Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ ను సారు మామూలుగా ప్రేమించ‌ట్లేదుగా?

By:  Tupaki Desk   |   12 Jun 2019 12:14 PM GMT
జ‌గ‌న్ ను సారు మామూలుగా ప్రేమించ‌ట్లేదుగా?
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఎలా వ్య‌వ‌హ‌రిస్తారో అంద‌రికి తెలిసిన వ్య‌వ‌హార‌మే. అప్ప‌టికి బాగా అర్థ‌మైన‌ట్లే అర్థ‌మై.. అంత‌లోనే చిక్కుముడి మాదిరి మారిపోతుంటారు. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ పేరుతో భారీ ప్లాన్ వేసిన ఆయ‌న‌.. జ‌గ‌న్ ను త‌న జ‌ట్టులో పెట్టుకొన్న‌ప్ప‌టికీ.. బీజేపీతో ఆయ‌న అనుకున్న లెక్క‌లు తేడా వ‌చ్చేస‌రికి తెగ ఇబ్బంది ప‌డిపోతున్నారు గులాబీ బాస్‌.

గాలి త‌న‌కు వాటంగా వీస్తుంద‌ని భావించిన‌ప్ప‌టికీ.. అందుకు భిన్నంగా తిరుగులేని మెజార్టీని మోడీ సొంతం చేసుకొన్న నేప‌థ్యంలో.. ఇప్పుడాయ‌న‌కు ఎవ‌రి అవ‌స‌రం లేని ప‌రిస్థితి. మోడీకి మెజార్టీ రాదు.. కేంద్రంలో తాను ఆడింది ఆట‌.. పాడింది పాట అనుకున్న దానికి భిన్నమైన ప‌రిస్థితితో కేసీఆర్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కొంత‌లో కొంత సానుకూలాంశం ఏమంటే.. తాను అండ‌గా నిలిచిన జ‌గ‌నే ఇప్పుడాయ‌న‌కు దిక్కు అయ్యారు.

జ‌గ‌న్ ను తాను కంట్రోల్ చేయొచ్చ‌న్న ఆశ ప‌డిన కేసీఆర్ కు.. ఇప్పుడు జ‌గ‌న్ సాయం చేయ‌క‌పోతే త‌న ప‌రిస్థితి ఇబ్బందిక‌రంగా మారుతున్న ప‌రిస్థితి. కేంద్రంతో జ‌గ‌న్ కున్న సంబంధాల నేప‌థ్యంలో ప్ర‌ధాని మోడీకి త‌న మీద ఉన్న ఆగ్రహాన్ని త‌గ్గించుకునేందుకు జ‌గ‌న్ కు మించిన దారి కేసీఆర్ కు క‌నిపించ‌ట్లేదంటున్నారు. దీనికి తోడు ఏపీలో జ‌గ‌న్ కు వ‌చ్చిన ల్యాండ్ స్కేప్ విక్ట‌రీతో.. ఆంధ్ర ప్రాంత ప్ర‌జ‌ల్లో యువ‌నేత మీద ఉన్న అభిమానం.. న‌మ్మ‌కం ఎంత‌న్న విష‌యం అర్థ‌మైన ప‌రిస్థితి.

ఇలాంటి ప‌రిస్థితుల్లో జ‌గ‌న్ తో మ‌రింత ద‌గ్గ‌ర అవ్వ‌టానికి అవ‌కాశం ఉన్న ఏ చిన్న విష‌యాన్ని కేసీఆర్ వ‌దిలిపెట్ట‌టం లేదు. తాజాగా గులాబీ బాస్ తీసుకున్న నిర్ణ‌యం అవాక్కు అయ్యేలా చేస్తోంది. త్వ‌ర‌లో ప్రారంభించే కాళేశ్వ‌రం ప్రాజెక్టు ప్రారంభాన్ని జూన్ 21న నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించిన కేసీఆర్‌.. ఆ కార్య‌క్ర‌మానికి ఏపీ సీఎం జ‌గ‌న్ ను ముఖ్య అతిధిగా పిల‌వాల‌ని డిసైడ్ అయిన‌ట్లు చెబుతున్నారు.

ఈ ఆహ్వానాన్ని అందించ‌టం కోసం జ‌గ‌న్ కోసం అమ‌రావ‌తికి ప్ర‌త్యేకంగా వెళ్ల‌నున్నారు కేసీఆర్‌. విచిత్ర‌మైన విష‌యం ఏమంటే.. కాళేశ్వ‌రం ప్రాజెక్టుకు జ‌గ‌న్ కు ఏ మాత్రం సంబంధం లేనిది. ఆ మాట‌కు వ‌స్తే.. కాళేశ్వ‌రం ప్రాజెక్టు కార‌ణంగా ఇబ్బంది ప‌డే వారిలో ఏపీ ఒక‌టి. అలాంటి ప్రాజెక్టు ప్రారంభానికి జ‌గ‌న్ ను అతిధిగా పిలిచేందుకు కేసీఆర్ ప్లాన్ చేయ‌టం ఆస‌క్తిక‌రంగా మారింద‌ని చెప్పాలి. మ‌రి.. దీనికి జ‌గ‌న్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. చూస్తుంటే జ‌గ‌న్ ను సారు ప్రేమ మామూలుగా లేదుగా!