Begin typing your search above and press return to search.

ఈట‌ల‌ను చావుదెబ్బ తీసేందుకు కేసీఆర్ ఏం చేస్తున్నారంటే

By:  Tupaki Desk   |   7 Jun 2021 12:30 PM GMT
ఈట‌ల‌ను చావుదెబ్బ తీసేందుకు కేసీఆర్ ఏం చేస్తున్నారంటే
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి , టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ రాజ‌కీయ ఎత్తుగ‌డ‌ల గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌ను ఎదుర్కోవ‌డంలో ఆయ‌న వ్యూహాలు అంచ‌నాల‌కు అంద‌వు. స‌రిగ్గా అలాంటి నిర్ణ‌యమే తాజాగా త‌న ఒకనాటి స‌హ‌చ‌రుడు, మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ విష‌యంలో అమ‌లు చేయ‌నున్నార‌ని అంటున్నారు. ఇందుకు భారత దేశ ఆర్థిక పితామహుడు, బహుభాషా కోవిదుడిగా గుర్తింపు పొందిన మాజీ ప్రధాని స్వర్గీయ పీవీ నరసింహరావు పేరును ఉప‌యోగించుకుంటున్నార‌ని విశ్లేష‌కులు చెప్తున్నారు.

మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్తూ బీజేపీలో చేర‌నున్న సంగ‌తి తెలిసిందే. దాదాపు 19 ఏళ్లుగా హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో త‌న‌కున్న ప‌ట్టుతో రాబోయే ఉప ఎన్నిక‌ల్లో గెలుపు ఖాయ‌మ‌ని ఈట‌ల భావిస్తున్నారు. అయితే, ఈట‌ల‌ను ఆదిలోనే చావుదెబ్బ కొట్టేలా కేసీఆర్ గేమ్ రెడీ చేశార‌ని అంటున్నారు. మాజీ ప్ర‌ధాన‌మంత్రి పీవీ న‌ర‌సింహారావు పేరిట జిల్లాను ఏర్పాటు చేసేందుకు సిద్ధ‌మైన‌ట్లు స‌మాచారం. ఈ నెల 28న అపర చాణుక్యుడు పీవీ వందో జయంతి ఉండటంతో తెలంగాణ ప్రభుత్వం ఆయన పేరును చిరస్థాయిలో నిలిపేందుకు జిల్లా పేరు ప్ర‌క‌టించ‌నుంద‌ని తెలుస్తోంది. ఇదే స‌మ‌యంలో ఈట‌ల‌కు చెక్ పెట్ట‌నున్న‌ట్లు చెప్తున్నారు.

ఇప్పటికే పీవీ జిల్లాను ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌తో హుజురాబాద్ ప్రాంత వాసులు ఆందోళనలు చేశారు. ఈ జిల్లాలోని కమలాపూర్, ఎల్కతుర్తి మండలాల్లోని సరిహద్దు గ్రామాలను కలుపుకుంటూ ఓ మండలం, వీరభద్రస్వామి కొలువై ఉన్న కొత్తకొండను, పీవీ పుట్టిన వంగర కేంద్రంగా రెండు నూతన మండలాలను ఏర్పాటు చేసే అవకాశం కూడా ఉంటుందంటున్నారు. వరంగల్ అర్బన్ జిల్లా స్థానంలో హుజురాబాద్ కేంద్రంగా పీవీ జిల్లాను ఏర్పాటు చేస్తే హుజురాబాద్ పరిసర ప్రాంతాల్లోని ప్ర‌జ‌లు ఈట‌ల రాజేంద‌ర్ వైపు కాకుండా టీఆర్ఎస్ వైపు ఉప ఎన్నిక‌ల్లో మొగ్గు చూప‌నున్నార‌ని చెప్తున్నారు. తమ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు వచ్చిందన సంతోషంలో ఓటర్లు టీఆర్ఎస్‌కు మరింత అనుకూలంగా మారుతారని విశ్లేషిస్తున్నారు.