కాలం మహా సిత్రమైంది. ఎందుకు పనికిరాని వాడిని తిరుగులేని మహా శక్తిగా మారుస్తుంది. ఎవరూ ఢీ కొట్టలేరన్నట్లు ఉండే మహా బలుడ్ని ప్రతిఒక్కరికి భయపెట్టేలా చేసే టాలెంట్ కాలం సొంతం. చేసిన తప్పులకు వడ్డీతో సహా మూల్యం చెల్లించే తీరు తాజాగా ఏపీ అసెంబ్లీ సమావేశాల్ని చూస్తే అర్థం కాక మానదు.
తాజాగా జరుగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాల్ని చూస్తే.. 23 మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల్ని పార్టీలోకి తీసుకొని ఎంత పెద్ద తప్పు చేశామా? అన్న భావన కలగటం ఖాయం. చేతిలో అధికారం ఉన్నప్పుడు పార్టీ ఫిరాయింపుల వ్యవహారం పెద్ద విషయంగా అనిపించక పోగా.. విపక్ష నేతల ఆక్రోశాన్ని ఎటకారంగా చేసేవారు టీడీపీ నేతలు.
ఇప్పుడదే వారి కొంప ముంచుతోంది. అసెంబ్లీలో మాట్లాడే ప్రతి ఒక్క వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే.. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన బాబు దుర్మార్గాన్ని ఏకిపారేస్తున్నారు. అంతేనా.. తమపై ఎంతలా ఒత్తిడి తెచ్చారో బయటపెట్టి.. బాబు జమానాలో ఎన్ని కుట్రలు.. మరెన్ని కుతంత్రాలు జరిగాయో కళ్లకు కట్టినట్లుగా చూపిస్తున్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు చూస్తున్న చాలామందిలో ఒక భావన రాక మానదు.
తిరుగులేని అధికారం కోసం తన చేతిలో మస్తుమంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ ప్రతిపక్షమే లేకుండా చేయాలన్నట్లుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రయత్నాలు.. ఫ్యూచర్ లో ఆయనకు చుక్కలు కనిపించేలా చేస్తాయన్న అభిప్రాయం కలుగక మానదు. పవర్లో ఉన్నప్పుడు ఏపీ ముఖ్యమంత్రి చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ ను క్వశ్చన్ చేసినోళ్లు లేరు. కానీ.. పవర్ చేతులు మారిన తర్వాత.. ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొనటమే కాదు.. ఎందుకంత తప్పు చేశామా? అన్న భావనతో కిందామీదా పడిపోతున్నారు తెలుగుతమ్ముళ్లు.
రాబోయే రోజుల్లో కేసీఆర్ కు ఇలాంటి దుస్థితి దాపురించటం ఖాయమంటున్నారు. ఏపీతో పోలిస్తే.. తెలంగాణలో నేతలు మాత్రమే కాదు.. ప్రజలు సైతం చైతన్యవంతులు.. ఇప్పటికే పార్టీ మారిన ఎమ్మెల్యేలు అదనపు సెక్యురిటీ బండి లాగిస్తున్న వేళ. .ఏపీలో చోటు చేసుకున్న పరిణామాలు కేసీఆర్ కు ఇబ్బందికర పరిస్థితికి తీసుకురావటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.