Begin typing your search above and press return to search.

కేసీఆర్ -2 సర్కారుకు రెండేళ్లు పూర్తి

By:  Tupaki Desk   |   13 Dec 2020 5:21 PM GMT
కేసీఆర్ -2  సర్కారుకు రెండేళ్లు పూర్తి
X
కొత్త రాష్ట్రం తెలంగాణ‌లో తొలి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర స‌మితి (టీఆర్ఎస్‌) అధినేత క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావు... వ‌రుస‌గా రెండో ప‌ర్యాయం కూడా సీఎం కుర్చీని అల‌వోక‌గానే అందుకున్నారు. తొలి ఐదేళ్ల పాల‌న‌లో సంచ‌ల‌న ప‌థ‌కాలు ప్రారంబించిన కేసీఆర్ రెండో ద‌ఫా ప్ర‌భుత్వ ఏర్పాటులో న‌ల్లేరుపై న‌డ‌క మాదిరిగానే సాగిపోయారు. కేసీఆర్ చేప‌ట్టిన రెండో ద‌ఫా పాల‌న‌కు ఆదివారంతో రెండేళ్లు పూర్తి అయ్యాయి. అంటే... 2018 చివ‌ర‌లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నిక‌లు జ‌ర‌గ‌గా.. ఆ ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యాన్ని సాధించిన కేసీఆర్‌.. వ‌రుస‌గా రెండో ద‌ఫా కూడా రాష్ట్రంలో త‌న పాల‌న‌ను ప్రారంబించారు. ఈ పాల‌న‌కు ఇప్పుడు రెండేళ్లు పూర్తి కాగా... మునుప‌టిలా అన్నీ సానుకూల ఫ‌లితాలు వ‌స్తున్న దాఖ‌లాలు క్ర‌మంగా త‌గ్గిపోతున్నాయి. ప‌రిష్కారం లేని స‌మ‌స్య‌ల‌తో పాటు విప‌క్షాల నుంచి ఎప్ప‌టిక‌ప్పుడు పెను షాకులే ఎదుర‌వుతున్నాయి. ప్ర‌త్యేకించి బీజేపీ రూపంలో దూసుకువ‌స్తున్న ముప్పు ఎలా ఉంటుందో ఈ రెండేళ్ల కాలంలోనే కేసీఆర్ ప్ర‌త్య‌క్షంగానే తెలుసుకున్నార‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి.

తెలంగాణ అసెంబ్లీకి ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లిన కేసీఆర్‌.. స‌రిగ్గా ఎన్నిక‌ల‌కు ఆరు నెల‌ల స‌మ‌యం ఉంద‌న‌గా... రైతు బంధు ప‌థ‌కాన్ని ప్రారంభించారు. ఈ ప‌థ‌కం కేసీఆర్ తో పాటు మొత్తంగా టీఆర్ఎస్ గ్రాఫ్ ను ఓ రేంజికి తీసుకెళ్లింద‌ని చెప్పాలి. ఈ ప‌థ‌కంతో పాటు తెలంగాణ‌కు కీల‌క ప్రాజెక్టుగా ప‌రిగ‌ణిస్తున్న కాళేశ్వ‌రం ప్రాజెక్టు నిర్మాణం శ‌ర‌వేగంగా సాగుతున్న తీరు కూడా కేసీఆర్ కు క‌లిసి వ‌చ్చింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఈ త‌ర‌హా ప‌రిణామాల‌తో రెండో సారి ఎన్నిక‌ల్లో కేసీఆర్ ఆధ్వ‌ర్యంలోని టీఆర్ఎస్ సునాయ‌సంగానే విజ‌యం సాధించింది. అయితే రెండో ద‌ఫా ఎన్నిక‌ల‌కు ముందు విప‌క్షాలుగా ఉన్న కాంగ్రెస్ తో పాటు టీడీపీని బ‌లంగా దెబ్బ కొట్టిన కేసీఆర్.. రాష్ట్రంలో విప‌క్షం అన్న మాటే లేకుండా చూసుకోగ‌లిగారు. అప్ప‌టికి బీజేపీ అంత‌గా బ‌లోపేతం కాక‌పోయిన వైనం కూడా కేసీఆర్ కు క‌లిసివ‌చ్చింద‌నే చెప్పాలి. మొత్తంగా త‌న‌కు ప్ర‌త్యామ్నాయం అన్న మాట క‌నిపించ‌కుండా చేయ‌గ‌లిగిన కేసీఆర్... రాష్ట్రంలో రెండో సారి త‌న పాల‌న‌కు మార్గం సుగ‌మం చేసుకున్నారు.

