Begin typing your search above and press return to search.

పారిపోయిన కేసీఆర్ ప్రభుత్వం

By:  Tupaki Desk   |   2 Oct 2015 8:30 PM GMT
పారిపోయిన కేసీఆర్ ప్రభుత్వం
X
సాధారణంగా అసెంబ్లీ సమావేశాల్లో అధికార పక్షాలు పైచేయి సాధిస్తూ ఉంటాయి. ప్రతిపక్షాలు ఒకవేళ పైచేయి సాధించినా.. ఆ వెంటనే వాటిని తోసిరాజని అధికార పక్షం ఆధిపత్యం చాటుకుంటూ ఉంటుంది. కానీ, అధికారపక్షం పారిపోయిన ఘటనలను మనం మన దేశ రాజకీయ, పార్లమెంటు చరిత్రలోనే చూడం. కానీ, ఇటువంటి ఘటన తెలంగాణ అసెంబ్లీలో చోటుచేసుకుంది.

రైతు ఆత్మహత్యలు, ఒకే దఫా రుణ మాఫీ విషయంలో ప్రతిపక్షాలకు సమాధానం చెప్పలేక అధికారపక్షం పారిపోయింది. గురువారం అసెంబ్లీ ప్రారంభమైంది. కాంగ్రెస్ నాయకుడు జీవన్ రెడ్డి ఒకే దఫా రుణ మాఫీపై ఆందోళన చేశారు. ఆయనకు కాంగ్రెస్ మొత్తం అండగా నిలిచింది. సర్వసాధారణంగా అసెంబ్లీలో కాంగ్రెస్ ఆందోళన చేస్తే తెలుగుదేశం మౌనంగా ఉంటుంది. తెలుగుదేశం ఆందోళన చేస్తే కాంగ్రెస్ స్పందించదు. కానీ, ఈసారి మాత్రం కాంగ్రెస్ కు టీడీపీ - బీజేపీ - సీపీఐ - సీపీఎం - వైసీపీ తదితర అన్ని పార్టీలూ మద్దతు ఇచ్చాయి. అన్ని పార్టీలూ తమ తమ స్థానాల్లో లేచి నిలబడి ఆందోళన చేశాయి. రుణ మాఫీపై నినదించాయి. వాస్తవానికి, ఒక పక్షం ఆందోళన చేస్తే సభను వాయిదా వేయవచ్చు. అప్పటికీ ఆ పార్టీ సభ్యులు స్పందించకపోతే వారిని సస్పెండ్ చేస్తారు. కానీ అన్ని పార్టీలూ ఏకమై ఐక్యంగా ఆందోళన చేస్తే సభను వాయిదా వేసినా ఉపయోగం ఉండదు. ఆ తర్వాత కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది. ఇక సస్పెండ్ చేద్దామంటే అందరినీ సస్పెండ్ చేయడం కుదరదు. ఇటువంటి పరిస్థితుల్లోనే కేసీఆర్ ప్రభుత్వం చిక్కుకుంది. దాంతో ఏడు నిమిషాల్లోనే సభను వాయిదా వేసి వెళ్లిపోవాల్సి వచ్చింది. దాంతో మూడు రోజులు గడువు దొరుకుతుంది కనక ఆలోచనలు చేయవచ్చని భావించింది.

అయితే, ప్రతిపక్షాలకు భయపడి పారిపోయిన అధికార పక్షంగా మాత్రం కేసీఆర్ సర్కారు నిలబడిపోతుందని ప్రతిపక్షాలు, నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.