Begin typing your search above and press return to search.

తిరుగుబాటు చేశారు.. కేసీఆర్ విస్మరించాడు..!

By:  Tupaki Desk   |   18 July 2020 8:10 AM GMT
తిరుగుబాటు చేశారు.. కేసీఆర్ విస్మరించాడు..!
X
తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఆవేశమొచ్చినా.. అనుగ్రహం వచ్చినా ఆపలేమని ఆ పార్టీలో అంటుంటారు. మంచిగా ఉంటే వరాలు కురిపిస్తారు. తిరుగుబాటు చేస్తే అథ: పాతాళానికి తొక్కేస్తారు. తాజాగా కరోనా టైంలోనూ తోకజాడించిన వారిని కేసీఆర్ విస్మరించిన తీరు హాట్ టాపిక్ గా మారింది.

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ప్రారంభ రోజుల్లో సీఎం కేసీఆర్ పరిస్థితిని చాలా తరచుగా సమీక్షించేవారు. మీడియాతో రోజూ ఇంటరాక్ట్ అవుతూ పెద్ద ప్రకటనలు చేసేవారు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం తక్కువ కరోనా పరీక్షలు చేయడం ప్రారంభించినప్పుడు.. కేసీఆర్ మీడియా ముందు కనిపించడం లేదు. ఇప్పటివరకు దాదాపు రెండున్నర నెలలుగా కేసీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించలేదు. కరోనా గురించి సమీక్షించలేదు.

ప్రగతి భవన్‌లో శుక్రవారం కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. అధికారులతో చర్చించిన తరువాత సీఎం కరోనాతో పోరాడుతున్న క్షేత్రస్థాయి సిబ్బందికి కొన్ని వరాలు ప్రకటించారు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పనిచేసే అధ్యాపకులకు యుజిసి స్కేల్ జీతాలను అమలు చేయాలని.. కొత్తగా నియమించబడిన నర్సులకు పాత ఉద్యోగులతో సమానంగా జీతాలు చెల్లించాలని కేసీఆర్ ఆదేశించారు.

ఇది కాకుండా ఆయుష్ విభాగాల్లో పనిచేసే ఫ్యాకల్టీ సభ్యుల వయోపరిమితిని 65 ఏళ్లకు పెంచాలని కేసీఆర్ నిర్ణయించారు. ఇంకా ఆశ్చర్యకరంగా రాష్ట్రవ్యాప్తంగా పీహెచ్‌సీలో ఖాళీగా ఉన్న 200 డాక్టర్ పోస్టులను నియమించాలని కేసీఆర్ ఆదేశించారు.

అయితే, కేసీఆర్ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులను ఈ సమీక్షలో విస్మరించారు. నిమ్స్, గాంధీ హాస్పిటల్.. కింగ్ కోటి ఆసుపత్రుల్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు రెండు వారాలుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. వారు తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని.. జీతాలను 5000 రూపాయలకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. 2007 నుండి వారికి కేవలం 15 వేల రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారు. గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ వారి డిమాండ్లను పరిశీలిస్తామని హామీ ఇచ్చినప్పటికీ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు నిరసన నుండి వెనక్కి తగ్గలేదు.

ప్రభుత్వం ఈ విషయంలో అస్సలు స్పందించడం లేదు. వందలాది మంది ఉద్యోగులు ఆయా ఆసుపత్రుల ప్రవేశ ద్వారం వద్ద రోజూ నిరసన తెలుపుతున్నారు. సాయంత్రం వరకు కొనసాగిస్తున్నారు. ఇంతటి క్లిష్ట సమయంలో తిరుగుబాటు చేసిన ఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆందోళనలను కేసీఆర్ అస్సలు పట్టించుకోకపోవడం గమనార్హం.