Begin typing your search above and press return to search.

భూతద్దాలు ఇచ్చి మరీ వారి కోసం వెతికిస్తున్న కేసీఆర్

By:  Tupaki Desk   |   13 Nov 2020 4:00 AM GMT
భూతద్దాలు ఇచ్చి మరీ వారి కోసం వెతికిస్తున్న కేసీఆర్
X
గులాబీ బాస్ కేసీఆర్ గురించి చాలామంది చాలా మాట్లాడుకుంటారు. ఆయనకు అహంభావం ఎక్కువని.. ఆయనకు మించిన ప్రాంతీయవాది మరొకరు ఉండరని.. ఇలా చాలానే ప్రచారాలు చేస్తుంటారు.దీనికి కారణం.. ఆయన్ను తరచూ కలిసే వారిలో చాలామంది ఆయన్ను అంచనా వేయటంలో విఫలం కావటం. సరిగా అర్థం చేసుకోలేకపోవటం. లోతుగా చూస్తే..ఆయన మాట్లాడే ప్రతి సందర్భంలోని ప్రతి మాటను చూసినప్పుడు ఆయన ఒక సాగరంలా కనిపిస్తారు.

ఇక్కడ ఎందుకీ పోలిక అంటే కారణం లేకపోలేదు. సముద్రం ఇప్పుడు ప్రశాంతంగా ఉంటుందో.. ఇప్పుడు విరుచుకుపడుతుందో.. దాన్ని దగ్గరగా పరిశీలించే వారు మాత్రమే చెప్పగలుగుతారు. కొన్ని విషయాల్లో కేసీఆర్ సీరియస్ అవుతారన్న మాట పలువురి నోట వినిపిస్తూ ఉంటుంది. అలాంటి వేళలో.. వారి విషయంలో విచిత్రంగా ప్రవర్తిస్తారని చెబుతారు.

ప్రత్యర్థి అయినప్పటికీ వారిలో మేధస్సును ఆయన ప్రేమించే గుణం ఆయనకు సొంతమంటారు. ఎవరైనా తనతో విభేదించటాన్ని ఒప్పుకోని ఆయన.. విధానపరమైన అంశాల విషయంలో ఆయన వాదనకు భిన్నమైన వాదనను సమర్థంగా వినిపించినప్పుడు మౌనంగా వినటమే కాదు.. అలాంటి వారిని తనకు మరింత దగ్గరగా ఉంటారని చెబుతారు. తాజాగా వెలువడిన దుబ్బాక ఎన్నికల ఫలితం వచ్చినంతనే ఆయన తీవ్రమైన ఆగ్రహానికి గురైనప్పటికి.. ఆ వెంటనే మామూలు స్థితికి వచ్చారని చెబుతారు.

ఫలితం తేడా కొట్టానికి కారణం ఏమై ఉంటుందన్న విషయంపై క్రాస్ చెక్ చేసిన ఆయన.. ఇప్పుడో అంశంపై తన ప్రయత్నాల్ని షురూ చేసినట్లు సమాచారం. దుబ్బాక ఉప ఎన్నికల్లో మజిల్ పవర్ కంటే కూడా మైండ్ గేమ్ తోనే తమను దెబ్బ తీసినట్లుగా భావిస్తున్నారని చెబుతున్నారు. సోషల్ మీడియా ప్రచారంలో తమను తేలిపోయేలా చేసిన బీజేపీ సోషల్ మీడియా విభాగానికి కీలకంగా వ్యవహరించిన వారెవరు? అన్న ప్రశ్నకు సమాధానం వెతుకుతున్నట్లు చెబుతున్నారు.

ఇప్పటికే నిఘా విభాగం ఈ పనిలో తలమునకలు కావటం.. వారి కంటే కూడా.. తనకున్న ఇతర మార్గాల్లో వారి వివరాలు సేకరించే ప్రయత్నంలో పడినట్లు తెలుస్తోంది. దుబ్బాక ఉప ఎన్నికల వేళ బీజేపీ సోషల్ మీడియాను హ్యాండిల్ చేసిన వారి తీరు పెద్ద సారు మనసును దోచుకున్నట్లుగా తెలుస్తోంది. వారెవరు కనుక్కోవాల్సిందిగా ఆదేశించటంతో ఆయన సన్నిహితులు ఇప్పుడు భూతద్దాలు వేసుకొని మరీ వారెవరు.. వారేం చేస్తుంటారు? లాంటి వివరాల్ని సేకరించేందుకు విపరీతంగా ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది.