Begin typing your search above and press return to search.

తెలంగాణలో మరో పత్రిక.. కేసీఆర్ స్ట్రాటజీ ఏంటి.?

By:  Tupaki Desk   |   21 May 2018 12:40 PM GMT
తెలంగాణలో మరో పత్రిక.. కేసీఆర్ స్ట్రాటజీ ఏంటి.?
X
సీఎం కేసీఆర్ కు సపోర్టుగా స్వయంగా టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఓ పత్రిక తెలంగాణలో ఉంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు - ఎంపీ - ప్రజాప్రతినిధులంతా ఇప్పుడా పత్రికకు ఇతోధికంగా దన్నుగా ఉండి ముందుకు నడిపిస్తున్నారన్నది బహిరంగ రహస్యమే.. ఇక కేసీఆర్ కు సపోర్టుగా మరో రెండు అగ్రపత్రికలు ఉన్నాయి. ప్రధానంగా ఉమ్మడి ఏపీలో ఉన్న ఆ రెండు పత్రికలు అక్కడ చంద్రబాబుకు - ఇక్కడ కేసీఆర్ కు సపోర్టుగా రాస్తూ స్వామి కార్యం.. సకర్యాలను పూర్తి చేసుకుంటున్నాయి..

అయితే ఆశ్చర్యకరంగా ఇప్పుడు తెలంగాణలో మరో పత్రిక రాబోతోంది. అదీ టీఆర్ ఎస్ ముఖ్యుడిదే కావడం విశేషం.. మాజీ ఎంపీ - ప్రముఖ పారిశ్రామిక వేత్త అయిన జి.వివేక్ సారథ్యంలో నడుస్తున్న వీ6 చానెల్ ఇప్పటికే తెలంగాణ తో పాటు ఏపీలో అందరికీ సుపరిచితమే.. ఈ చానెల్ లో వచ్చే తీన్మార్ ప్రోగ్రాం ద్వారా సత్తి ఫేమస్ అయ్యారు. సత్తి చేసే కామెడీతో ఈ చానెల్ టీఆర్పీ రేటింగులు కూడా పెరిగాయి.. తాజాగా ఇదే వీ6 యాజమాన్యం నుంచి ఓ కొత్త పత్రిక వస్తున్నట్టు తాజాగా పత్రికల్లో - మీడియాలో ప్రకటనలు ఇస్తున్నారు. విలేకరులు - సీనియర్ జర్నలిస్టులు కావాలంటూ కోరుతున్నారు..

తెలంగాణలో ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కు తోడుగా, నీడగా నిలబడడానికి పత్రికలే లేవు. కేసీఆర్ కు సొంతంగా ఓ పత్రిక ఉంది. ఇప్పుడు టీఆర్ ఎస్ లో కీలకంగా ఉన్న మాజీ ఎంపీ - ప్రభుత్వ ముఖ్య సలహాదారు అయిన జీ. వివేక్ సారథ్యంలో మరో పత్రిక రాబోతోంది. ఇప్పటికే తెలంగాణ లోని పత్రికల్లో వార్ వన్ సైడ్ గా నడుస్తోంది. కేసీఆర్ మాటే శాసనంగా కథనాలు వస్తున్నాయి. ఇంత సపోర్టుగా ఉండగా.. మళ్లీ టీఆర్ ఎస్ తరఫున మరో పత్రిక పురుడు పోసుకోవడం విశేషంగా చెప్పవచ్చు..

నిజానికి పార్టీలు పత్రికలు పెట్టడం ఎప్పుడో మొదలైంది. చంద్రబాబు ప్రోత్సాహంతో రెండు తెలుగు పత్రికలు నడుస్తున్నాయన్నది ఎప్పటినుంచో ప్రచారం ఉంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా టీడీపీకి వ్యతిరేకంగా తమ గళం వినిపించేందుకు ఓ పత్రిక స్థాపించాడు.. ఆ తర్వాత కేసీఆర్ కూడా ఉద్యమంలో తోడుంటుందని పత్రికను పెట్టాడు. ఇప్పుడు చాన్నాళ్ల తర్వాత మళ్లీ ఇంకో పత్రిక టీఆర్ఎస్ ముఖ్యుడి నుంచి వెలువడుతుండడం చర్చకు దారితీసింది.

ఇక తెలంగాణలో బలపడాలనుకుంటున్న బీజేపీ కూడా ఓ పత్రికను లాంచ్ చేసింది. అప్పట్లోనే టీఆర్ఎస్ నుంచి విడిపోయి బీజేపీలో చేరిన ప్రముఖ పారిశ్రామిక వేత్త సీఎల్ రాజం ‘విజయక్రాంతి’ అనే పత్రికను స్థాపించాడు. అది ఇప్పుడిప్పుడే విస్తరిస్తోంది. టీఆర్ ఎస్ - బీజేపీకి తలో పత్రికలున్నా పాపం కాంగ్రెస్ వాణి వినిపించేందుకే తెలంగాణలో పత్రిక లేకపోవడం ప్రధాన లోపంగా చెప్పవచ్చు..