Begin typing your search above and press return to search.

కేసీఆర్ లోని ఉద్య‌మ‌నేత‌ను కెలికిన మోడీ?

By:  Tupaki Desk   |   4 March 2018 7:30 AM GMT
కేసీఆర్ లోని ఉద్య‌మ‌నేత‌ను కెలికిన మోడీ?
X
కేసీఆర్ అంటే.. ఒక మొండిత‌నం. అంత‌కు మించిన ప‌ట్టుద‌ల‌. అవ‌స‌ర‌మైతే తానెంత మూర్ఖంగా వ్య‌వ‌హ‌రిస్తారో చేత‌ల్లో చేసి చూపిస్తారు. మాట‌ల్లోనూ.. వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించ‌టంలోనూ.. ఏ కోణంలో చూసినా.. ఆయ‌న‌లో మైన‌స్సుల కంటే ప్ల‌స్సులు ఎక్కువ‌గా క‌నిపిస్తుంటాయి. అలాంటి కేసీఆర్‌కు కోపం వ‌స్తే ఎలా ఉంటుందో శాంపిల్ చూపించారు తాజాగా నిర్వ‌హించిన ప్రెస్ మీట్ లో.

తాను కోరుకున్న‌వ‌న్నీ తీర్చ‌కున్నా.. తాను ప్రాధాన్య‌త ఇచ్చి మ‌రీ కోరిన అంశాల‌పైన లైట్ తీసుకోవ‌టం హ‌ర్ట్ చేయ‌ట‌మే కాదు.. ఇగోను ట‌చ్ చేసింద‌ని చెప్పాలి. త‌న‌దైన రాజ‌కీయంతో వెళుతుంటే.. అందుకు ఓకే అనాల్సిన మోడీ.. అందుకు భిన్నంగా లైట్ తీసుకోవ‌ట‌మే కాదు.. నువ్వెంత‌న్న‌ట్లుగా చేత‌ల్లో చేసి చూపించ‌టం కేసీఆర్ కు కాలేలా చేసింది.

నాడు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌ని చంద్ర‌బాబుకు విభ‌జ‌న రాగంతో చుక్క‌లు చూపించిన కేసీఆర్‌.. తాజాగా రాష్ట్రాల ప్రయోజ‌నాల్ని ప‌ట్టించుకోకుండా కేంద్రం పెద్ద‌న్న పాత్ర‌ను పోషించ‌ట‌మే కాదు.. అవ‌స‌రానికి మించిన పెద్ద‌రికాన్ని ప్ర‌ద‌ర్శిస్తూ.. రాష్ట్రాల అభివృద్ధిని అడ్డుకుంటున్నాయ‌న్న కొత్త రాగాన్ని తెర‌పైకి తెచ్చేళా చేశారు.

ఎప్ప‌టి నుంచో క‌ల‌లు కంటున్న ఈశాన్య రాష్ట్రాల్లో పాగా వేయాల‌న్న క‌మ‌ల‌నాథుల క‌ల నెర‌వేరిన సంతోషంలో ఉన్న వేళ‌.. ఆ ఆనందాన్ని మిగల్చ‌కుండా చేసింది కేసీఆర్ ప్రెస్ మీట్‌. బీజేపీ నేత‌లు ఊహించిన‌దానికి భిన్నంగా కేంద్రంపై క‌స్సుమ‌న్నారు. అక్క‌డితో ఆగ‌కుండా దేశానికి స్వాతంత్య్రం వ‌చ్చి 70 ఏళ్లు అవుతున్నా.. ఈ దేశంలో ఇప్ప‌టికి మంచినీళ్లు అంద‌ని దుస్థితి ఏమిటంటూ సూటిగా ప్ర‌శ్నించ‌టం ద్వారా జాతీయ‌పార్టీల వైఫ‌ల్యాన్ని ఒక్క‌మాట‌లో తేల్చేశారు.

దాదాపు ప‌దిహేడేళ్ల క్రితం తెలంగాణ‌కు జ‌రుగుతున్న అన్యాయంపై ఒక‌సారి దాని సంగ‌తి చూడాల‌నుకున్నాన‌ని.. సుదీర్ఘ ప్ర‌యాణంతో తాను అనుకున్న‌ది సాధించాన‌ని చెప్పిన కేసీఆర్‌.. మ‌రోసారి రాష్ట్రాల‌కు కేంద్రాల కార‌ణంగా జ‌రుగుతున్న న‌ష్టంపై పోరాడాల‌న్న భావ‌న‌ క‌లిగేలా ఇటీవ‌ల ప‌రిణామాలు చోటు చేసుకున్నాయ‌ని కేసీఆర్ చెప్పేశారు. మోడీకి వ్య‌తిరేకంగా రాష్ట్రాల్ని జ‌ట్టు క‌ట్టే విష‌యంలో తాను కీల‌క‌పాత్ర పోషిస్తాన‌ని చెప్ప‌టం ద్వారా.. రానున్న రోజుల్లో జాతీయ రాజ‌కీయాలు ఏ రీతిలో మార‌తాయ‌న్న విష‌యాన్ని కేసీఆర్ చెప్పేశారు. కేసీఆర్ ప్రెస్ మీట్ మొత్తాన్ని జాగ్ర‌త్త‌గా చూస్తే.. అర్థ‌మ‌య్యేది ఒక్క‌టే.. కేసీఆర్ లోని ఉద్య‌మ‌నేత ఇగో మ‌రోసారి హ‌ర్ట్ అయ్యింది. మోడీ మీద విమ‌ర్శ‌ల క‌త్తి దూసిన కేసీఆర్‌.. రానున్న రోజుల్లో త‌న ఎజెండా ఏమిట‌న్న‌ది తేల్చేసిన నేప‌థ్యంలో కేంద్రం ఎలా రియాక్ట్ అవుతుందన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా చెప్ప‌క త‌ప్ప‌దు.