Begin typing your search above and press return to search.

కేసీఆర్‌ ను క‌న్ఫ్యూజ్ చేస్తున్న‌ బాబు, జ‌గ‌న్

By:  Tupaki Desk   |   18 March 2018 9:54 AM GMT
కేసీఆర్‌ ను క‌న్ఫ్యూజ్ చేస్తున్న‌ బాబు, జ‌గ‌న్
X
రాజ‌కీయ వ్యూహాల్లో దిట్ట‌గా పేరున్న తెలంగాణ ముఖ్యమంత్రి - టీఆర్ ఎస్ పార్టీ అధినేత‌ కల్వకుంట్ల చంద్రశేఖరరావు రాజ‌కీయంగా ఎటు తేల్చుకోలేని స్థితిలో ప‌డ్డార‌ని ఆయ‌న స‌న్నిహిత వ‌ర్గాలు అంటున్నాయి. ఓవైపు జాతీయ రాజ‌కీయాల‌పై కన్నేసిన కేసీఆర్ పొరుగు రాష్ట్రమైన ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌యోజ‌నాల విష‌యంలో కేంద్ర ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ - వైసీపీ ప్రతిపాదించిన అవిశ్వాసం విషయంలో ఎలా వ్యవహరించాలన్నదానిపై ఒక నిర్ణ‌యానికి రాలేక‌పోతున్నార‌ని అంటున్నారు. పార్టీ ముఖ్యులతో ఈ మేర‌కు చ‌ర్చించిన‌ట్లు స‌మాచారం.

ప్రత్యేకహోదా అంశంపై ఇప్పటికే పార్లమెంట్‌ సాక్షిగా టీఆర్ ఎస్‌ మద్దతు ప్రకటించిన సంగ‌తి తెలిసిందే. అయితే అవిశ్వాసానికి మ‌ద్ద‌తిచ్చే విష‌యంలో అధికార పార్టీ - ఇటీవ‌లే ఎన్డీఏ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన టీడీపీకి మ‌ద్ద‌తు ఇవ్వాలా ముందు నుంచే ప్ర‌త్యేక‌హోదా కోసం పోరాటం చేస్తున్న ప్ర‌తిప‌క్ష వైఎస్ ఆర్ కాంగ్రెస్‌ కు మ‌ద్ద‌తు ఇవ్వాలా అనేది కేసీఆర్ ఒక క్లారిటీకి రాలేక‌పోతున్నార‌ని అంటున్నారు. తాజా రాజకీయ పరిణామాలపై అందుబాటులో ఉన్న ముఖ్యనేతలతో సీఎం కేసీఆర్‌ మాట్లాడుతున్నారు. ఆదివారం అందుబాటులో ఉన్న ఎంపీలను ప్రగతిభవన్‌ రమ్మని కోరినట్లు సమాచారం. ప్రత్యేకహోదా అంశానికి టీఆర్ ఎస్‌ మద్దతునిస్తుందని - అవిశ్వాసానికి మద్దతునివ్వాలా లేదా అన్నఅంశంపై ఇంకా పార్టీ నిర్ణయం తీసుకోలేదని పార్టీకి చెందని ఎంపీలు చెబుతున్నారు. జాతీయ రాజకీయాల్లో జరుగుతున్న మార్పులకు అనుగుణంగా చురుకుగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. అందుకు అనుగుణంగానే అవిశ్వాసం విషయంలో నిర్ణయం ఉండే అవకాశం ఉందంటున్నారు.

అవిశ్వాసంపై జరిగే చర్చలో పాల్గొని.. ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలు, రిజర్వేషన్ల అంశంపై వాదనలు వినిపించాలని టిఆర్ ఎస్‌ భావిస్తోంది. అవిశ్వాసంపై చర్చ జరిగి.. డివిజన్‌ జరిగే పరిస్థితి ఉంటే అప్పటి వాతావరణాన్ని బట్టి నిర్ణయం తీసుకుందామని, ఈ లోగా మరిన్ని రాజకీయ మార్పులు జరిగే అవకాశం ఉందని టీఆర్ ఎస్‌ భావిస్తోంది. అవిశ్వాసం విషయంలో త‌మ పార్టీ అధినేత కేసీఆర్‌ నిర్ణయం తీసుకుంటారని కేసీఆర్ త‌న‌య‌ కవిత చెప్పారు. ఇదిలాఉండ‌గా...సోమవారం ఉదయం ముఖ్యమంత్రి కేసీఆర్‌ కోల్‌ కతా వెళ్ళి మమతాబెనర్జీతో భేటీ కానుండగా, ఆమె సూచనలను కూడా పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది.