Begin typing your search above and press return to search.

కేసీఆర్ కు కోపం వచ్చేసిందట.. ఏపీ తీరు పై కేంద్రాన్ని కడిగేస్తారా?

By:  Tupaki Desk   |   1 Oct 2020 5:45 AM GMT
కేసీఆర్ కు కోపం వచ్చేసిందట.. ఏపీ తీరు పై కేంద్రాన్ని కడిగేస్తారా?
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు కోపమొచ్చింది. తాను సమన్వయంతో.. సంయమనంతో వ్యవహరిస్తుంటే..ఏపీ సర్కారు కయ్యానికి కాలుదువ్వుతున్నట్లుగా ఆయన భావిస్తున్నారట. రెండు తెలుగు రాష్ట్రాల మధ్యనున్న జలవివాదాల విషయంలో ఏపీ ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తుందని.. కావాలనే కయ్యం పెట్టుకుంటుందన్న భావనలో ఆయన ఉన్నట్లు చెబుుతున్నారు. దీనికి కేంద్రం తీరు కూడా సరిగా లేదన్నది ఆయన కంప్లైంట్.

ఈ నేపథ్యంలో త్వరలో జరిగే అపెక్స్ సమావేశంలో ఏపీ వాదనలకు ధీటైన సమాధానం చెప్పాలని.. మరోసారి తెలంగాణ జోలికి రాకుండా వాస్తవాల్ని కుండబద్ధలు కొట్టినట్లు స్పష్టం చేయాలన్న లక్ష్యాన్ని అధికారులకు ఇచ్చినట్లుగా చెబుతున్నారు. ఏదైనా విషయంలో తన స్టాండ్ ను అందరిని కన్వీన్స్ చేసేలా ఉండే కేసీఆర్.. అదే తరహాలో తెలంగాణ వాదన కూడా ఉండాలని అధికారుల్ని ఆదేశించినట్లుగా తెలుస్తోంది. నీటి కేటాయింపుల విషయంలో ప్రధానమంత్రి మోడీకి ఏడేళ్ల క్రితం లేఖ రాసినా ఇప్పటికి దిక్కు లేదని వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తోంది.

2014 జూన్ రెండున తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే.. పన్నెండు రోజుల వ్యవధిలో అంటే.. జూన్ 14న ప్రధానమంత్రికి తాను లేఖ రాశానని..రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి కేటాయింపులు జరపాలని కోరిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అంతర్ రాష్ట్ర జల వివాద చట్టం 1956లోని సెక్షన్ మూడు ప్రకారం ప్రత్యేక ట్రైబ్యునల్ ఏర్పాటు చేసైనా.. లేదంటే ఉన్న ట్రైబ్యులన్ ద్వారా అయినా కేటాయింపులు జరపాలని తాను చెప్పినట్లు చెబుతున్నారు. ఏడేళ్లు గడుస్తున్నా ప్రధానికి తాను స్వయంగా రాసిన లేఖకు స్పందన లేకపోవటం ఏమిటన్న ఆగ్రహంతో ఆయన ఉన్నట్లు చెబుతున్నారు. ఉలుకు పలుకు లేకుండా ఉన్న కేంద్రం తీరుపై ఆయన కోపంతో ఉన్నట్లుగా తెలుస్తోంది.

తెలంగాణ ప్రజల హక్కుల్ని హరించటానికి జరుగుతున్న ప్రయత్నాల్ని ప్రతిఘటించాలని.. నిజాల్ని యావత్ దేశాలకు తెలియజేయాలని చెప్పారట. అపెక్స్ సమావేశాల ద్వారా ఏదో చేస్తున్నట్లు అనిపిస్తున్నారని.. కానీ కేంద్రం మాత్రం ఏమీ చేయటం లేదన్నారు. తెలంగాణకు నీటి కేటాయింపు విషయంలో స్పష్టత ఇవ్వాలని పట్టుబట్టాలని ఆయన అధికారులకు స్పష్టం చేశారు. అపెక్స్ సమావేశానికి భారీ టార్గెట్ ఇచ్చిన కేసీఆర్ కారణంగా అధికారులకు కొత్త టెన్షన్ పట్టుకుందన్న మాట వినిపిస్తోంది.