Begin typing your search above and press return to search.

బంగారు ప‌త‌కాన్ని సాధించిన కేసీఆర్ మ‌న‌మ‌డు

By:  Tupaki Desk   |   1 March 2019 6:51 AM GMT
బంగారు ప‌త‌కాన్ని సాధించిన కేసీఆర్ మ‌న‌మ‌డు
X
ఎంతైనా ముఖ్య‌మంత్రి మ‌న‌మ‌డు అంటే మాట‌లా? అస‌లు కంటే కొస‌రు ముద్దు అన్న చందంగా.. కొడుకు కూతురు కంటే కూడా వారి పిల్ల‌ల‌తో మ‌రింత చ‌నువుగా ఉండే కేసీఆర్.. తాత‌య్య రోల్ కు నూటికి నూరు శాతం న్యాయం చేస్తార‌ని చెబుతారు.ఈ మ‌ధ్య‌న కాస్త త‌గ్గింది కానీ.. అప్ప‌ట్లో త‌న వెంట పెట్టుకొని మ‌న‌మ‌డ్ని తీసుకెళ్లిన వైనం ప‌లువురి దృష్టిని ఆక‌ర్సిస్తుంటుంది.

ప‌లు కీల‌క కార్య‌క్ర‌మాల‌కు త‌న మ‌న‌మ‌డ్ని వెంట‌బెట్టుకెళ్లే కేసీఆర్.. ఈ మ‌ధ్య‌న మాత్రం త‌న‌తో తీసుకురావ‌టం లేదు. ఆ మ‌ధ్య‌న కేసీఆర్ మ‌న‌మ‌డ్ని ఉద్దేశించి ఇద్ద‌రు ముగ్గురు నేత‌లు నోరు పారేసుకోవ‌టం తెలిసిందే. ఇక‌.. ఆ విష‌యాన్ని వ‌దిలేస్తే కేసీఆర్ మ‌న‌మ‌డిగా.. కేటీఆర్ కొడుకుగా సుప‌రిచితులు క‌ల్వ‌కుంట్ల హిమాన్షురావు.

హైద‌రాబాద్ లోని ఓక్రిడ్జ్ స్కూల్లో ఎనిమిదో త‌ర‌గ‌తి చ‌దువుతున్న హిమాన్షు ఒక పోటీలో పాల్గొన్నాడు. ఆ పోటీలో జాతీయ స్థాయిలో బంగారు ప‌త‌కాన్ని సొంతం చేసుకున్న వైనం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. ఇంత‌కీ ఆ పోటీ కాస్త భిన్న‌మైన‌ది. ప‌ర్యావ‌ర‌ణ పోటీల్లో భాగంగా హిమాన్షు బంగారు ప‌త‌కాన్ని సొంతం చేసుకున్న‌ట్లు చెబుతున్నారు.

డీహెచ్‌ ఎఫ్‌ ఎల్ అనే బీమాసంస్థ ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌లో భాగంగా ఒక పోటీని నిర్వ‌హించింది. ఇందులో ఎవ‌రైతే పున‌రుత్పాద‌క వ్య‌ర్థాల్ని ఎక్కువ‌గా సేక‌రిస్తారో వారికి బ‌హుమ‌తి వ‌స్తుంది. ఈ పోటీలో మిగిలిన వారి కంటే ఎక్కువ‌గా హిమాన్షు మొత్తం 34వేలకు పైగా కేజీల వ్య‌ర్థాల్ని సేక‌రించారు. దీంతో అత‌నికి మొద‌టిస్థానం ల‌భించింది. మూడో స్థానం కూడా అదే స్కూల్ కు చెందిన మ‌రో విద్యార్థి సొంతం చేసుకున్నారు. వేల కేజీల వ్య‌ర్థాల్ని సేక‌రించి ప్రైజ్ సాధించిన హిమాన్షుకు అభినంద‌న‌లు తెలుపుదామా?