Begin typing your search above and press return to search.

మోడీని మెప్పించి పనులు చేయించుకుంటున్న కేసీఆర్

By:  Tupaki Desk   |   14 May 2016 5:03 AM GMT
మోడీని మెప్పించి పనులు చేయించుకుంటున్న కేసీఆర్
X
ఆలోచనలు ఉంటేనే సరిపోదు. అవి ఆచరణలో వచ్చేలా చేసేందుకు భారీ కసరత్తు చేయాల్సి ఉంటుంది. ఆ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సక్సెస్ అవుతున్నారని చెప్పాలి. ప్రధాని మోడీ లాంటి వ్యక్తి దగ్గరకు వెళ్లి.. ఆయన్ను మెప్పించి.. అనుకున్నట్లుగా పనులు పూర్తి చేయించుకోవటం అంత చిన్న విషయం కాదు. తనకు తానుగా ఇచ్చిన హామీల్ని సైతం అమలు చేసే విషయంలో మళ్లీ.. మళ్లీ క్రాస్ చెక్ చేసుకోవటం.. తాను ఇచ్చిన హామీలో ఏదైనా ఎక్కువ ఉన్నట్లు అనిపిస్తే దానికి కొర్రీ పెట్టేందుకు ఏమాత్రం మొహమాటపడని తత్వం మోడీలో కనిపిస్తుంది.

హుదూధ్ తుఫాన్ సందర్భంగా విశాఖను పూర్తి స్థాయిలో ఆదుకుంటామని.. వెయ్యికోట్ల తక్షణ సాయం చేస్తామన్న మాటను విశాఖ ఎయిర్ పోర్ట్ లో దిగిన వెంటనే చెప్పేసిన ప్రధాని.. ఆ తర్వాత తాను అనుకున్నంత నష్టం విశాఖకు జరగలేదన్న భావనకు వచ్చిన వెంటనే.. ఇచ్చిన హామీని తూచ్ అనేయటం ఆయనకు మాత్రమే చెల్లుతుంది. అంతదాకా ఎందుకు.. తన ముందున్న ప్రధాని మన్మోహన్ రాజ్యసభలో ఏపీకి ఇచ్చిన ప్రత్యేక హామీని ఏ విధంగా నో చెబుతున్నారో తెలిసిందే.

మోడీ మిత్రపక్షంగా ఉన్న వారికే ఇంత ఇబ్బంది ఉంటే.. ఆయనకు వైరి వర్గంగా ఉండే కేసీఆర్ లాంటి వారికి పనులు చేయించుకోవటం మరింత కష్టమన్న భావన కలగటం ఖాయం. కానీ.. మోడీ మాదిరే.. మూర్తీభవించిన మొండితనంతో వ్యవహరించే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఎక్కడేం చేస్తే తాను అనుకున్న పనులు పూర్తి అవుతాయన్న దాని మీద ఆయన పూర్తి స్పష్టతతో ఉంటారు. అందుకు తగ్గట్లే పావులు కదుపుతున్న ఆయన తెలంగాణ రాష్ట్రానికి అవసరమైన పనుల్ని ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటున్న వైనం కనిపించకమానదు.

తాజాగా తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఐఏఎస్.. ఐపీఎస్ అధికారుల కేటాయింపు చూస్తే.. కేసీఆర్ తాను అనుకున్నది కేంద్రం నుంచి సాధించుకుంటున్నారని చెప్పొచ్చు. 45 మంది ఐఏఎస్ అధికారుల్ని.. 27 మంది ఐపీఎస్ అధికారుల్ని తమకు కేటాయించేలా తెలంగాణ ముఖ్యమంత్రి చేసుకోగలిగారు. ప్రస్తుతం పది జిల్లాలుగా ఉన్న తెలంగాణను త్వరలో 25 లేదంటే 26 జిల్లాలకు పెంచాలన్న ఆలోచనలో ఉన్న కేసీఆర్.. అందుకు తగ్గట్లు పాలనాపరమైన ఇబ్బందులు చోటు చేసుకోకుండా ఉండేందుకు వీలుగా భారీగా ఐఏఎస్.. ఐపీఎస్ లను కావాలని కోరుకుంది. చూసేందుకు 45 మంది ఐఏఎస్ లు.. 27 మంది ఐపీఎస్ లను కేంద్రం కేటాయించినట్లు కనిపించినా.. తెలంగాణ సర్కారు అడిగిన దానితో పోలిస్తే.. ఈ కేటాయింపులు కొంతేనని అనిపించక మానదు. కాకుంటే.. మోడీ మైండ్ సెట్ ను మ్యాప్ చేయటంలో సక్సెస్ అవుతున్న కేసీఆర్.. తనకు అవసరమైన ఐఏఎస్.. ఐపీఎస్ అధికారుల్ని కేంద్రం నుంచి తీసుకోవటంలో ఎంతోకొంత విజయవంతం అయ్యారనే చెప్పాలి.