Begin typing your search above and press return to search.

హుజూరాబాద్ లో కేసీఆర్ ఫార్ములా దారుణంగా ఫెయిల్.. అర్జెంట్ ప్లాన్ అవసరం

By:  Tupaki Desk   |   7 Nov 2021 6:30 AM GMT
హుజూరాబాద్ లో కేసీఆర్ ఫార్ములా దారుణంగా ఫెయిల్.. అర్జెంట్ ప్లాన్ అవసరం
X
పక్కా ప్లానింగ్.. అంతకు మించిన ఫార్ములాతో విజయాన్ని సాధించొచ్చా? విజయానికి ఫార్ములా ఉంటుందా? అందునా రాజకీయాన్ని ఫార్ములాగా మార్చటం కుదురుతుందా? లాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలుగా కేసీఆర్ తీరు ఉంటుందన్న వాదన గులాబీ నేతల్లో వినిపించేది. తనకు నచ్చని ఈటల రాజేందర్ కు టైం చూసుకొని మరీ పొగ బెట్టటం.. సొంత మీడియాలో అవినీతి ఆరోపణలు కుమ్మరించటం.. విచారణ పేరుతో ఉక్కిరిబిక్కిరి చేయటం.. రాత్రికి రాత్రే ఉద్యమ నేత.. త్యాగాలకు కేరాఫ్ అడ్రస్ అయిన ఈటల రాజేందర్ ప్రభుత్వ స్థలాల కబ్జాదారుడి ఆరోపణలకు గురి కావటం తెలిసిందే. తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు తెలిసినవే.

దశాబ్దాల తరబడి నిర్మించుకున్న కోటలు బద్ధలైపోయి.. ఉనికే ప్రమాదకరంగా మారి.. కొత్తగా మరోసారి తానేమిటి? ప్రజల్లో తనకున్న ఇమేజ్ ఎంతన్న విషయాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఈటల రాజేందర్ కు పడింది. అందుకే.. తన మంత్రి పదవికి.. ఆ తర్వాత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయటంతో పాటు గులాబీ కారులో నుంచి దిగేసి.. నడి రోడ్డు మీద నిలబడిన పరిస్థితి. అప్పటివరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కీలక నేతగా.. మోస్ట్ పవర్ ఫుల్ గా ఉన్న నేత కాస్తా.. ఏమీ లేని వాడిగా నిలబడాల్సిన పరిస్థితి.

కేసీఆర్ తో పెట్టుకుంటే ఎంతటి నేతకైనా ఇలాంటి సీనే ఎదురవుతుందన్న మాట బలంగా వినిపిస్తున్న వేళ.. ఆ మాట తప్పన్న విషయాన్నిఅందరికి అర్థమయ్యేలా చేయాలన్న మొండితనం ఈటలలో అంతకంతకూ పెరిగిపోయింది. దీనికి తోడు కేసీఆర్ సర్కారు నుంచి ఎదురైన సవాళ్లతో విసిగిపోయిన ఈటల దంపతులు.. అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంలోనే.. ఉన్న ఆస్తి మొత్తం అమ్మేద్దాం.. రాజకీయంగా తామేమిటన్నది ఫ్రూవ్ చేసుకోవాలని తన భార్య తనకు చెప్పినట్లుగా ఈటల ఆ మధ్యలో వెల్లడించారు.
దీంతో.. హుజూరాబాద్ ఉప ఎన్నిక తన రాజకీయ జీవితానికి చావో రేవో అన్నట్లుగా మారిందన్న విషయాన్ని ఈటల చెప్పకనే చెప్పేశారు. ఇదిలా ఉంటే.. ఈటల కాదు.. ఎంతటి తోపు నేతను అయినా సరే.. తన మాటకు భిన్నంగా వ్యవహరిస్తే.. వారికి రాజకీయ జీవితమే ప్రశ్నార్థకంగా మార్చాలన్న దానికి కేసీఆర్ భారీ ఫార్ములాను సిద్ధం చేసినట్లు చెబుతారు. దాని ప్రయోగశాలగా హుజూరాబాద్ ను మార్చారని చెబుతారు. ఉప ఎన్నికకు దాదాపు ఆర్నెల్ల ముందు నుంచే.. తన ఫార్ములాను కేసీఆర్ అమలు చేయటం మొదలు పెట్టారు. మంత్రులు.. కీలక నేతల్ని హుజూరాబాద్ లో దింపటం.. కులాల వారీగా కొందరు నేతల్ని హుజూరాబాద్ లో మకాం పెట్టించి.. ఆయా ఓటర్లను తమ వైపునకు తిప్పుకునేందుకు చేసిన ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఏపీలో మాదిరి కులాల మధ్య విభజించి పాలించు సిద్ధాంతాన్ని అమలు చేయటం ద్వారా హుజూరాబాద్ లో గెలవొచ్చన్నట్లుగా కేసీఆర్ ప్లానింగ్ మారింది. ఈటల స్థానంలో ఒక బీసీని తీసుకురావటం.. రెడ్డి ఓట్లను ఆకర్షించేందుకు నియోజకవర్గంలో పట్టున్న కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డిని తీసుకురావటం.. ఎక్కువమంది ఓటర్లుగా ఉన్న దళితులకు దళితబంధు అనే పథకం ద్వారా వారిని తనవైపునకు ఆకర్షించేలా ఆయన ప్లాన్ చేశారు.

