అద్భుతమైన ఆలోచనలు తన సొంతమని.. మరెవరికీ రానట్లుగా.. అందరికన్నా ముందుంటానని గొప్పలు చెప్పుకోవటం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాటల్లో స్పష్టంగా కనిపిస్తుంటుంది. ఫలానా వాళ్లు తోపులన్న మాట కేసీఆర్ నోట చాలా తక్కువసార్లు మాత్రమే వినిపిస్తుంటుంది. మనకన్నా గొప్పొళ్లు ఎవరుంటారు? అన్నట్లుగా చెప్పే గులాబీ బాస్.. ఫలానా వారిని స్ఫూర్తిగా తీసుకుందామన్న మాట అంత తొందరగా రాదు.
అలాంటి కేసీఆర్ తాజాగా నిర్వహించిన టీఆర్ ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చారిత్రాత్మకంగా భావిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించాలని డిసైడ్ చేసిన నేపథ్యంలో.. ఎవరేం చేయాలన్న విషయంపై క్లారిటీ ఇచ్చేందుకు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన కాళేశ్వరం వేడుకల్ని ఎలా నిర్వహించాలన్న విషయంపై దిశానిర్దేశం చేయటం ఒక ఎత్తు అయితే.. త్వరలో ప్రారంభమయ్యే పార్టీ సభ్యత్వ కార్యక్రమం స్థాయి ఎంతలా ఉండాలన్న విషయాన్ని చెప్పారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు 70 లక్షల సభ్యత్వాలు ఉన్నాయని.. ఆ సంఖ్యను కోటికి పెంచాలన్న కేసీఆర్.. ప్రతి ఇంట్లోనూ టీఆర్ ఎస్ కార్యకర్తలు ఉండాలన్నారు. ఈ సందర్భంగా తమిళనాడు విపక్ష పార్టీ డీఎంకేను ఆదర్శంగా తీసుకోవాలని చెప్పటం విశేషం. గడిచిన ఏడు దశాబ్దాలుగా ఆ పార్టీ బలంగా ఉందని.. 1400 మంది ఆ పార్టీ తరఫున ఎమ్మెల్యేలు అయ్యారని.. డీఎంకే ప్రారంభంలో చేరిన వారు తరతరాలుగా ఆ పార్టీలోనే కొనసాగుతున్నారని.. అలాంటి పార్టీ శ్రేణులు తమకు కావాలన్న విషయాన్ని చెప్పారు.
ఇప్పటివరకూ ఫలానా పార్టీ గొప్పది.. ఆ పార్టీని ఫాలో అవుదాం లాంటి మాటలు కేసీఆర్ నోటి నుంచి వచ్చినట్లు కనిపించవు. అలాంటిది తమిళనాడు విపక్ష పార్టీ ప్రస్తావన తేవటం ఒక ఎత్తు అయితే.. ఆ పార్టీ తీరులో తమ పార్టీ ఉండాలన్న అభిలాష ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తోపులాంటి ఆ పార్టీ రెండు టర్మ్స్ గా విపక్షంలో ఉంది కదా సారూ? గొప్ప క్యాడర్ ఉన్నంత మాత్రాన పవర్ చేతికి రాదన్న విషయాన్ని డీఎంకే ఫ్రూవ్ చేసినప్పుడు.. ఆ పార్టీని పాలో కావటం శుభసంకేతమేనంటారా?