Begin typing your search above and press return to search.

అటు చంద్రుడు ఇటు.. ఇటు చంద్రుడు అటు

By:  Tupaki Desk   |   22 Sep 2015 7:17 AM GMT
అటు చంద్రుడు ఇటు.. ఇటు చంద్రుడు అటు
X
రోజురోజుకీ మారిపోయేదే రాజకీయమని చెప్పాడో పెద్దాయన... ఇప్పుడు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పొలిటికల్ సీన్ చూస్తుంటే ఆ మాట నిజమే అని ఒప్పుకోక తప్పదు. రాష్ట్ర విభజన తరువాత రెండు కొత్త రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పడిన తరువాత ఎన్నో పరిణామాలు... ఖాళీ ఖజానాతో ఏపీ కష్టాల్లో చిక్కుకోగా.. మాది ధనిక రాష్ట్రమంటూ మిగులు నిధులతో తెలంగాణ దిల్ దార్ గా కనిపించింది. అంతేకాదు... రాజకీయంగానూ ఏపీలో రుణమాఫీ అమల్లో ఆలస్యం, అమల్లో చిన్నచిన్న లోటుపాట్లు, ప్రత్యేక హోదా రాకపోవడం, రాజధానికి భూసమీకరణ వంటి సమస్యలు ఏపీ సీఎం చంద్రబాబు ఎదుర్కోగా తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం అన్ని పార్టీల నుంచి నోరున్న నేతలందరినీ టీఆరెస్ లో చేర్చుకుని బలంగా కనిపించారు. అయితే... కొద్ది రోజుల్లోనే పరిస్థితులు తారుమారయ్యాయి... ఏపీ సీఎం చంద్రబాబు ఒక్కొక్క సమస్య పరిష్కరించుకుంటూ మళ్లీ రైజింగ్ లోకి వస్తుండగా కేసీఆర్ మాత్రం పాలనలో తడబడుతూ అందరితో విమర్శలు ఎదుర్కొంటూ ఇబ్బందిపడుతున్నారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణను ఏడాదిలోనే అప్పుల కుప్పను చేసేశారు.

కొద్దికాలం కిందట తెలంగాణ ప్రభుత్వం వేసిన ఎత్తుగడలో దెబ్బతిని ఓటుకు నోటు కేసులో విలవిలలాడిన చంద్రబాబును చూసి అంతా ఆయన పనైపోయిందనుకున్నారు. ఒక దశలో ఆయన రాజీనామా తప్పదనుకున్నారు... కానీ, చంద్రబాబు ఈ కేసు నుంచి ఏదోరకంగా గట్టెక్కడమే కాకుండా ఎప్పటిలా పాలనపై దృష్టిసారించారు. ఈలోగా ప్రపంచ బ్యాంకు ఏపీని ఇండియాలో నంబర్ 2 రాష్ట్రమని ప్రకటించింది... రుణమాఫీ - రాజధాని భూసమీకరణ సమస్యలూ కొలిక్కి వచ్చాయి.. మంత్రుల స్థాయిలో జరుగుతున్న అవినీతిపైనా చంద్రబాబు సీరియస్ అవుతూ... మంత్రులు జారీ చేసిన జీవోలను ఏకంగా రాత్రికి రాత్రే ఆపేసి పారదర్శకతకు పెద్ద పీట వేస్తుండడంతో ప్రజల్లో మళ్లీ నమ్మకం సంపాదించుకుంటున్నారు. హైదరాబాద్ ను విడిచిపెట్టి విజయవాడ నుంచి పాలన సాగిస్తూ ఏపీ ప్రజల ఆదరణ చూరగొంటున్నారు.

మరోవైపు కేసీఆర్ మాత్రం నేను పట్టిన కుందేలుకు మూడే కాళ్లన్నట్లుగా వ్యవహరిస్తూ నచ్చినట్లు పాలన సాగిస్తున్నారు.. దీంతో బయటకు అనలేకపోయినా టీఆరెస్ నేతలు - మంత్రులు కూడా ఆయనపై అసంతృప్తిగా ఉన్నారు. రైతుల ఆత్మహత్యలను అస్సలు పట్టించుకోకపోవడంతో విపక్షాలు ఆయనపై తీవ్రమైన ఎదురుదాడి చేస్తున్నాయి. మొదట్లో ప్రతిపక్షాలన గొంతు నొక్కగలిగిన టీఆరెస్ ఇప్పుడు ఆ పనిచేయలేకపోతోంది. రైతుల ఆత్మహత్యలపై ప్రతిపక్షాల విమర్శలను తిప్పి కొట్టడానికి తమ వద్ద అస్త్రమేమీ లేక దిక్కులు చూస్తోంది.

అదేసమయంలో వివిధ పథకాలు, ఖర్చుల కోసం నిధులన్నీ ఖర్చయిపోయి అధిక వడ్డీలకు అప్పులు తెస్తున్నారు. మరోవైపు ఏపీ సీఎం విదేశాలకు వెళ్లి పెట్టుబడులు సాధిస్తుండగా వెళ్లక వెళ్లక ఇటీవలే చైనా వెళ్లిన కేసీఆర్ అక్కడ నుంచి పెద్దగా ఏమీ రాబట్టలేకపోయారు. ఇవన్నీ నిశితంగా గమనిస్తున్న ప్రజలు కేసీఆర్ పై పెట్టుకున్న అపార నమ్మకం అలాఅలా కరిగిపోతోంది. రాజకీయాల్లో తలపండినవారు... చంద్రబాబు - కేసీఆర్ లు ఇద్దరినీ దగ్గరగా చూసినవారు మాత్రం ఈ సీను మేం ముందే ఊహించాం... ముందుముందు ఇంకా చాలా చూస్తారు అంటున్నారు.