Begin typing your search above and press return to search.
కేసీఆర్ పుట్టించే భూకంపం కొత్త క్లారిటీ ఇచ్చిందే
By: Tupaki Desk | 28 April 2018 4:55 AM GMTతెలంగాణ ముఖ్యమంత్రి - తెలంగాణ రాష్ట్రసమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పాత ప్రకటననే కొత్తగా చెప్పిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ శివారులోని కొంపల్లిలో తెలంగాణ రాష్ట్రసమితి 17వ ప్లీనరీ సమావేశంలో ప్రారంభ - ముగింపు ఉపన్యాసాలు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, దేశ రాజకీయాల్లో గుణాత్మకమైన మార్పు రావాల్సిన అవసరాన్ని తేల్చిచెప్పారు. ఏడు దశాబ్దాల బీజేపీ - కాంగ్రెస్ ల అసమర్థ పాలన - నిష్క్రియాపరత్వంతో దేశం విసిగిపోయిందని అన్నారు. ఈ రెండు పార్టీల పరిపాలన వల్ల భారతదేశం డెబ్బై ఏళ్ల విలువైన సమయాన్ని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ ప్రజలు ఈ రెండు పార్టీలపై మొహం మొత్తిపోయారని - ఒక ప్రత్యామ్నాయం కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నారని తెలిపారు. దేశ రాజకీయాల్లో నూటికినూరుశాతం క్రియాశీల పాత్రను పోషిస్తామని స్పష్టంచేశారు. కేవలం ఆరేళ్ల నిర్ణీత కాల వ్యవధిలో దేశంలో 40 కోట్ల ఎకరాలకు నీళ్లిచ్చే పథకాన్ని ఫెడరల్ ఫ్రంట్ ప్రకటిస్తుందంటూ పేర్కొని రెండు జాతీయ పార్టీల్లో ప్రకంపనలు సృష్టించారు. తాను తెలంగాణను వదిలిపెట్టి పోనని - హైదరాబాద్ నుంచే జాతీయ రాజకీయాల్లో భూకంపం పుట్టిస్తానని - దేశరాజకీయాలను ప్రభావితం చేస్తానని సీఎం కేసీఆర్ ప్రకటించారు.
కాంగ్రెస్, బీజేపీలు తస్మాత్ జాగ్రత్త అని ఈ హైదరాబాద్ వేదిక నుంచి హెచ్చరిక చేస్తున్న అంటూ పార్టీ ప్లీనరీ వేదికగా కేసీఆర్ శంఖారావం చేశారు. తాను హైదరాబాద్ వదిలిపోయేదిలేదని - ఇక్కడినుంచే భూకంపాన్ని సృష్టిస్తానని ప్రకటించారు. `ఫెడరల్ ఫ్రంట్ అన్నది కేవల ప్రకటన కాదు. అదొక ప్రకంపన. ఏడు దశాబ్దాలుగా బీజేపీ - కాంగ్రెస్ లు చేస్తున్న అసమర్థ పాలన - దద్దమ్మ రాజకీయాల వల్ల ఒరిగిందేమీ లేదు. దేశ సస్యశ్యామలం కావడమే ఫెడరల్ ఫ్రంట్ నినాదం. భారతదేశంలో హర్ ఎకర్ మే పానీ.. హర్ కిసాన్ కో పానీ అనే నినాదంతో ముందుకు పోతం. కాంగ్రెస్ - బీజేపీల బండారం దేశ ప్రజల ముందు బయటపెడతాం` అని ప్రకటించారు. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో కేసీఆర్ చేసిన ప్రకటనలో కొత్తదనం ఏమీలేనప్పటికీ టీఆర్ ఎస్ రాజకీయ భవిష్యత్ గురించి చర్చిస్తున్నవారికి ఫుల్ స్టాప్ పెట్టినట్లుందని అంటున్నారు.
కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ కామెంట్లు చేసిన వెంటనే వచ్చిన వ్యాఖ్య ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళతారని...తన వారసుడిగా ఇప్పటికే నిర్ణయించుకున్న కుమారుడు మంత్రి కేటీఆర్ కు తన పగ్గాలు అప్పగిస్తారని. పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే కేటీఆరే సీఎం అవుతారని కూడా టీఆర్ ఎస్ వర్గాల్లో చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా కేసీఆర్ చేసిన ప్రకటన దీనికి క్లారిటీ ఇచ్చిందంటున్నారు. హైదరాబాద్ వేదికగా తాను భూకంపం సృష్టిస్తానని - రాష్ర్టాన్ని వదిలివెళ్లనని చెప్పడం వెనుక మర్మం వారసత్వానికి ఇప్పుడే పగ్గాలు అప్పగించకపోవడమని విశ్లేషిస్తున్నారు.