Begin typing your search above and press return to search.

3 విగ్రహాలు.. 10 ఎకరాలు.. రూ.10కోట్లు

By:  Tupaki Desk   |   18 Oct 2015 9:31 AM GMT
3 విగ్రహాలు.. 10 ఎకరాలు.. రూ.10కోట్లు
X
తనను అతిధిగా పిలిచిన ఎవరి మనసును నొప్పించని పెద్ద మనసు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ది. అయితే. ఈ విషయానికి షరతులు వర్తిస్తాయి. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న కేసీఆర్ ను కార్యక్రమానికి రావాలంటూ పలువురు ఆహ్వానిస్తుంటారు. కానీ.. ఆయన వెళ్లేది మాత్రం చాలా కొద్ది కార్యక్రమాలకే. కానీ.. వెళ్లిన కార్యక్రమంలో మాత్రం అక్కడి వారి మనసు దోచుకోందే వెనుదిరగరు. అదే కేసీఆర్ స్పెషాలిటీ. తనను కార్యక్రమానికి పిలిచిన వారికి కడుపు నిండేలా వరాలు ఇచ్చేయటం ఆయనకు అలవాటే.

ఆ మధ్య హైదరాబాద్ మహానగరంలోని పలు వర్గాల వారి కార్యక్రమాలకు హాజరై.. ఒక్కొక్కరికి ఒక్కో వరాన్ని ఇవ్వటం తెలిసిందే. కొంతకాలం పాటు సాగిన ఈ ప్ర్రక్రియ ఆ మధ్యన కాస్త ఆగింది. తాజాగా మరోసారి అలాంటి వరాల కార్యక్రమాన్ని షురూ చేసినట్లుగా కనిపిస్తోంది. తాజాగా పాతబస్తీలోని అలియాబాద్ రెడ్డి జనసంఘం వజ్రోత్సవ వేడుకలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజసేవలో రెడ్డి జన సంఘం చేస్తున్న విశేష కృషిని కీర్తించిన ఆయన.. ట్యాంక్ బండ్ మీద రావు బహదూర్ వెంకటరామారెడ్డి.. రావి నారాయణ రెడ్డి.. సురవరం సుధాకర్ రెడ్డి విగ్రహాల్ని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.

అంతేకాదు.. రెడ్డి హాస్టల్ విస్తరణ కోసం పది ఎకరాల స్థలాన్ని హైదరాబాద్ పరిసరాల్లో కేటాయిస్తామని చెప్పిన ఆయన.. ఇందుకు అవసరమయ్యే రూ.10 కోట్లను మంజూరు చేస్తామని వరాల మీద వరాలు ఇచ్చేసి ఉక్కిరిబిక్కిరి చేసేశారు. ఒకే వేదిక మీద నుంచి ఇన్ని వరాలు ఒక సామాజిక వర్గానికి ఏ ముఖ్యమంత్రి మాత్రం ఇవ్వగలరు. ఇలాంటివి కేసీఆర్ కు మాత్రమే సాధ్యమవుతాయేమో.