Begin typing your search above and press return to search.

సండ్ర కోసం అత్య‌వ‌స‌రం కింద ప‌ని పూర్తి చేసిన కేసీఆర్

By:  Tupaki Desk   |   19 April 2019 4:36 AM GMT
సండ్ర కోసం అత్య‌వ‌స‌రం కింద ప‌ని పూర్తి చేసిన కేసీఆర్
X
రాజు త‌లుచుకుంటే దెబ్బ‌ల‌కు కొద‌వా? అన్న‌ది పాత సామెత‌. మారిన కాలానికి త‌గ్గ‌ట్లు సామెత‌ల్ని కాస్తా మార్చే వీలుంటుంది. ప్ర‌జాస్వామ్య భార‌తంలో రాజేంటి రాజు? పేర్ల ప‌లుకుబ‌డిని గుర్తించ‌రా? ఒక మోడీ.. ఒక బాబు.. అంత‌కు మించి కేసీఆర్ లాంటోళ్లంతా ఏమైపోవాలి? రాజు త‌లుచుకున్నా.. కేసీఆర్ అనుకున్నా కానిది ఏమైనా ఉంటుందా చెప్పండి? తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చిన ఉదంతాన్ని చూస్తే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ తాను అనుకున్న ప‌నిని ఎంత యుద్ధ ప్రాతిప‌దిక‌న పూర్తి చేయిస్తార‌న్న‌ది ఇట్టే అర్థ‌మైపోతుంది.

టీడీపీ ఎమ్మెల్యేగా కొన‌సాగుతూ వ‌చ్చిన ఖ‌మ్మం జిల్లాకు చెందిన సండ్ర వెంక‌ట వీర‌య్య‌.. ఈ మ‌ధ్య‌నే ముగిసిన ముంద‌స్తు ఎన్నిక‌ల అనంత‌రం గులాబీ కండువా క‌ప్పుకొని.. కారు ఎక్కేందుకు రెఢీ కావ‌టం తెలిసిందే. ఆ మ‌ధ్య వ‌ర‌కూ టీడీపీలోనే ఉన్న ఆయ‌న‌.. కారు ఎక్క‌టంలో ఏదైనా కార‌ణం ఉందా? అంటే.. నో అంటే నో అనేయ‌టం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర సీఎం చేస్తున్న అభివృద్ధి కార్య‌క్ర‌మాలు.. బంగారు తెలంగాణ కోసం ఆయ‌న చేస్తున్న ప్ర‌య‌త్నాల‌ను చూసి మ‌నసు పారేసుకొని టీఆర్ ఎస్ లో చేరుతున్న‌ట్లుగా చెప్పుకొచ్చారు సండ్ర‌.

ఆయ‌న మ‌న‌సు అంత‌లా మార‌టానికి కార‌ణం ఏమిట‌న్న విష‌యం తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఖ‌మ్మం ప‌ట్ట‌ణంలో ఉన్న నాగార్జున సాగ‌ర్ ప్రాజెక్టు మిగులు భూమిని ఎమ్మెల్యే సండ్ర పేరు మీద వెనువెంట‌నే క్ర‌మ‌బ‌ద్ధీక‌రించాల‌ని కేసీఆర్ ఆదేశాలు జారీ చేసిన వైనం బ‌య‌ట‌కు వ‌చ్చింది. దీన్ని.. అత్య‌వ‌స‌రం కింద లెక్క‌లోకి తీసుకొని క్ర‌మ‌బ‌ద్ధీక‌ర‌ణ చేయాల‌ని చెప్పేశారు.

రాజు త‌లుచుకున్నా.. కేసీఆర్ డిసైడ్ అయిన త‌ర్వాత ఆపేవారు.. అబ్జెక్ష‌న్ చెప్పే వారు ఎవ‌రుంటారు చెప్పండి? అందుకే ముఖ్య‌మంత్రి వారి ఆదేశాల నేప‌థ్యంలో వెనువెంట‌నే స‌ద‌రు భూమిని అప్ప‌గించే ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేయ‌నున్నారు. మార్చి 2న కేసీఆర్ ను క‌లిసిన సండ్ర‌.. పార్టీలో చేరేందుకు సానుకూల‌త ప్ర‌ద‌ర్శించారు. ఆ త‌ర్వాత నాగార్జున సాగ‌ర్ ప్రాజెక్టు మిగులు భూమిని త‌న పేరిట క్ర‌మ‌బ‌ద్దీక‌రించాల‌ని కోరారు.

ఖ‌మ్మం ప‌ట్ట‌ణంలోని బుర్హాన్ పురం రెవెన్యూ గ్రామ ప‌రిధిలో స‌ర్వే నెంబ‌రు 98లో ఉన్న వెయ్యి గ‌జాల్లో సండ్ర క్వార్ట‌ర్ విస్త‌రించి ఉంది. 2017లో దీన్ని ప‌గుల‌కొట్టి.. భూమిని చ‌దును చేసి ఉంచారు. ఇక్క‌డ రిజిస్ట్రేష‌న్ విలువ గ‌జం రూ.5వేలు ఉండ‌గా.. బ‌హిరంగ మార్కెట్లో గ‌జం రూ.50 వేలుగా ఉంది. 24 ఏళ్లుగా తాను ఇదే స్థ‌లంలో ఉన్నందున ఈ భూమిని త‌న పేరు మీద క్ర‌మ‌బ‌ద్ధీక‌రించాల‌ని కోరారు. గులాబీ కండువా వేసుకునే స‌మ‌యంలో అడిగిన సండ్ర కోరిక‌ను అంత పెద్ద మ‌న‌సున్న కేసీఆర్ కాదంటారా? గులాబీ బాస్ క‌మ్ ముఖ్య‌మంత్రి వారి పుణ్య‌మా అని రూ.5 కోట్లు విలువ చేసే స్థ‌లం సండ్ర‌కు రూ.10 ల‌క్ష‌ల‌కే ల‌భించ‌నుంది. కారు ఎక్కే ప‌క్క పార్టీ ఎమ్మెల్యేకు ముఖ్య‌మంత్రి స్థానంలో ఉన్న కేసీఆర్ ఆ మాత్రం ప్రోత్సాహం ఇవ్వ‌కుంటే బాగుంటుందా చెప్పండి?