Begin typing your search above and press return to search.

కోర్టు నోట కేసీఆర్ దిల్ ఖుష్ అయ్యే మాటలు

By:  Tupaki Desk   |   1 Aug 2019 10:23 AM IST
కోర్టు నోట కేసీఆర్ దిల్ ఖుష్ అయ్యే మాటలు
X
ఏ ముహుర్తంలో షురూ చేశారో కానీ.. కొత్త అసెంబ్లీ నిర్మాణానికి సంబంధించి హైకోర్టులో జరుగుతున్న విచారణలో పలుమార్లు ఇబ్బందికర ప్రశ్నల్ని ఎదుర్కొన్నారు సీఎం కేసీఆర్. తాజాగా అందుకు భిన్నమైన పరిస్థితిని ఆయనకు ఎదురైందని చెప్పాలి. నిక్షేపంలా ఉన్న భవనాన్ని వదిలేసి.. కొత్త భవనాన్ని నిర్మించాలన్న వైనంపై పలుమార్లు ప్రశ్నలు సంధించిన హైకోర్టు తాజాగా మాత్రం అందుకు భిన్నమైన ప్రశ్నల్ని పిటిషన్ దారుకు సంధించటం గమనార్హం.

ఈ ప్రశ్నల వేళ.. కోర్టు చేసిన వ్యాఖ్యలతో కేసీఆర్ దిల్ ఖుష్ కావటం ఖాయమన్నట్లుగా తాజా కామెంట్స్ ఉన్నాయని చెప్పాలి. కొత్త అసెంబ్లీ భవన నిర్మాణం విషయంలో తెలంగాణ ప్రభుత్వం తరఫున న్యాయవాది వినిపించిన వాదనలకు అనుగుణంగా హైకోర్టు స్పందిస్తూ.. ప్రస్తుత అసెంబ్లీ భవనం అవసరాలకు తగినట్లుగా లేదని.. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని నిర్మించాలని అనుకుంటుందని.. అందులో తప్పేముందని ప్రశ్నించటం ఆసక్తికర పరిణామంగా చెప్పక తప్పదు.

ఈ సందర్భంగా కోర్టు కొన్ని ఉదాహరణల్ని ప్రస్తావించింది. పంజాబ్ - హర్యానా విడిపోయినప్పుడు అమృత్‌ సర్‌ - పాటియాలా లాంటి సిటీలు ఉన్నప్పటికి చండీగఢ్ నిర్మాణాన్ని చేపట్టారని చెప్పింది. భోపాల్ కంటే ఘనంగా ఉండాలన్న ఉద్దేశంతో జయపురలో గోపురం ఆకాంలో అద్భుతమైన అసెంబ్లీని నిర్మించింది కదా? అని ప్రశ్నించింది.

ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. కేసీఆర్ మనసు సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయ్యే మాటల్ని కోర్టు ప్రస్తావించింది. తెలంగాణ రాష్ట్రం కోసం చేసిన పోరాటాన్ని స్వాతంత్ర్య పోరాటంతో పోల్చలేం కానీ.. ప్రత్యేక గుర్తింపు కోసం ఆ స్థాయిలో పోరాటం జరిగిందని.. పోరాడి సాధించుకున్న కొత్త రాష్ట్రంలో తెలంగాణ గౌరవానికి ప్రతీకగా కొత్త భవనం నిర్మించుకుంటే తప్పేమిటంటూ ప్రశ్నించింది.

దీనిపై పిటిషనర్ తరఫు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ.. కొత్త భవనాన్ని ఖాళీ ప్రదేశంలో నిర్మించుకోవచ్చని.. వారసత్వ కట్టడాలను కూల్చి నిర్మించటంపైనే తమకు అభ్యంతరం ఉందని వ్యాఖ్యానించారు. వారసత్వ కట్టడాల్ని కూల్చి కొత్త భవనాలపైనే తమకు అభ్యంతరాలున్నట్లు చెప్పారు. కొత్త భవనాల కోసం చారిత్రక భవనాన్ని కూల్చివేయాలన్న ప్రభుత్వం నిర్ణయం మీదనే తమకు అభ్యంతరంగా పేర్కొన్నారు. వారసత్వ కట్టడాల్ని రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందన్నారు. ఇప్పటివరకూ జరిగిన దానికి భిన్నంగా.. కొత్త భవనాల్ని నిర్మించే విషయంపై తాజాగా కోర్టు చేసిన వ్యాఖ్యలు కేసీఆర్ ప్రభుత్వానికి మనోస్థైర్యాన్ని ఇస్తాయని చెప్పక తప్పదు. దీనిపై వాదనలు జరగనున్నాయి. ఈ వాదనలు పూర్తి అయ్యాక కోర్టు తన నిర్ణయాన్ని వెల్లడించనుంది.