Begin typing your search above and press return to search.

హైకోర్టు సాక్షిగా గవర్నర్ విషయంలో కేసీఆర్ సర్కారు తీరు బయటకొచ్చింది

By:  Tupaki Desk   |   31 Jan 2023 9:49 AM GMT
హైకోర్టు సాక్షిగా గవర్నర్ విషయంలో కేసీఆర్ సర్కారు తీరు బయటకొచ్చింది
X
సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఒక వెలుగు వెలిగిన వేళలో తీసిన సినిమాల్లో సత్య ఒకటి. అందులో ఒక డైలాగ్ ఉంటుంది. మన దందాలో మొదలు పెట్టకూడదు. ఒకసారి మొదలు పెడితే.. అది అందరిని చుట్టేస్తుంది. అందుకే ఆపేయ్ అన్నట్లుగా సాగే ఈ డైలాగ్ అప్పట్లో అందరిని విపరీతంగా ఆకర్షించింది. రాజకీయాల్లోనే కాదు.. మరే వ్యవహారంలో అయినా సరే.. తేడా చేయటం మొదలు పెడితే మొదట్లో బాగానే ఉన్నట్లుగా అనిపించినా.. తర్వాతి కాలంలో అది మొదలు పెట్టిన వారికే చుట్టుకునే పరిస్థితి. ఈ విషయాన్ని అన్ని సంగతులు తెలిసిన కేసీఆర్ లాంటి మేధావి ఎందుకు మిస్ అవుతారు? అన్నది ప్రశ్న.

వ్యక్తులతో పెట్టుకున్నా ఫర్లేదు కానీ.. వ్యవస్థలతో పెట్టుకోకూడదన్న చిన్ని పాయింట్ ను మిస్ అయిన కేసీఆర్.. అందుకు తగ్గ మూల్యాన్ని అనుభవించాల్సిన పరిస్థితి తాజాగా ఎదురైంది. ఉద్యమ కాలంలో వ్యవస్థలను తన తెలివితో ఒక ఆట ఆడుకున్న ఆయనకు అప్పట్లో ఎలాంటి పవర్ లేదు. ఈ రోజున ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ.. తన సత్తా చాటలేకపోయారంటే కారణం.. తన మీదా..తన తెలివి మీదా మితిమీరిన విశ్వాసమే కారణమన్న మాట వినిపిస్తోంది.

గడిచిన కొద్ది కాలంగా గవర్నర్ తో లడాయి పెట్టుకున్న కేసీఆర్.. తనకు తిరుగులేదన్నట్లుగా వ్యవహరిస్తూ.. ఆ క్రమంలో మరింత దూకుడు పెంచి అడ్డంగా బుక్ అయ్యారంటున్నారు. రాష్ట్ర బడ్జెట్ ను గవర్నర్ ఆమోదించటం లేదంటూ హైకోర్టుకు ఎక్కిన కేసీఆర్ సర్కారు.. వాదనల వేళ.. గొంతులో పచ్చి వెలక్కాయ పడిన పరిస్థితి. కారణం.. ఈ ఉదంతానికి సంబంధించి గవర్నర్ ఆఫీసు నుంచి కోర్టుకు హాజరైన సీనియర్ న్యాయవాది అశోక్ ఆనంద్ కుమార్ తన వాదనతో ఉక్కిరిబిక్కిరి చేశారు.

ఇప్పటివరకు గవర్నర్ వ్యవస్థ విషయంలో కేసీఆర్ సర్కారు వ్యవహరించిన తీరును తన వాదనతో కడిగేసినంత పని చేశారు. పనిలో పనిగా తనకు సాయంగా ఉండేందుకు చట్టంలోని అంశాల్ని.. రాజ్యాంగం కల్పించిన వసతుల గురించి ప్రస్తావించి.. డిఫెన్సులో పడేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 176 ప్రకారం ప్రతి ఏడాది తొలి అసెంబ్లీ సెషన్ లో గవర్నర్ ప్రసంగం తప్పనిసరి అని గుర్తు చేస్తూ.. ప్రభుత్వం ఆ విధిని పూర్తి చేస్తే బడ్జెట్ కు ఆమోదం తెలపటానికి గవర్నర్ కు అభ్యంతరం లేదన్న విషయాన్ని ప్రస్తావించారు.

గత ఏడాది ప్రజా సంక్షేమం దృష్ట్యా గవర్నర్ ప్రసంగం లేకున్నా బడ్జెట్ కు ఆమోదం తెలిపామన్న ఆయన... గణతంత్ర దినోత్సవానికి సీఎంను.. మంత్రులను ఆహ్వానించినా రాలేదన్న విషయాన్ని గుర్తు చేశారు. రిపబ్లిక్ డే వేళ నిర్వహించే ఎట్ హోం ప్రోగ్రాంలో గవర్నర్ బిజీగా ఉంటే.. గవర్నర్ హోదాకు తగని విధంగా ఒక ఐఏఎస్ అధికారి బడ్జెట్ గురించి చర్చించే ప్రయత్నం చేశారంటూ అసలు విషయాన్ని బయటపెట్టారు.

రాజ్యాంగ బద్ధంగా ప్రభుత్వం వ్యవహరిస్తే తాము అన్ని విధాలుగా సహకరిస్తామన్న ఆయన వాదన విన్న వేళలోనే.. కేసీఆర్ సర్కారు దిగి రాక తప్పదన్న సంకేతాలు వెలువడ్డాయి. తమ ముందున్న సున్నిత అంశాన్ని గుర్తించిన హైకోర్టు ధర్మాసనం.. గవర్నర్ కార్యాలయం తరఫు వాదనల్నినోట్ చేసుకున్న తర్వాత.. రెండు పక్షాలకు చెందిన న్యాయవాదల మధ్య చర్చల్ని ఫలవంతంగా పూర్తి చేసి.. రాజీ మార్గానికివచ్చారు.

దీంతో.. హైకోర్టు సైతం.. రెండు వ్యవస్థలకున్న గౌరవాన్ని గుర్తించి.. ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ మీద ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా.. విచారణను ముగిస్తున్నట్లుగా పేర్కొన్నారు. మొత్తంగా చెప్పాలంటే.. పరువు పోకుండా హైకోర్టు కాస్తంత సంమయనంతో వ్యవహరించిందని చెప్పాలి. ఈ ఎపిసోడ్ ను ఫాలో అయిన వారంతా గవర్నర్ విషయంలో కేసీఆర్ సర్కారు ఇంతకాలం ఇంతలా ఇబ్బంది పెట్టిందా? అన్న భావన కలిగేలా చేశారంటున్నారు. అందుకే అంటారు.. అవసరం లేని విషయాల్ని అనవసరంగా కెలికితే వచ్చే ఇబ్బందులు ఇలానే ఉంటాయి మరి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.