ఇలా హుజూరాబాద్ లో ఏ వర్గానికి ఆ వర్గానికి ఏదో ఒక తాయిలాన్ని ఇవ్వటం ద్వారా.. అందరిని సంతోషపర్చటం ద్వారా తాను సంతోషానికి గురవుతానన్నట్లుగా వ్యవహరించారు కేసీఆర్. హుజూరాబాద్ ఉప ఎన్నికకు సంబంధించి గులాబీ అధినేత వేసిన ప్లాన్ పేపర్ మీద చూసినప్పుడు వావ్.. వండర్ ఫుల్ అన్నట్లుగా ఉండటమే కాదు.. ఇంతకు మించిన ఫార్ములా ఇంకేం ఉంటుందన్నట్లుగా అనిపించక మానదు. అయితే.. ఓట్ల పరీక్షలో విజయానికి డబ్బు.. కులాలకు మించింది మరొకటి ఉందని.. అదే భావోద్వేగమన్న కీలక విషయాన్ని కేసీఆర్ మిస్ కావటం ప్రధాన లోపంగా చెప్పక తప్పదు.

అంతేకాదు.. తమను ఓడించేందుకు జాతీయ స్థాయిలో రాజకీయ శత్రువులైన కాంగ్రెస్ - బీజేపీలు ఒక్కటైనట్లుగా ఆరోపించి.. ప్రజల్లో కొత్త సందేహాలకు తెర తీయటం ద్వారా ఉప పోరులో లబ్థి పొందాలని కేసీఆర్ భావిస్తే.. అందుకు భిన్నమైన తీర్పును ఇచ్చారు హుజూరాబాద్ ఓటర్లు. హుజూరాబాద్ ఉప పోరులో గులాబీ పార్టీ కానీ గెలిచి ఉంటే.. విజయానికి అవసరమైన ఫార్ములాను తాను సిద్ధం చేసినట్లుగా కేసీఆర్ భావించేవారు.కానీ.. హుజూరాబాద్ ప్రజలు గులాబీ బాస్ కు కొత్త సవాలు విసిరారు.

ఆయన ఎంతో నమ్మకంగా తయారు చేసుకున్న ఎన్నికల ఫార్ములా ఎందుకు పనికి రాదన్నట్లుగా తీర్పు ఇచ్చేయటంతో ఇప్పుడు తన ప్లానింగ్ మీద పునరాలోచనలో పడినట్లుగా చెప్పక తప్పదు. ఏపీ ఓటర్లతో పోలిస్తే.. పరిణితితో తీర్పు ఇవ్వటంలో తమకు మించినోళ్లు లేరన్న విషయాన్ని తెలంగాణ ఓటర్లు హుజూరాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా మరోసారి స్పష్టం చేసినట్లుగా చెప్పాలి. అదే.. కేసీఆర్ కు ఇప్పుడు మరో ఫార్ములాను సిద్ధం చేసుకోవాల్సిన అవసరాన్ని ఏర్పడేలా చేసింది. ఈసారి ఎలాంటి పార్ములాను సిద్ధం చేస్తారో చూడాలి.