Begin typing your search above and press return to search.

ఆరేళ్ల తర్వాత సారుకు ఇంత భారీగా మూడ్ రావటమా?

By:  Tupaki Desk   |   14 Dec 2020 3:36 AM GMT
ఆరేళ్ల తర్వాత సారుకు ఇంత భారీగా మూడ్ రావటమా?
X
అందుకే అంటారు ప్రజా చైతన్యానికి మించింది మరొకటి లేదని. అధికారపక్షం ఏదైనా సరే.. ప్రజలు అప్పుడప్పుడు ఓటు అనే ముల్లుకర్రతో పొడిస్తే.. అలెర్టు అవుతుంటారు. అదే సమయంలో ప్రజల అవసరాల మీద కాస్త ఫోకస్ పెడతారు. ఆరేళ్లుగా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న కేసీఆర్ సారు.. విద్యార్థి లోకం.. నిరుద్యోగ సమాజం కిందా మీదా పడినా పెద్దగా పట్టించుకోని గులాబీ బాస్ కు ఉన్నట్లుండి ఒక్కసారి మూడ్ వచ్చింది.

లక్షలాదిగా ఉన్న నిరుద్యోగ యువతకు ఏదో చేయాలన్న భావన ఆయనకు ఆరేళ్ల తర్వాత కలగటం గమనార్హం. ఢిల్లీ నుంచి వచ్చిన ఆయన.. ప్రగతిభవన్ లో రివ్యూ నిర్వహించటమే కాదు.. ఆశ్చర్యకరమైన నిర్ణయాల్ని వెల్లడించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల్ని భర్తీ చేయాలన్న నిర్ణయంతో పాటు.. అందుకు సంబంధించిన నోటిఫికేషన్లుజారీ చేయాలని ఆదేశించారు.

ముఖ్యంగా ఖాళీగా ఉన్న పోలీస్.. ఉపాధ్యాయ పోస్టులతో పాటు అన్ని శాఖల్లోని ఖాళీల్ని భర్తీ చేయాలన్న నిర్ణయాన్ని ఆయన తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 50వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు ప్రాథమికంగా సమాచారం ఉందని.. ఏ శాఖలో ఎంతమంది అవసరమో లెక్క తేల్చి.. దానికి అనుగుణంగా నోటిఫికేషన్లు విడుదల చేస్తారని చెప్పారు.

తాజాగా కేసీఆర్ చేసిన ఆదేశాలకు తగ్గట్లుగా.. రానున్న రోజుల్లో వరుస పెట్టి జాబ్ నోటిఫికేషన్లు విడుదలయ్యే అవకాశం ఉందంటున్నారు. ఇంతకాలం ఇలాంటి తీపి కబురు కోసం ఎదురు చూసిన యూత్ కు.. పండుగ లాంటి వార్తగా చెప్పాలి. ఇదంతా.. గ్రేటర్ ఎన్నికల్లో ఓటు అనే ముల్లుకర్రతో పొడినందుకేనా సారూ? ఒకవేళ అదే నిజమైతే.. మరోరెండు.. మూడు సార్లు పొడిస్తే..లెక్క మొత్తం సెట్ అయిపోతుందేమో కదా?