Begin typing your search above and press return to search.

తెలంగాణ అసెంబ్లీలో రూల్స్ ఎలా మారాయంటే?

By:  Tupaki Desk   |   29 Feb 2016 4:51 PM GMT
తెలంగాణ అసెంబ్లీలో రూల్స్ ఎలా మారాయంటే?
X
అసెంబ్లీ సమావేశాల్లో విపక్షాల తమ డిమాండ్ల సాధన కోసం పెద్ద ఎత్తున ఆందోళనలు చేయటం కామన్. అధికారపక్షాన్ని ఇబ్బంది పెట్టేలా సభను అడ్డుకోవటం లాంటివి చేస్తుంటారు. ఇక.. రాష్ట్ర విభజనకు ముందు గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవటమే కాదు.. కాగితాల్ని చించేయటం.. మైకులు ఇరగదీయటం లాంటి ఘటనలు చాలానే చేసే వారు. అయితే.. అవన్నీ గతం.ఇప్పుడు కానీ అలాంటివి ఏమైనా చేస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉండనున్నాయి. ఇందుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర సర్కారు తీసుకున్న తాజా నిర్ణయాలు విస్మయాన్ని రేకెత్తించేలా ఉండటం గమనార్హం.

తెలంగాణ అసెంబ్లీ నిర్వహణకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాల్ని తాజాగా తీసుకున్నారు. దీని ప్రకారం.. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుంటే.. సదరు ఎమ్మెల్యేపై ఏడాది పాటు సస్పెన్షన్ వేటు వేయాలని తెలంగాణ అసెంబ్లీ రూల్స్ కమిటీ నిర్ణయించింది. అంతేకాదు.. క్వశ్చన్ అవర్ లో ఆందోళనలకు అనుమతి ఇవ్వకూడదని నిర్ణయించారు.

ఉద్యమ పార్టీగా అసెంబ్లీ సమావేశాల్లో తమ వాదనను వినిపించేందుకు వీలుగా పెద్ద ఎత్తున ఆందోళనలునిర్వహించటంతోపాటు.. వినూత్న నిరసన కార్యక్రమాలు నిర్వహించిన టీఆర్ఎస్.. ఇప్పుడు అధికారపక్షంగా అందుకు పూర్తి భిన్నమైన నిర్ణయాన్ని తీసుకోవటంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యమ పార్టీ అధికారపక్షంగా మారితే రూల్స్ ఇంత కఠినంగా మారతాయా? అన్న ప్రశ్న పలువురి నోటి వెంట రావటం గమనార్హం.