Begin typing your search above and press return to search.

ఎన్నికలకు వెళ్లిపోదాం..గ్రేటర్ ఎన్నికలకు సర్కారు సిద్ధం

By:  Tupaki Desk   |   1 Nov 2020 4:00 AM GMT
ఎన్నికలకు వెళ్లిపోదాం..గ్రేటర్ ఎన్నికలకు సర్కారు సిద్ధం
X
అనిశ్చితి తీరిపోయింది. స్పష్టత వచ్చేసింది. గ్రేటర్ ఎన్నికల విషయంలో కేసీఆర్ సర్కారు క్లారిటీ ఇచ్చేసింది. రాష్ట్ర ఎన్నికల సంఘానికి తాజాగా గ్రేటర్ ఎన్నికలపై తన నిర్ణయాన్ని చెప్పేసింది. ఎన్నికల నిర్వహణకు ఎలాంటి అభ్యంతరాలు లేవని చెప్పేసింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈసారికి పాత డివిజన్లు.. పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు నిర్వహించటానికి తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని చెప్పేసింది. దీంతో.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు తెర తీసినట్లేనని చెప్పాలి.

ముందుగా అనుకున్న సమయానికి ఎన్నికలు జరుగుతాయా? లేదా? అన్న సందేహం మొన్నటి భారీ వర్షాలు.. వరదలతో చోటు చేసుకుంది. అయితే.. ప్రభుత్వం తీసుకున్న చర్యల నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకే ప్రభుత్వం మొగ్గు చూపింది. దీంతో పరిణామాలు వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి.జీహెచ్ఎంసీ చట్ట సవరణ ప్రకారం గత ఎన్నికల్లో అమలు చేసిన రిజర్వేషన్లను మరోసారి అమలు చేయనున్నట్లుగా పురపాలక శాఖ స్పష్టం చేసింది.

దీనికి సంబంధించిన ఉత్తర్వును పురపాలక శాఖ శనివారం వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసింది. గ్రేటర్ లో ప్రస్తుతం ఉన్న పాలక మండలి గడువు ఫిబ్రవరి 10న ముగియనుంది. ఈ లెక్కన చూస్తే.. నోటిఫికేషన్ జారీ.. మిగిలిన అంశాలు డిసెంబరు మధ్యలో కానీ చివర్లో కానీ మొదలు కావొచ్చని చెబుతున్నారు. అయితే.. జనవరి మొదటి వారంలో లేదంటే.. సంక్రాంతి తర్వాత జరిగే అవకాశం ఉందంటున్నారు. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ పరంగా పూర్తి కావాల్సిన పనులేమీ లేని నేపథ్యంలో.. ఎన్నికల సంఘం ఎప్పుడు అనుకుంటే అప్పుడు ఎన్నికలు జరిగే వీలుంది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా సెకండ్ వేవ్ మొదలు కావటం.. దాని తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో.. వీలైనంత త్వరగానే ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలన్న యోచనలో రాష్ట్ర సర్కారు ఉన్నట్లు చెబుతున్నారు. ఇక.. నిర్ణయం మొత్తం ఎన్నికల సంఘం చేతుల్లోనే ఉందని చెబుతున్నారు.