Begin typing your search above and press return to search.

కేసీఆర్ కు అల్లం ఇచ్చే ఆదాయమెంత..?

By:  Tupaki Desk   |   25 Nov 2015 7:11 AM GMT
కేసీఆర్ కు అల్లం ఇచ్చే ఆదాయమెంత..?
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కాస్త భిన్నమైన నేత. రాజకీయాల్లో ఉన్న వారు.. అందునా అత్యున్నత పదవులు నిర్వహిస్తున్న వారు విపరీతమైన పని ఒత్తిడిలో ఉంటారు. ఇక.. సీఎం పదవిలో ఉన్న వారి సంగతి అయితే చెప్పాల్సిన అవసరమే ఉండదు. వారికి ప్రతి క్షణం విలువైనదే. అనుక్షణం బిజీగా ఉంటే.. ఊపిరి సలపనంత పని ఒత్తిడిలో ఉంటారు.

అలాంటి వారు సీఎంగా బాధ్యతలు నిర్వర్తించటం.. పార్టీ రాజకీయాల్ని చక్కదిద్దుకునేసరికి తలప్రాణం తోకకు వస్తుంది. అలాంటిది ముఖ్యమంత్రిగా ఉంటూ వ్యవసాయం చేయటం అంత తేలికైన విషయం కాదు. అయితే.. కేసీఆర్ అందుకు పూర్తి భిన్నం. ఆయన ముఖ్యమంత్రిగా ఎంత ప్రభావవంతంగా పని చేస్తుంటారో.. అంతే ప్రభావవంతంగా వ్యవసాయం చేస్తారన్న పేరుంది. వినూత్న విధానాలతో ఆయన చేపట్టే వ్యవసాయం పలువురికి స్ఫూర్తినిస్తుంది.

తాజాగా ఆయన వ్యవసాయ క్షేత్రానికి సంబంధించిన ఆసక్తికర అంశం ఒకటి బయటకు వచ్చింది. తన వ్యవసాయ క్షేత్రంలో ఈసారి అల్లం పంటను వేసిన సంగతి తెలిసిందే. తెలంగాణలో అల్లం పంట వేయటమా? అని ఆశ్చర్యపోయిన వారున్నారు. కేసీఆర్ లాంటి వ్యక్తి అల్లం పంట వేశారంటే దానికి ఎంతోకొంత లెక్క ఉండకుండా ఉండదు. తాజాగా ఆయన వేసిన అల్లం పంట గురించి కేసీఆర్ స్నేహితుడు.. ఫాంహౌస్ వ్యవహారాల నిర్వాహకుడు జహంగీర్ కొన్న లెక్కలు చెప్పుకొచ్చారు. ఆ లెక్కల వ్యవహారం ఆయన మాటల్లోనే చెబితే..

‘‘ఈసారి వ్యవసాయ క్షేత్రంలోని 50 ఎకరాల్లో అల్లం పైరును సాగు చేశాం. అల్లం పైరుకు కావాల్సిన విత్తనాల్ని ఛత్తీస్ గఢ్ లోని రాయ్ పూర్ నుంచి తెప్పించాం. పంట వేసే ముందే.. దుబాయ్ మార్కెట్ లో అమ్మేందుకు అవసరమైన ఒప్పందం చేసుకున్నాం. కిలో రూ.80చొప్పున ధర ఉంది. ఇక.. ఎకరం అల్లం పంటకు విత్తనాలు.. ఎరువులు.. కూలీ ఖర్చులు అన్నీ కలిపితే దాదాపు రూ1.5లక్షలు అవుతుంది. తొమ్మిది నెలలు పంటను జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి పంట కానీ చేతికి వస్తే.. ఎకరాకు రూ.14 నుంచి రూ.18 లక్షల వరకూ ఆదాయం వస్తుంది’’ అని చెప్పుకొచ్చారు.

సరాసరిన ఎకరానికి రూ.15లక్షల ఆదాయం వేసుకుంటే.. మొత్తం 50 ఎకరాల అల్లం పంటకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎంత ఆదాయం వస్తుందో మీరే లెక్కేసుకుంటే బాగుంటుంది. మరి.. లెక్కేయటం మొదలు పెట్టారా..?