Begin typing your search above and press return to search.

హైదరాబాద్ వరద బాధితులకు కేసీఆర్ అభయం.. ఇంటికి రూ.10వేలు పంపిణీ

By:  Tupaki Desk   |   20 Oct 2020 5:18 AM GMT
హైదరాబాద్ వరద బాధితులకు కేసీఆర్ అభయం.. ఇంటికి రూ.10వేలు పంపిణీ
X
వరాల దేవుడిగా అభివర్ణించే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. తనకున్న ఇమేజ్ కు ఏ మాత్రం తగ్గకుండా ప్రకటనలు చేస్తుంటారు.తాజాగా అలాంటి ప్రకటనే చేశారు. గడిచిన వారంలో రెండు..మూడు సార్లు దంచికొట్టిన వర్షంతో హైదరాబాద్ మహానగరంలోని లక్షలాది మంది తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.వేలాది మంది నిరాశ్రయలు అయ్యారు. ఇళ్లల్లోకి వరద నీరు రావటంతో ఆగమాగమయ్యారు. ఇలాంటివేళ.. సాయం కోసం ఎదురుచూస్తున్న గ్రేటర్ ప్రజలకు కాస్తంత ఊరట ఇచ్చేలా సీఎం కేసీఆర్ తాజాగా వరాన్ని ప్రకటించారు.

హైదరాబాద్ మహానగరంలో వరద ప్రభావానికి గురైన ప్రతి ఇంటికి రూ.10వేల చొప్పున సాయాన్ని అందిస్తామని ప్రకటించారు. అది కూడా మంగళవారం నుంచే షురూ అవుతుందని చెప్పారు. అవసరమైతే.. లక్ష ఇళ్లకైనా రూ.10వేలు ఇచ్చేందుకు వెనుకాడమని స్పష్టం చేశారు. అంతేకాదు.. వర్షాలు.. వరదల కారణంగా ఇళ్లు పూర్తిగా కూలిపోయిన వారికి రూ.లక్ష.. పాక్షికంగా కూలిన వారికి రూ.50వేలచొప్పున ఆర్థిక సాయం అందిస్తామని స్పష్టం చేశారు.

వర్షాల కారణంగా దెబ్బ తిన్న రోడ్లను తక్షణమే మరమ్మత్తులు చేయాలని.. మౌలిక సదుపాయాలను కల్పించాలని.. మళ్లీ సాధారణ జన జీవన పరిస్థితులు నెలకొనేలా చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు తగ్గట్లే.. మున్సిపల్ శాఖకు తక్షణం రూ.550 కోట్లు విడుదల చేయాలన్న ఆర్డర్ వేసేశారు. గడిచిన వందేళ్లలో ఎన్నడూ రానంత భారీ వర్షం హైదరాబాద్ మహానగరంలో కురిసినట్లుగా చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో బాధితుల్ని ఆదుకునేందుకు సీఎం వరాన్ని ప్రకటించారు. అయితే..జరిగిన నష్టానికి.. ప్రభుత్వం అందించే రూ.10వేలకు ఏ మాత్రం పొంతన ఉండదంటున్నారు. ఎందుకంటే.. ఒక ఇంట్లోకి వరద నీరు వస్తే.. ఆ ఇంటికి జరిగే కనిష్ఠ నష్టం రూ.50 వేల వరకు ఉంటుందని.. గరిష్ఠ నష్టం రూ.5లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇలా చూసినప్పుడు ప్రభుత్వం అందించే ఆర్థిక సాయం కంటితుడుపు అన్న మాట వినిపిస్తోంది. కాకుంటే.. రూ.10వేల మొత్తాన్ని ఈ మధ్య కాలంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించలేదన్న మాట అధికారుల నోటి నుంచి రావటం గమనార్హం.