్ కేసీఆర్. ప్రాంతీయ పార్టీని జాతీయ పార్టీగా మార్చిన కేసీఆర్.. తన జాతీయ పార్టీకి దోస్తులుగా కొందరిని ఎంపిక చేసుకోవటం తెలిసిందే. ఆ కొద్ది మందిలో ముఖపరిచయం బాగా ఉన్న వ్యక్తుల్లో కుమారస్వామి ముఖ్యులు. గుర్తింపు కోసం తహతహలాడుతున్న కుమారస్వామికి అనుకోని రీతిలో కేసీఆర్ కనెక్టు కావటం.. కర్ణాటక ఎన్నికల వేళ.. అన్ని విధాలుగా అండగా ఉంటామన్న మాటతో కేసీఆర్ తో దోస్తీ చాలా త్వరగానే కుదిరిపోయింది.

కట్ చేస్తే.. తాజాగా కర్ణాటక ఎన్నికల ఫలితాలు వచ్చాయి. కాంగ్రెస్ కు స్పష్టమైన మెజార్టీ కనిపిస్తోంది. ఇప్పడున్న ఫలితాలు యథాతధంగా నిలిచిపోయినా.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి అవసరమైన ఎమ్మెల్యేలకంటే అరడజను మంది ఎక్కువే ఉండే పరిస్థితి. ఇలాంటి వేళ.. కేసీఆర్ కు ఇబ్బందికరపరిస్థితులు నెలకొన్నాయని చెప్పాలి. జాతీయ పార్టీ అధినేతగా తన దోస్త్ గా ఎంపిక చేసుకున్న కుమారస్వామి ఓటమి అంటే.. కేసీఆర్ ఖాతాలోనూ ఎదురుదెబ్బ పడినట్లే. కర్ణాటక ఎన్నికల్లో కేసీఆర్ ప్రచారం చేయకున్నా.. కుమారస్వామికి అవసరమైన మంత్రాంగాన్ని సమకూర్చేందుకు పడిన శ్రమ అంతా ఇంతా కాదు. ఇంతా చేస్తే.. అదంతా బూడిదలో పోసిన పన్నీరుగా మారిందని చెప్పాలి. ఇది మొదటి దెబ్బ అయితే.. మరో రెండు దెబ్బలు కర్ణాటక ఎన్నికల ఫలితాలు కేసీఆర్ కు మిగిల్చాయని చెప్పాలి.

జాతీయ పార్టీ అధినేతగా.. తన మిత్రుడి పక్షాన నిలిచే విషయంలో కేసీఆర్ ప్రదర్శించిన పరిమితులు ఆయనకు మిత్రులుగా కావాలనుకుంటున్న వారికి కొత్త సందేహాల్ని తెచ్చి పెట్టాయి. ఆయన స్నేహం లిమిటెడే కానీ అన్ లిమిటెడ్ కాదన్న విషయాన్ని కర్ణాటక ఎన్నికలు స్పష్టం చేశాయి. కుమారస్వామికి అనుకూలంగా ఒక్క ప్రకటన చేయలేదు. ఇలాంటి తీరు జాతీయ పార్టీ అధినేతకు ఉండాల్సిన లక్షణం కాదంటున్నారు. ఇక.. మూడో అంశానికి వస్తే.. జాతీయ పార్టీగా అవతరించిన తర్వాత తన సత్తా చాటుతానన్నట్లుగా వ్యవహరిస్తూ.. ఢిల్లీలో సైతం పార్టీ కార్యాలయాన్ని భారీగా ఏర్పాటు చేసిన కేసీఆర్.. కర్ణాటక ఎన్నికల్లో కనీస ప్రభావాన్ని చూపించకపోవటం.. ఆయన మాటల మనిషే కానీ చేతల మనిషి కాదన్న భావన కలిగేలా చేసింది. ఇలా.. కర్ణాటక ఎన్నికలు కేసీఆర్ ఇమేజ్ ను మూడు రకాలుగా దెబ్బ తీసిందన్న మాట వినిపిస్తోంది.