Begin typing your search above and press return to search.

మ‌జ్లిస్ కు కేసీఆర్ కానుక‌: 24కోట్ల భూమి 60ల‌క్ష‌ల‌కే!

By:  Tupaki Desk   |   2 Sep 2018 8:09 AM GMT
మ‌జ్లిస్ కు కేసీఆర్ కానుక‌: 24కోట్ల భూమి 60ల‌క్ష‌ల‌కే!
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ లోని వ‌రాల దేవుడు నిద్ర లేచాడు. ముంద‌స్తుకు వెళ్లాల‌ని నిర్ణ‌యం తీసుకున్న ఆయ‌న‌.. అందుకు త‌గ్గ‌ట్లు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్న ఆయ‌న‌.. ఇప్ప‌టికే త‌న ప్లాన్ కు త‌గ్గ‌ట్లే ప్ర‌ధాని మోడీ మ‌న‌సు దోచుకోవ‌టం.. తాను వెళ్లే ముంద‌స్తుకు అవ‌స‌ర‌మైన జోన‌ల్ ఫైల్ మీద సంత‌కం పెట్టించుకోవ‌టంతో పాటు.. హైకోర్టు విభ‌జ‌న విష‌యంలోనూ కేంద్రం వైఖ‌రిని మార్చ‌టంలో స‌క్సెస్ అయ్యారు.

ముంద‌స్తు ఆలోచ‌న‌లో ఉన్న కేసీఆర్.. వివిధ వ‌ర్గాల మ‌నసుల్ని దోచుకునేలా చేతికి ఎముక లేన‌ట్లుగా హామీల మీద హామీలు ఇచ్చేస్తున్నారు. మ‌రికొద్ది గంట‌ల్లో స్టార్ట్ అయ్యే ప్ర‌గ‌తి నివేద‌న స‌భ‌లో వ‌రాల విశ్వ‌రూపం ఉంటుంద‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది. ఇలా.. ప్ర‌యోజ‌నం ఉన్న ఏ ఒక్క‌రిని వ‌దిలిపెట్ట‌కుండా వ‌రాలు ఇచ్చేసే కేసీఆర్‌.. తాజాగా త‌న మిత్రుడు మ‌జ్లిస్ అధినేత అస‌దుద్దీన్ ఓవైసీకి భారీ తోఫాను ఇచ్చార‌ని చెప్పాలి.

త‌న‌కు మిత్ర‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రించే మ‌జ్లిస్ కు బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చేశారు. హైద‌రాబాద్ జిల్లా బండ్ల‌గూడ మండ‌లం మిధాని వ‌ద్ద దాదాపు రూ.24 కోట్లు విలువ చేసే ఆరు వేల గ‌జాల స్థ‌లాన్నినామ‌మాత్ర‌పు ధ‌ర‌కు క‌ట్ట‌బెట్టేందుకు రెఢీ అయిపోయారు. కేసీఆర్ అనుకోవాలే కానీ.. ఫైళ్లు ఏ స్థాయిలో ప‌రుగులు పెడ‌తాయో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు.

అందుకు త‌గ్గ‌ట్లే తాజాగా ఈ భూసంతర్ప‌ణ ఫైలు ఉరుకులు ప‌రుగులు తీసి.. కేసీఆర్ వ‌ద్ద‌కు చేరింది. ఇప్ప‌టికే ఈ భూమిని మ‌జ్లిస్ కు కేటాయిస్తున్న‌ట్లుగా ముఖ్య‌మంత్రి చెప్పేశారు. ప్ర‌గ‌తి నివేద‌న స‌ద‌స్సుకు కొద్ది గంట‌ల ముందు మంత్రివ‌ర్గ స‌మావేశాన్ని నిర్వ‌హించి.. తాయిలాల పెట్టెలో ఏమేం పెట్టాల‌న్న అంశంపై చ‌ర్చించుకొని.. అంద‌రి చేత మ‌మ అనిపించేసి స‌భ‌కు వ‌చ్చేయ‌నున్న‌ట్లుగా చెబుతున్నారు.

మ‌జ్లిస్ కు కేటాయించిన స్థ‌లాన్ని కేబినెట్ స‌మావేశంలో చ‌ర్చించి.. ఆమోద‌ముద్ర వేస్తార‌ని చెబుతున్నారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. బ‌హిరంగ మార్కెట్లో గ‌జం రూ.40వేలు ప‌లుకుతుంటే.. మిత్రుడు మ‌జ్లిస్ కు మాత్రం పెద్ద మ‌న‌సు చేసుకున్న కేసీఆర్ గ‌జం వెయ్యి రూపాయిల చొప్పున మ‌జ్లిస్ కు కేటాయించారు. నిజానికి ఈ భూమి మీద గ‌తంలో వివాదం న‌డిచింది. అప్ప‌ట్లో హైద‌రాబాద్ క‌లెక్ట‌ర్ గా ఉన్న న‌వీన్ మిట్ట‌ల్ ఈ భూమికి ఎన్ వోసీ ఇచ్చారు. దీనిపై అప్ప‌టి మంత్రి ఫిర్యాదు చేయ‌టంతో ఆ త‌ర్వాత క‌లెక్ట‌ర్ గా వ్య‌వ‌హ‌రించిన గుల్జార్ ఎన్ వోసీని ర‌ద్దు చేశారు. దీనిపై కోర్టుకు వెళ్ల‌గా.. ప్ర‌భుత్వానికి అనుకూలంగా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తాజాగా ఇంత విలువైన స్థ‌లాన్ని నామ‌మాత్రం ధ‌ర‌కు మ‌జ్లిస్ కు క‌ట్ట‌బెట్ట‌టం చూస్తే.. ముంద‌స్తు మైలేజీ కోసం కేసీఆర్ దేనికైనా రెఢీ అనేట్లుగా ఉన్నార‌న్న అభిప్రాయాన్ని ప‌లువురు వ్య‌క్తం చేస్తున్నారు.