స‌రే... రాష్ట్రంలో వ‌రుస‌గా రెండో ప్ర‌భుత్వాన్ని కూడా ఏర్పాటు చేసిన కేసీఆర్ కు గ‌డ‌చిన రెండేళ్లుగా షాకుల మీద షాకులు త‌గులుతున్నాయి. టీఆర్ఎస్ కు ప్ర‌త్య‌ర్థులుగా ఉన్న టీడీపీ తెలంగాణ‌లో పూర్తిగా క‌నుమ‌రుగు కాగా... ఏదో అలా ఉన్నామంటే ఉన్నామ‌న్న‌ట్లుగా సాగుతున్న కాంగ్రెస్ ను కేసీఆర్ మ‌రింత బ‌ల‌హీనం చేసి పారేశారు. ఇలాంటి త‌రుణంలో 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఊహించని రీతిలో బీజేపీ పుంజుకోవ‌డం, తెలంగాణ‌లో ఏకంగా 4 పార్ల‌మెంటు స్థానాల‌ను గెలుచుకున్న తీరును కేసీఆర్ పెద్ద ప్ర‌మాదంగా గుర్తించ‌లేక‌పోయారు. ఇదే అద‌నుగా అప్ప‌టిదాకా తెలంగాణ చీఫ్ గా కొనసాగుతున్న ల‌క్ష్మ‌ణ్ ను త‌ప్పించిన బీజేపీ... ఆ స్థానంలో దూకుడుగా సాగుతార‌ని భావించిన బండి సంజ‌య్ కు ప‌గ్గాలు అప్ప‌గించింది. బీజేపీ అధిష్ఠానం ఆశించిన‌ట్టుగానే బండి సంజ‌య్ త‌న‌దైన దూకుడును ప్ర‌ద‌ర్శిస్తున్నారు. దుబ్బాక ఉప ఎన్నిక‌ల్లో కేసీఆర్‌ ను చావుదెబ్బ కొట్టిన బండి సంజ‌య్.. బీజేపీ అభ్య‌ర్థి ర‌ఘునంద‌న్ రావును గెలిపించుకున్నారు. ఈ షాక్ నుంచి తేరుకునేలోగానే జీహెచ్ ఎంసీ ఎన్నిక‌ల్లోనూ టీఆర్ఎస్ కు మ‌రో షాకిచ్చిన బీజేపీ... ఏకంగా 48 డివిజ‌న్ల‌ను గెలుచుకుని స‌త్తా చాటింది.

తెలంగాణలో బీజేపీ ఎదుగుతున్న తీరు చూస్తుంటే... మ‌రో మూడేళ్ల త‌ర్వాత జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు టీఆర్ఎస్ విజ‌యం న‌ల్లేరు మీద న‌డ‌క ఎంతమాత్రం కాబోదని చెప్ప‌క త‌ప్ప‌దు. అదే స‌మ‌యంలో త‌న పాత ప‌థ‌కాల‌ను కొన‌సాగిస్తూనే ధ‌ర‌ణి త‌ర‌హా కొత్త ప‌థ‌కాల‌ను ప్రారంభించిన కేసీఆర్ వాటి అమ‌లులో మాత్రం మునుప‌టి దూకుడును చూప‌లేక‌పోతున్నారు. అదే స‌మ‌యంలో పార్టీలో కొన‌సాగుతున్న అంత‌ర్గ‌త ఘ‌ర్ష‌ణ‌లు కూడా కేసీఆర్ కు కునుకు ప‌ట్ట‌నీయ‌డం లేద‌న్న వాద‌న‌లు అంత‌కంత‌కూ పెరిగిపోతున్నాయి. మేన‌ల్లుడు త‌న్నీరు హ‌రీశ్ రావును దూరం పెట్టేసిన కేసీఆర్ తీరుపైనా పార్టీలో, బ‌య‌టా పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు రేకెత్తుతున్నాయి. గెలిస్తే త‌న కుమారుడి స‌త్తా... ఓడిపోతే హ‌రీశ్ చేత‌గాని త‌నం, పార్టీ కేడ‌ర్ అస‌మ‌ర్థ‌త అన్న రీతిలో సాగ‌తున్న కేసీఆర్ తీరుపై పెద్ద చ‌ర్చే న‌డుస్తోంది. మొత్తంగా పార్టీ అధికారంలోకి వ‌చ్చిన ఏడేళ్ల‌కే పార్టీపై కేసీఆర్ కు ప‌ట్టు స‌డ‌లుతోంద‌న్న వాద‌న‌లు మొద‌ల‌య్యాయి. తెలంగాణ అసెంబ్లీకి మూడో సారి ఎన్నిక‌ల‌కు ఇంకా మూడేళ్లు స‌మ‌యం ఉన్నా... బీజేపీ దూకుడును చూస్తుంటే... ఆ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ గెల‌వ‌డం క‌ష్ట‌మేన‌న్న మాట గ‌ట్టిగానే వినిపిస్తోంది.