Begin typing your search above and press return to search.

శబాష్.. బాదుడులోనూ సారు రాజసం

By:  Tupaki Desk   |   14 March 2020 5:05 AM GMT
శబాష్.. బాదుడులోనూ సారు రాజసం
X
దేనికైనా ఖలేజా ఉండాలి. తన మీద తనకు నమ్మకం ఉన్న వారు.. తాను చేస్తున్నది సరైనదని అనుకునే వేళ.. చెప్పే మాటల్లో దమ్ము ఎంత ఉంటుందో తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాటల్ని చూస్తే.. ఇట్టే అర్థమైపోతుంది.ప్రభుత్వం ఏదైనా.. ప్రజల్లో ఎంత ఆదరణ ఉన్నా.. పన్నులు పెంచేసి.. ప్రజల వీపుల మీద భారం బాదేస్తామన్నంతనే.. ప్రజల నుంచి రియాక్షన్ ఎలా ఉంటుందన్న బెరుకు ఉంటుంది. కానీ.. తనకు అలాంటివేమీ ఉండవన్న విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తన మాటల్లో చెబుతున్న వైనం ఆసక్తికరంగా మారిందని చెప్పాలి.

బరాబర్.. పన్నులు పెంచుతామని ఏ ముఖ్యమంత్రి అయినా నేరుగా చెప్పేస్తారా?అలా చెప్పటానికి ముందు రాష్ట్రం పరిస్థితి బాగోలేదని.. ఈ పన్నుల కారణంగా వచ్చే ఆదాయంతోనే రాష్ట్ర బండి నడవాలన్న పాతకాలం నాటి మాటలకు చెల్లుచీటి ఇచ్చేస్తూ.. సరికొత్తగా.. తనదైన శైలిలో కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు చూస్తే.. ఏదైనా ఆయనకు మాత్రమే సాధ్యమేమో? అన్న భావన కలుగక మానదు.

తాజాగా తెలంగాణ రాష్ట్రంలో ఆస్తిపన్ను పెంచేస్తామని చెబుతున్న ఆయన.. కండిషన్లు అప్లై అంటూ ఆసక్తికర ముచ్చటను చెబుతున్నారు. ఆస్తిపన్ను పెంచటం ఖాయమని.. కాకుంటే అడ్డదిడ్డంగా పెంచమని.. వాస్తవ పరిస్థితుల్ని ప్రజలకు చెప్పిన తర్వాతే పెంచుతామని చెప్పటం గమనార్హం. ఈ సందర్భంగా కేసీఆర్ నోటి నుంచి వచ్చిన మాటల్ని చూస్తే.. పన్ను పెంపు విషయంలో పక్కా హోంవర్క్ చేసిన తర్వాత ఈ అంశంపై తన వాదనను వినిపిస్తున్నారని చెప్పక తప్పదు.

‘‘ఆస్తిపన్ను పెంచాలి. లంచం ఇచ్చినోడికి ఒకరకమైన పన్ను. ఇవ్వని వాడికి మరోరకంగా ఉండకూడదు. ఎవరో వచ్చి లెక్కలు వేయరు. ప్రజలే తమ ఇల్లు విస్తీర్ణంలో ఉందో వారే కొలుచుకొని పన్ను లెక్కించి కట్టాలి. తప్పుడు లెక్కలు చూపిస్తే 25 రెట్లు అపరాధ రుసుం.. రెండేళ్ల జైలుశిక్ష విధిస్తాం.

మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను పెంచక తప్పదు. నిధులు లేకుంటే డెవలప్ మెంట్ పనులు చేయలేం కదా? పనులు చేయలేదని ప్రజాప్రతినిధులు నిందలు ఎందుకు పడాలి’’ అంటూ సీఎం కేసీఆర్ వినిపిస్తున్న వాదన చూసినప్పుడు పన్నులు పెంపు విషయంలో ప్రజలకే అవకాశం ఇచ్చినట్లుగా చేసి.. తాను అనుకున్నది పూర్తి చేసేలా వ్యూహాన్ని సిద్ధం చేసినట్లు చెప్పాలి.

ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వం తీవ్రమైన నిధుల కొరతను ఎదుర్కొంటోంది. ఇలాంటివేళ.. ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవటానికి పన్నులు వేయటం మినహా మరో మార్గం లేదు. అలా చేస్తే ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతుంది. అలాంటి అవకాశం లేకుండా ఉండేందుకు కేసీఆర్ వినిపిస్తున్న వాదన కొట్టిపారేయలేని రీతిలో ఉండటం గమనార్హం.

ఆస్తిపన్నుతో పాటు.. విద్యుత్ ఛార్జీలను కూడా పెంచనున్న వైనాన్ని చెప్పేశారు. అయితే.. పేదలు.. దళితులు.. గిరిజనులకు విద్యుత్తు ఛార్జీలు పెంచమన్న ఆయన.. వారికి ఇస్తున్న ఉచిత విద్యుత్తు యూనిట్లను యథావిధిగా కొనసాగించనున్నట్లు చెప్పుకొచ్చారు. పన్నులు.. ఛార్జీల పెంపు విషయంలో అందరిని ఒకే గాటున కట్టేయకుండా.. విభజించి పాలించు మాదిరి.. కొందరికి మినహాయింపులు ఇవ్వటం.. మరికొందరిపై భారాన్ని మోపటం ద్వారా కేసీఆర్ తాను అనుకున్నట్లుగా పన్ను వడ్డింపులకు అవసరమైన రంగాన్ని సిద్ధం చేశారనే చెప్పాలి.