Begin typing your search above and press return to search.

కేసీఆర్‌ షాపింగ్‌ చేసేది ఎక్కడో తెలుసా?

By:  Tupaki Desk   |   19 Jan 2016 3:42 PM GMT
కేసీఆర్‌ షాపింగ్‌ చేసేది ఎక్కడో తెలుసా?
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కే చంద్ర‌శేఖ‌ర్ రావు వ్య‌క్తిత్వం మిగ‌తా పార్టీ నేత‌ల‌తో పోలిస్తే ఎప్ప‌టికీ భిన్న‌మే. ఉద్య‌మ నాయ‌కుడిగా ఉన్న‌ప్ప‌టి నుంచి తెలంగాణ సీఎంగా ప‌గ్గాలు చేప‌ట్టిన త‌ర్వాత కూడా కేసీఆర్ తన ఆలోచ‌న విధానాల‌నే కాకుండా వ్య‌క్తిత్వాన్ని, వ్య‌వ‌హార‌శైలిని కూడా ఆయ‌న కొనసాగిస్తూనే ఉంటారు. ఇర‌వై ఆరేళ్లుగా కొన‌సాగుతున్న ఆస‌క్తిని ఇంకా అవ‌లంభించ‌డం ద్వారా కేసీఆర్ మ‌రోమారు వార్త‌ల్లో నిలిచారు.

హైద‌రాబాద్ న‌డిబొడ్డున ఉన్న హైద‌ర్‌ గూడా ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ స‌మీపంలో మ‌ధ్యాహ్నం స‌మ‌యంలో పెద్ద ఎత్తున పోలీసులు దిగారు. కార‌ణాలు ఏం చెప్ప‌కుండానే ఆ ప‌రిస‌రాల‌కు దారితీసే రోడ్ల‌న్నింటినీ త‌మ ప‌రిధిలోకి తీసుకున్నారు. ట్రాఫిక్‌ ను నిలిపివేశారు. ఎందుకు అనే కార‌ణం తెలిసేలోగానే త‌న ఎస్కార్ట్‌ తో సహా తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ అక్క‌డ దిగారు. వెంట‌నే అక్క‌డ ఉన్న‌ శ్రీసాయి ఖాదీ వస్త్రాలయంలోకి కేసీఆర్ వెళ్లారు. త‌న‌కు కావాల్సిన దుస్తులు కొనుగోలు చేసి కొల‌త‌లు ఇచ్చి అక్క‌డే స్టిచింగ్‌ కు ఇచ్చారు.

సీఎం వ‌చ్చార‌ని తెలియ‌డంతో అక్క‌డ ఒకింత సంద‌డి నెల‌కొంది. స‌హ‌జంగానే మీడియా అక్క‌డికి వెళ్లింది. ఈ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ పాతికేళ్ల‌కు పైగా ఇక్క‌డే షాపింగ్ చేస్తున్న‌ట్లు చెప్పారు. ముఖ్య‌మంత్రి హోదాలో ఉన్న‌ప్ప‌టికీ తన అభిమాన కేంద్రంలోనే బ‌ట్ట‌లు కొన‌డంపై షాప్ ఓన‌ర్ ఫుల్ ఖుష్ అయ్యారు. దాదాపు 26 ఏళ్లుగా ఇక్క‌డే షాపింగ్ చేస్తున్న కేసీఆర్ సీఎం అయిన‌ప్ప‌టికీ త‌న షాప్‌ కే రావ‌డం సంతోష‌క‌ర‌మ‌ని చెప్పారు. ముఖ్య‌మంత్రితో పాటు హోంమంత్రి నాయిని న‌ర్సింహారెడ్డితో పాటు చాలా మంది ఎమ్మెల్యేలు త‌న దుకాణంలో బ‌ట్ట‌లు కొనుగోలు చేస్తుంటార‌ని ఫుల్ ఖుష్‌ తో వివ‌రించారు.