Begin typing your search above and press return to search.

ఆసుపత్రికి సారు ఎప్పుడు వెళ్లినా కనిపించని సీన్ ఈసారి కనిపించిందే

By:  Tupaki Desk   |   8 Jan 2021 3:46 AM GMT
ఆసుపత్రికి సారు ఎప్పుడు వెళ్లినా కనిపించని సీన్ ఈసారి కనిపించిందే
X
కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా సర్కారీ వైద్యాన్ని అందుబాటులోకి తెస్తామని.. అందుకోసం వందల కోట్ల రూపాయిల ప్రజాధనాన్ని ఖర్చు చేయటం ప్రభుత్వాలకు అలవాటే. కానీ.. ప్రభుత్వాధినేతలకు ఎప్పుడైనా అనారోగ్యం వస్తే మాత్రం.. కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లటం మామూలే. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆయన కుటుంబ సభ్యులకు ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా వెళ్లే యశోదా ఆసుపత్రికి సీఎం కేసీఆర్ వెళ్లటం తెలిసిందే.

ఊపిరితిత్తుల్లో మంటగా ఉండటంతో ఆయన ఆసుపత్రికి వెళ్లినట్లు టీవీల్లో బ్రేకింగ్ న్యూసుల్లో వచ్చినా.. ఆయనకు ఛాతీలో మంటగా అనిపించటంతో ఆసుపత్రికి వెళ్లినట్లు చెబుతున్నారు. దగ్గుతో ఇబ్బంది పడుతున్న ఆయనకు ఊపిరితిత్తుల్లో స్వల్ప ఇన్ ఫెక్షన్ తో ఇబ్బంది పడుతున్నట్లుగా గుర్తించారు. ఆయన ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది లేదని ఆయన వ్యక్తిగత వైద్యుడు ఎంవీ రావు స్పష్టం చేశారు. అయితే.. రోటీన్ చెకప్ లో భాగంగా ఆయన ఆర్నెల్లకు ఒకసారి ఆసుపత్రికి వస్తారని.. ఇందులో భాగంగానే తాజాగా ఆసుపత్రికి వచ్చినట్లు చెబుతున్నారు.

ఎప్పుడు ఆసుపత్రికి వచ్చినా.. ఎవరో ఒకరు మాత్రమే ఆయన వెంట ఉండేవారు. ఈసారి మాత్రం అందుకు భిన్నంగా ఆయన వెంట కుమారుడు మంత్రి కేటీఆర్.. కుమార్తె కమ్ ఎమ్మెల్సీకవిత.. సన్నిహిత బంధువు అయిన ఎంపీ సంతోష్ లు యశోదా ఆసుపత్రికి వెళ్లే సమయంలో వెంట ఉన్నారు. దాదాపు గంటన్నర పాటు ఆసుపత్రిలో ఉన్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా చూస్తే..ఈసారి చెకప్ కోసం ఆసుపత్రికి వెళ్లే వేళ.. కుటుంబ సభ్యుల్లోని ముఖ్యులంతా పెద్ద సారు వెంటే ఉండటం ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.