Begin typing your search above and press return to search.

అస‌లు విష‌యం చెప్ప‌కుండా కొస‌రు మాట‌లే!

By:  Tupaki Desk   |   26 Aug 2018 7:30 AM GMT
అస‌లు విష‌యం చెప్ప‌కుండా కొస‌రు మాట‌లే!
X
ప్ర‌ధాని మోడీతో తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ భేటీ ముగిసింది. అనుకున్న‌ట్లే పాజిటివ్ గా స‌మావేశం పూర్తి అయ్యింది. ప్ర‌ధాని మోడీని ఎందుకు క‌లిసిన‌ట్లు భ‌య్‌? అంటూ టీఆర్ఎస్ నేత‌ల్ని క‌లిస్తే.. వారు సూటిగా చెప్ప‌టానికి అస్స‌లు ఇష్ట‌ప‌డ‌టం లేదు. పెండింగ్ ప్రాజెక్టులు.. జోన‌ల్ వ్య‌వ‌స్థ ఫైలుపై సంత‌కం పెట్టించుకోవ‌టానికే ప్ర‌ధాని మోడీని క‌లిసిన‌ట్లుగా భారీ ఎత్తున ప్ర‌చారం చేసుకుంటున్నారు.

మోడీ భేటీ వెనుక ముంద‌స్తు అంశ‌మే ప్ర‌ధాన‌మైనా.. మాట వ‌ర‌స‌కు కూడా ఆ విష‌యాన్ని కేసీఆర్ అండ్ కో ఎందుకు పెదవి విప్ప‌టం లేదంటే దానికి కార‌ణం లేక‌పోలేదు. ఇప్పుడు కానీ ముంద‌స్తు అంశం మీద చ‌ర్చించ‌టానికి మోడీతో భేటీ అంటే.. కేసీఆర్ అడ్డంగా బుక్ అయిన‌ట్లే. మోడీ అంటే ఇష్ట‌ప‌డ‌ని మైనార్టీలు టీఆర్ఎస్ కు దూరం కావ‌టం ఖాయం. అదే జ‌రిగితే తెలంగాణ‌లోని చాలా అసెంబ్లీ స్థానాల్లో కొత్త త‌ల‌నొప్పులు ఎదుర‌వుతాయి.

అందుకే.. ముంద‌స్తు అంశంపై మ‌రింత క్లారిటీ.. భ‌రోసా కోస‌మే ప్ర‌ధానితో భేటీ అన్న ప్ర‌చారం జ‌ర‌గ‌కుండా ఉండేలా.. జోన‌ల్ వ్య‌వ‌స్థ ఫైల్ ను ఫైన‌ల్ చేయించిన‌ట్లుగా చెప్పుకుంటున్నారు. మైనార్టీల‌తో పాటు మ‌రో అంశం కూడా కార‌ణ‌మ‌ని చెబుతున్నారు. తాము కోరుకుంటున్న‌ట్లు ముంద‌స్తుకు సంబంధించి ఎక్క‌డా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసేలా ప్ర‌ధాని అభ‌యం తీసుకున్నార‌న్న మాట‌.. గులాబీ నేత‌ల నోటి నుంచి వ‌స్తే.. మొద‌టికే మోసం జ‌రిగే ప్ర‌మాదం పొంచి ఉంది.

స్వ‌తంత్ర‌ ప్ర‌తిప‌త్తి క‌లిగిన కేంద్ర ఎన్నిక‌ల సంఘంపై ప్ర‌ధాని చేత ప్ర‌భావితం చేయిస్తున్నార‌న్న చెడ్డ‌పేరు కేసీఆర్ మూట‌గ‌ట్టుకోవాల్సి వ‌స్తుంది. అదే జ‌రిగితే.. మ‌రిన్ని తిప్ప‌లు ఖాయం. అందుకే.. అలాంటి ప్ర‌చారాల‌కు తావివ్వ‌కుండా ఉండేందుకే కేసీఆర్ పక్కా ప్లానింగ్ తో వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లు చెప్పాలి. మోడీతో భేటీపై కేసీఆర్ అండ్ కో చెప్పేవ‌న్ని కొస‌రు మాట‌లే త‌ప్పించి అస‌లు మాట‌లు ఎంత‌మాత్రం కాద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.