Begin typing your search above and press return to search.

ఊరించి ఊసురుమ‌నిపించిన కేసీఆర్

By:  Tupaki Desk   |   12 Oct 2020 8:00 AM GMT
ఊరించి ఊసురుమ‌నిపించిన కేసీఆర్
X
అధికారం చేతిలో ఉంది. నామినేటెడ్ ప‌దువుల్ని నియ‌మించ‌టం ద్వారా.. పార్టీ కోసం శ్ర‌మించిన వారికి ప‌ద‌వులు ఇచ్చి సంతోషానికి గురి చేయొచ్చు. మ‌రి.. టీఆర్ఎస్ అధినేత క‌మ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఏం చేస్తున్నారు? చేతిలో అధికారం ఉన్న ఆయ‌న త‌లుచుకోవాలే కానీ.. ప‌ద‌వుల పంట పండియొచ్చు. కొత్త‌వి త‌ర్వాత ఖాళీగా ఉన్న‌వి ఇచ్చినా బోలెడ‌న్ని ప‌ద‌వుల్ని పంచే వీలుంది.కానీ.. అలా చేయ‌కుండా.. ఎప్ప‌టిక‌ప్పుడు కాలం గ‌డ‌ప‌టాన్ని గులాబీ నేత‌లు జీర్ణించుకోలేక‌పోతున్నారు. 2018 డిసెంబ‌రులో రెండోసారి అధికారాన్ని చేప‌ట్టిన కేసీఆర్.. నామినేటెడ్ పోస్టుల భ‌ర్తీపై పెద్ద‌గా ఫోక‌స్ చేయ‌లేదు.

రాష్ట్రస్థాయి కార్పొరేష‌న్ ప‌ద‌వులు 54 వ‌ర‌కు ఉన్నాయి. ఇందులో 40 కార్పొరేష‌న్ల‌కు పాల‌క‌వ‌ర్గాలు లేవు. ఏడాదిన్న‌ర‌లో కొత్త నియామ‌కాలు.. ఛైర్మ‌న్ల ప‌ద‌వీకాలం పొడిగింపు లాంటివి నామమాత్రంగానే చేశార‌ని చెప్పాలి. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే.. మొద‌టిసారి అధికారంలోకి వ‌చ్చిన స‌మ‌యంలోనూ నామినేటెడ్ పోస్టుల భ‌ర్తీకి విపరీత‌మైన కాల‌యాప‌న చేసిన కేసీఆర్..ఈసారి అదే తీరును ప్ర‌ద‌ర్శిస్తున్న‌ట్లుగా చెబుతున్నారు.

అవ‌కాశం వ‌చ్చిన ప్ర‌తి సంద‌ర్భంలోనూ సీఎం కేసీఆర్ కు.. మంత్రి కేటీఆర్ కు విన‌తులు అందిస్తున్న నేత‌లు.. నామినేటెడ్ పోస్టుల మీద గంపెడు ఆశ‌ల్ని పెట్టుకున్నారు. అయిన‌ప్ప‌టికీ వారి ఆశ‌లు తీర‌ని ప‌రిస్థితి. ఇదిలా ఉంటే.. ఇప్పుడు వ‌చ్చిన వ‌రుస ఎన్నిక‌ల‌తో ఈ ఖాళీల్ని భ‌ర్తీ చేసే అవ‌కాశం అస‌లే ఉండ‌ద‌ని చెబుతున్నారు. ప్ర‌స్తుతం దుబ్బాక ఉప ఎన్నిక‌.. ఆ త‌ర్వాత గ్రేట‌ర్ ఎన్నిక‌ల‌తో పాటు.. వ‌చ్చే ఏడాదిలో వ‌చ్చే ఎమ్మెల్సీ ప‌ట్ట‌భ‌ద్రుల ఎన్నిక‌తో పాటు.. రెండు కార్పొరేష‌న్ల‌కు జ‌రిగే ఎన్నిక త‌ర్వాతే నామినేటెడ్ ప‌ద‌వుల భ‌ర్తీ ఉంటుంద‌ని చెబుతున్నారు.

ఇప్ప‌టికే ప‌ద‌వుల పంపిణీ ఆల‌స్యంగా జ‌ర‌గ‌టం.. వీటిని ఆశించేవారు ఎక్కువ‌గా ఉండ‌టంతో ప‌ద‌వుల పంపిణీ ఏ మాత్రం జరిగానా.. ఆశావాహుల మ‌నసుల్ని నొప్పించే వీలుంది. అందుకే.. ఆ ఊసే తీసుకురాకుండా ఎన్నిక‌ల త‌ర్వాత కొన్ని ఖాళీల్ని భ‌ర్తీ చేస్తార‌ని చెబుతున్నారు.దీంతో ప‌ద‌వుల్ని ఆశిస్తున్న వారికి నిరాశ త‌ప్ప‌న‌ట్లే.