Begin typing your search above and press return to search.

సీఎం బ్యాక్ టు ప్ర‌గ‌తి భ‌వ‌న్ .. కరోనా పై ఉన్నత స్థాయి సమీక్ష !

By:  Tupaki Desk   |   5 May 2021 6:33 AM GMT
సీఎం బ్యాక్ టు ప్ర‌గ‌తి భ‌వ‌న్ .. కరోనా పై ఉన్నత స్థాయి సమీక్ష !
X
తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు ఎర్ర‌వ‌ల్లి లోని త‌న ఫామ్‌ హౌస్‌ నుండి హైదరాబాద్ కి చేరుకునే అవకాశం ఉంది అంటూ ఓ వార్త ప్రసారమాధ్యమాల్లో ప్రసారం అవుతుంది. సీఎం కేసీఆర్ కరోనా నుండి పూర్తిగా కోలుకోవడంతో అయన తిరిగి పూర్తీ స్థాయిలో ఈ రోజు నుండి అధికారిక కార్యకలాపాల్లో పాల్గొననున్నారు. తాజాగా నిర్వ‌హించిన ఆర్‌ టీపీసీఆర్ ప‌రీక్ష‌లో కేసీఆర్‌ కు క‌రోనా నెగిటివ్‌ గా తేలింది. ప్ర‌స్తుతం కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నార‌ని ఆయ‌న వ్య‌క్తిగ‌త వైద్యులు వెల్లడించారు . అన్ని ర‌క్త ప‌రీక్ష‌ల రిపోర్ట్ లు నార్మ‌ల్ వ‌చ్చిన‌ట్లు వైద్యులు వెల్ల‌డించారు. త‌క్కువ స‌మ‌యంలో క‌రోనాను జ‌యించారు కేసీఆర్‌.

తెలంగాణ సీఎం కేసీఆర్‌ కు ఏప్రిల్‌ 19న క‌రోనా పాజిటివ్‌ గా నిర్ధార‌ణ అయిన విష‌యం తెలిసిందే. అప్పటి నుంచీ సీఎం కేసీఆర్ ఎర్ర‌వ‌ల్లి లోని త‌న ఫామ్‌ హౌస్‌ లో హోమ్ ఐసోలేషన్‌ లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు. వైరస్ తీవ్రతను తెలుసుకునేందుకు ఏప్రిల్ 21న యశోదా ఆస్పత్రిలో సిటీ స్కాన్ చేశారు. ఆ స‌మ‌యంలో అంతా నార్మల్‌ గానే ఉందని డాక్టర్లు తెలిపారు. ఆ తర్వాత తిరిగి ఫామ్ హౌస్‌ కు వెళ్లారు. అనంత‌రం అక్క‌డే చికిత్స కొనసాగించారు. తాజాగా చేసిన పరీక్షల్లో ఆయనకు నెగెటివ్ వచ్చింది. దీనితో మళ్ళీ అధికారిక కార్యకలాపాల్లో పాల్గొననున్నారు. అలాగే ఇటీవలే మంత్రివర్గం నుండి తొలగించిన ఈటల వైద్య , ఆరోగ్య శాఖ ను కూడా సీఎం కేసీఆర్ తనవద్దే ఉంచుకున్నారు. దీనితో దానిపై క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. నేడు కరోనా పై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది.

తెలంగాణలో క‌రోనా కేసుల ఉద్ధృతి కొన‌సాగుతోంది. మొన్న రాత్రి 8 గంట‌ల నుంచి నిన్న రాత్రి 8 గంటల మ‌ధ్య 6,361 మందికి కరోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్ర‌కారం... ఒక్క‌రోజులో కరోనాతో 51 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 2,527 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,69,722కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 3,89,491 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 2,527గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 77,704 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు.