Begin typing your search above and press return to search.

ఢిల్లీకి వెళుతున్న కేసీఆర్.. మోడీని మాత్రం కలవరట

By:  Tupaki Desk   |   8 Nov 2020 9:50 AM GMT
ఢిల్లీకి వెళుతున్న కేసీఆర్.. మోడీని మాత్రం కలవరట
X
గురువు చంద్రబాబుకు ఏ మాత్రం సంబంధం లేని రీతిలో వ్యవహరించే తీరు ఒకప్పటి శిష్యుడు కేసీఆర్ దని చెప్పాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే బాబును తన గురువుగా చెప్పినా ఊరుకోరన్న మాట వినిపిస్తుంటుంది. ఆ మాటకు వస్తే.. కేసీఆర్ మాత్రమే కాదు.. బాబుకు ఒకప్పుడు శిష్యులుగా ఉన్న ఏ నేత కూడా తమపై బాబు ముద్ర వేయించుకోవటానికి ఏ మాత్రం ఇష్టపడరు. ఇంతకీ బాబు ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే.. ముఖ్యమంత్రిగా వ్యవహరించే సమయంలో.. తరచూ ఢిల్లీకి వెళ్లటం కనిపిస్తుంది.

దేశంలో మరే రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్లని రీతిలో బాబు తరచూ ఢిల్లీకి వెళుతుంటారు. ఆయనకు పూర్తి భిన్నం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు. ఎంతో అవసరమైతే తప్పించి దేశ రాజధాని వైపు చూడరన్న మాట వినిపిస్తూ ఉంటుంది. ఆరేళ్లకు పైనే ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న కేసీఆర్.. మొత్తం ఢిల్లీ పర్యటల్ని వేళ్ల మీద లెక్క పెట్టొచ్చని చెబుతారు. మధ్యలో కంటి ఆపరేషన్ కోసం వెళ్లిన నాలుగైదు సందర్భాల్ని పక్కన పెడితే.. అధికారిక పనుల కోసం దేశ రాజధాని వంక చూడటానికి ఆయన పెద్దగా ఇష్టపడరు.

అలాంటి కేసీఆర్.. తాజాగా ఢిల్లీకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నాయి. అలా అని.. తన పర్యటనలో కేంద్ర మంత్రుల్ని కానీ.. ప్రధాని మోడీని కానీ కలిసే అవకాశం ఉండదంటున్నారు. ఇంతకీ ఆయన ఢిల్లీ టూర్ ఎందుకంటారా? ఈ మధ్యనే కేంద్రం టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ భవన నిర్మాణం కోసం 1100 చదరపు మీటర్ల స్థలాన్ని కేటాయించింది. దీంతో.. అక్కడ పెద్ద ఎత్తున పార్టీ ఆఫీసును నిర్మించనున్నారు.

దీని శంకుస్థాపన కోసం ఆయన ఢిల్లీకి వెళ్లనున్నారు. ఏడాది లోపు భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలన్న పట్టుదలతో ఉన్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం అక్కడ భూమిని చదును చేసే పనులు వడివడిగా సాగుతున్నాయి. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ నెల 10.. 11 తేదీల్లో శంకుస్థాన చేసే వీలుందని.. సాధ్యం కాకపోతే.. కార్తీక మాసంలో మంచి ముహుర్తంలో శంకుస్థాపన పూర్తి చేసే వీలుందని చెబుతున్నారు. ఏమైనా.. అయితే రెండు రోజుల్లో లేదంటే వారం.. పది రోజుల్లో ఢిల్లీకి వెళ్లటం ఖాయమంటున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. పార్టీ కోసం భూమిని కేటాయించిన కేంద్రానికి థ్యాంక్స్ కూడా చెప్పలేదన్న మాట వినిపిస్తోంది.